logo

సున్నాబిల్లు.. అందక గొల్లు

గృహజ్యోతి పథకం అమలుకు ఆపసోపాలు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం ఎన్నికలు కాగానే అర్హులకు సున్నా బిల్లు ఇవ్వాలని సూచించినా..

Updated : 21 Jun 2024 06:45 IST

దరఖాస్తు చేసుకోవాలని అధికారుల సూచన
ఐదు లక్షల మంది వినియోగదారుల ఎదురుచూపు

గృహజ్యోతి పథకం అమలుకు ఆపసోపాలు పడాల్సి వస్తోంది. ప్రభుత్వం ఎన్నికలు కాగానే అర్హులకు సున్నా బిల్లు ఇవ్వాలని సూచించినా..ఇంతవరకు అధికారికంగా ఎలాంటి చర్యలు లేదు. నగరంలో మరో 5 లక్షల మంది  వినియోగదారులు ఎదురుచూస్తున్నారు. నిత్యం విద్యుత్తు, జీహెచ్‌ఎంసీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. 

పాత దరఖాస్తులు ఏమయ్యాయి..? 

  • గృహజ్యోతి పథకం నిరంతర ప్రక్రియ అని.. రానివారు మళ్లీ దరఖాస్తు చేసుకుంటే మరుసటి నెలలో సున్నా బిల్లులు వస్తాయని విద్యుత్తు ఉన్నతాధికారులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో భిన్నమైన పరిస్థితులు ఉన్నాయి.
  • మార్చిలో విద్యుత్తు సిబ్బంది దరఖాస్తుదారుల ఇంటింటికి వెళ్లి విద్యుత్తు బిల్లులకు ఆహార భద్రత కార్డు వివరాలను అనుసంధానం చేశారు. అయినా వీరిలోనూ చాలామందికి సున్నా బిల్లులు రాలేదు. 
  • రానివారు మార్చి నెలలో జీహెచ్‌ఎంసీ ప్రజాపాలన సేవ కేంద్రాలకు వెళ్లి ఆహార భద్రత కార్డుతో కలిపి మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. కొందరికి సవరించిన బిల్లులు జారీ చేశారు. మిగతావారికి ఎందుకు రాలేదు అనేది స్పష్టత లేదు.

ఈనాడు, హైదరాబాద్‌

ఇదేం తిరకాసు.. 

 అర్హత ఉండి సున్నా బిల్లులు రానివారు ఉంటే జీహెచ్‌ఎంసీ ప్రజాపాలన సేవా కేంద్రాల్లో మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని విద్యుత్తు అధికారులు చెబుతున్నారు. ప్రజాపాలన దరఖాస్తులు తీసుకోవాలని తమకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆదేశాలు రాలేదని జీహెచ్‌ఎంసీ అధికారులు చెప్పి పంపిస్తున్నారు.
ఇక్కడ ఇలా : నగరంలో 9 సర్కిళ్ల పరిధిలో గృహ వినియోగదారులు దాదాపు 50.18 లక్షల మంది ఉన్నారు. వీరిలో 20 లక్షల మంది గృహజ్యోతి పథకానికి డిసెంబరు 28 నుంచి జనవరి 6 వరకు జరిగిన ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నారు. ఆహార భద్రత కార్డు తప్పనిసరి చేయడంతో అర్హుల సంఖ్య 12 లక్షలకు తగ్గినట్లు అంచనా. వీరిలో 7.01 లక్షల వినియోగదారులకు మాత్రమే సున్నా బిల్లులు వస్తున్నాయి. అర్హులైన మరో ఐదు లక్షల మంది గృహజ్యోతికి ఎదురుచూస్తున్నారు.

  • తమ దరఖాస్తులకు సంబంధించిన పురోగతిపై సమాచారం ఇచ్చేవారు లేకపోవడంతో.. మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని విద్యుత్తు అధికారులు చెబుతుండటంతో వీరు జీహెచ్‌ఎంసీ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. అయితే మండలకార్యాలయాలను సంప్రదిస్తున్నారు.
  • ఒకవేళ ఏదైనా కారణంతో దరఖాస్తు ప్రక్రియ మధ్యలోనే ఆగిపోతే ఆ వివరాలు వినియోగదారుడు తెలుసుకునే వ్యవస్థ లేకపోవడం పెద్ద లోపంగా ఉంది. ప్రజాపాలనలో ప్రతి దరఖాస్తుకు ఒక నెంబరు ఇచ్చారు. ఆ వివరాలు నమోదు చేయగానే ఏ దశలో ఉందో తెలిపే వ్యవస్థ వినియోగదారులకు అందుబాటులో ఉంటే ఈ గందరగోళం తప్పుతుంది.

సున్నా బిల్లుల వినియోగదారులు  

  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని