logo

విధుల్లో నిర్లక్ష్యం..మారేడుపల్లి తహసీల్దారుపై వేటు

విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న మారేడుపల్లి తహసీల్దారు పద్మసుందరిపై హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 21 Jun 2024 05:06 IST

మరో ఇద్దరు అధికారులను సస్పెండ్‌ చేసిన కలెక్టర్‌ అనుదీప్‌

మారేడుపల్లి తహసీల్దారు పద్మసుందరిని ప్రశ్నిస్తున్న కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి 

ఈనాడు, హైదరాబాద్‌: విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న మారేడుపల్లి తహసీల్దారు పద్మసుందరిపై హైదరాబాద్‌ జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లోని మారేడుపల్లి తహసీల్దారు కార్యాలయానికి గురువారం ఆకస్మికంగా వెళ్లిన ఆయన అక్కడి వాతావరణం చూసి విస్మయం చెందారు. 11 గంటలైనా తహసీల్దారు సహా రెవెన్యూ అధికారులు హాజరు కాకపోవడంతో ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కార్యాలయంలో తనిఖీలు నిర్వహించిన ఆయన అక్కడ సక్రమంగా రికార్డులను నిర్వహించకపోవడం, దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచడాన్ని గుర్తించారు. కలెక్టర్‌ అనుదీప్‌ రాకను తెలుసుకున్న తహసీల్దారు పద్మసుందరి హడావుడిగా వచ్చారు. ఆయన ప్రశ్నలకు తహసీల్దారు పొంతనలేని సమాధానాలను చెబుతుండడంతో ఆమెపై సస్పెన్షన్‌ విధించారు. ఆమెతో పాటు గిర్దావర్‌ పి.ప్రసన్నలక్ష్మి, రికార్డు అసిస్టెంట్‌ రవిలను సస్పెండ్‌ చేశారు. ప్రజావాణి, ప్రజాదర్బార్, లోకాయుక్త, మానవహక్కుల కమిషన్, కోర్టు కేసుల రిజిస్టర్‌ల నిర్వహణ అధ్వానంగా ఉండటాన్ని కలెక్టర్‌ గుర్తించారు. ప్రజలు సమర్పిస్తున్న దరఖాస్తులు రికార్డుల్లో నమోదు చేయకుండా ఇష్టానుసారంగా ప్రవరిస్తున్నారని, సమయానికి కార్యాలయానికి రావడం లేదని తెలుసుకున్నారు. కార్యాలయంలోని పరిస్థితులపై మరిన్ని వివరాలను అధికారులను అడుగుతుండగా... సమాధానాలు చెప్పకపోవడంతో కలెక్టర్‌ అనుదీప్‌ మరింత ఆగ్రహం వ్యక్తం చేసి వారం రోజుల్లో పరిస్థితులు చక్కదిద్దాలంటూ సికింద్రాబాద్‌ ఆర్డీవో దశరథ్‌ సింగ్‌ను ఆదేశించారు. తహసీల్దారు స్థాయి అధికారులతో సహా ఎవరైనా సరే విధుల నిర్వహణలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కఠినంగా వ్యవహరిస్తామంటూ హెచ్చరించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని