logo

ఆహా అని తింటే ఆసుపత్రికే.. ఆల్ఫా హోటల్‌లో దారుణ పరిస్థితులు..!

ఆహార కల్తీ నగరవాసులను కలవరపెడుతోంది. రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆదేశాలతో రాష్ట్ర స్థాయి అధికారులు, జీహెచ్‌ఎంసీ అధికారులతో కొలువుదీరిన టాస్క్‌ఫోర్స్‌ బృందం కొన్ని రోజులుగా నగరంలోని హోటళ్లలో తనిఖీలు చేస్తోంది.

Updated : 21 Jun 2024 09:08 IST

విచ్చలవిడిగా ఆహార కల్తీ
టాస్క్‌ఫోర్స్‌ తనిఖీలతో వెలుగులోకి..

అల్ఫా హోటల్‌లో కాలం చెల్లిన టీ పొడి, రాజ్‌ హోటల్‌లో  అపరిశుభ్రంగా వంటగది  

ఈనాడు, హైదరాబాద్‌: ఆహార కల్తీ నగరవాసులను కలవరపెడుతోంది. రాష్ట్ర ఆరోగ్యశాఖ ఆదేశాలతో రాష్ట్ర స్థాయి అధికారులు, జీహెచ్‌ఎంసీ అధికారులతో కొలువుదీరిన టాస్క్‌ఫోర్స్‌ బృందం కొన్ని రోజులుగా నగరంలోని హోటళ్లలో తనిఖీలు చేస్తోంది. ఇందులో భాగంగా ఆల్ఫా హోటల్‌ వంట గది, కెఫేలోని ఆహార పదార్థాలు, అక్కడి పరిస్థితులను అధికారులు పరిశీలించేందుకు వెళ్లగా.. యాజమాన్యం అడ్డుకున్నట్లు అధికారులు తెలిపారు. తనిఖీ నివేదికపై సంతకం చేసేందుకూ నిరాకరించారు. దీంతో వారిపై ఆహార భద్రత చట్టం-2006లోని సెక్షన్‌ 62 కింద కేసు నమోదు చేస్తామని, నిందితులకు రూ.లక్ష జరిమానా, మూడు నెలల జైలు శిక్ష పడే అవకాశముందని అధికారులు ప్రకటించారు. ‘ఆల్ఫా’ పేరుతో తయారైన ఐస్‌క్రీమ్, బ్రెడ్, టీ పొడి ప్యాకెట్లపై తయారీ తేదీ లేకపోవడం, వంట గదుల్లో కీటక నిరోధక వ్యవస్థ లేకపోవడం వంటి ఉల్లంఘనలను గుర్తించారు. ఈ హోటల్‌ నిర్లక్ష్యానికి చిరునామా అని, రెండు నెలల్లో మూడోసారి తనిఖీ చేశామని, ఇటీవల ఓ రోజు తాళం వేశామని యంత్రాంగం గుర్తు చేసింది.

  • సికింద్రాబాద్‌లోని సందర్శిని హోటల్‌లో సరిగా ప్యాకింగ్‌ చేయని బెల్లం, పరాట ప్యాకెట్లు, కాలం చెల్లిన నూడుల్స్, ఫ్రిజ్‌లో అడ్డదిడ్డంగా ఉంచిన ఆహార పదార్థాలు, వంట గదిలో కీటక నిరోధక వ్యవస్థ లేకపోవడం వంటి లోపాలను గుర్తించినట్లు టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తెలిపారు.
  • సికింద్రాబాద్‌ రాజ్‌ బార్‌లోని వంటగదికి ఫుడ్‌ లైసెన్సు లేదని, హోటల్‌లో ఎలుకలు తిరుగుతున్నట్లు గుర్తించామని, వంట గదిలో ఆహార పదార్థాల్లో కలిపే సింథటిక్‌ రంగులను గుర్తించి అక్కడే ధ్వంసం చేశామన్నారు. 

హాస్టళ్లలోనూ అంతే..

మాదాపూర్, అమీర్‌పేట, తదితర ప్రాంతాల్లోని బాలురు, బాలికల హాస్టళ్ల వంట గదులు ప్రమాణాలను 10శాతం కూడా పాటించట్లేదని టాస్క్‌ఫోర్స్‌ అధికారులు తెలిపారు. మిగిలిన కూరలను రోజుల తరబడి ఫ్రిజ్‌లో ఉంచి వాడుతున్నట్లు తేలిందన్నారు.

జీహెచ్‌ఎంసీ నిర్లక్ష్యం..

హోటళ్లలో జీహెచ్‌ఎంసీలోని ఆహార విభాగం ఎప్పట్నుంచో తనిఖీలు చేస్తోంది. కానీ.. ఏ రోజూ అక్కడి ఉల్లంఘనలను బయటకు చెప్పలేదు. నోటీసులిచ్చిన దాఖలాలూ తక్కువే. పలువురు అధికారులు హోటళ్ల యాజమాన్యాలతో నెలవారీ మామూళ్లకు ఒప్పందం కుదుర్చుకున్నారనే విమర్శలున్నాయి. అబిడ్స్‌లోని కార్యాలయం కేంద్రంగా సిబ్బంది ద్వారా ముడుపులు అందుకునే వారనే విమర్శలొస్తున్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని