logo

నిజాం నగలు నగరానికి వచ్చేదెన్నడో..?

ఆర్బీఐ అధీనంలో ఉన్న నిజాం నగలను నగరానికి తీసుకురావాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం భవనం, భద్రత ఏర్పాట్లు చేస్తే వాటిని తీసుకురావడానికి ఇబ్బందులు లేవని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రెండేళ్ల క్రితం ప్రకటించారు.

Updated : 21 Jun 2024 08:07 IST

దిల్లీలోని నేషనల్‌ మ్యూజియంలో నిజాం ఆభరణాలు 

ఈనాడు, హైదరాబాద్‌: ఆర్బీఐ అధీనంలో ఉన్న నిజాం నగలను నగరానికి తీసుకురావాలన్న డిమాండ్‌ పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం భవనం, భద్రత ఏర్పాట్లు చేస్తే వాటిని తీసుకురావడానికి ఇబ్బందులు లేవని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రెండేళ్ల క్రితం ప్రకటించారు. సొంత భవనం లేదా సాలార్‌జంగ్‌ మ్యూజియంలోనే ఓ ప్రత్యేక ప్రదర్శనశాల ఏర్పాటు చేయాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కేవలం రెండుసార్లు (2001, 2006లో) మాత్రమే హైదరాబాద్‌లో నిజాం నగలను ప్రదర్శించారు.

రూ.218 కోట్లకు కొనుగోలు..

ప్రపంచంలోనే అత్యంత సంపన్నుల్లో ఆరో స్థానంలో ఉన్న నిజాంకు భారీగా ఆస్తులున్నాయి. వీటి విలువ ఏకంగా రూ.11,80,000 కోట్లుగా అంచనా. ఏడో నిజాం ఉస్మాన్‌ అలీఖాన్‌ 1967లో 80 ఏళ్ల వయసులో కన్నుమూశారు. అప్పటివరకు భారతీయుల్లోనే అత్యంత సంపన్నుల్లో ఆయన ఒకరు. ప్రస్తుతం నిజాం నగలు కేంద్రం అధీనంలో ఉన్నాయి. 1995లో కేంద్రం వీటిని రూ.218 కోట్లకు కొనుగోలు చేసింది. 

ఇవి ప్రత్యేకం...: 173 రకాల వజ్రాభరణాలు, వెండి వస్తువులు వీటిలో ఉన్నాయి. తలపాగా ఆభరణాలు, నెక్లెస్‌లు, చెవిపోగులు, ఆర్మ్‌బ్యాండ్‌లు, కంకణాలు, గంటలు, బటన్‌లు, కఫ్‌లింక్‌లు, చీలమండలు, వాచ్‌చైన్, ఉంగరాలు, ముత్యాలు, వైఢూర్యాలు, పగడాలు తదితర నగలున్నాయి.  ఏడుతీగల బస్రా ముత్యాలహారాన్ని సత్లాడ అని పిలుస్తారు. ఇందులో 465 ముత్యాలను పొందుపరిచారు. 184.7 క్యారెట్ల బరువున్న ప్రపంచంలోనే అయిదో పెద్దదైన జాకబ్‌ డైమండ్‌ విలువైన వస్తువుల్లో ఒకటి. దిల్లీలోని నేషనల్‌ మ్యూజియంలో భారీ భద్రత నడుమ వీటిని ప్రదర్శిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని