logo

తాగి నడపకు.. తంటాలు పడకు

మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. అది అందరికీ తెలిసిన విషయమే. అయినా అలవాటు పడుతున్నారు.

Updated : 22 Jun 2024 04:07 IST

వాహనదారుల్లో మార్పు తెచ్చేందుకు వినూత్న శిక్షలు 

నిందితులతో వృద్ధాశ్రమంలో పండ్లు పంపిణీ చేయిస్తున్న న్యాయమూర్తి నామాల అశోక్‌ (పాత చిత్రం)

న్యూస్‌టుడే, వికారాబాద్‌: మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం. అది అందరికీ తెలిసిన విషయమే. అయినా అలవాటు పడుతున్నారు. తాగిన తర్వాత వాహనాలపై రహదారిపైకి వచ్చి ఇష్టారీతిన ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా యువత తాగిన మైకంలో దాడులు చేయడం, కొందరైతే చోరీలకు పాల్పడటం వంటి ఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి వారిని కట్టడి చేసేందుకు పోలీసులు, న్యాయ వ్యవస్థ శిక్షల్లో మార్పులు చేస్తున్నాయి. గతంలో జరిమానా, జైలుశిక్ష వేసిన స్థానంలో ఇప్పుడు సేవా సంస్థలు, ఆసుపత్రులకు వెళ్లి సేవచేయడం, పళ్లు, నీళ్లు అందించడం వంటి జరిమానాలు వేస్తున్నారు. దీనివల్ల సత్ఫలితాలు మెరుగ్గా ఉంటున్నాయని అధికారులు పేర్కొంటున్నారు. 

కూడళ్లు, రహదారుల్లో నిత్యం తనిఖీలు 

జిల్లాలోని వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్‌ పట్టణ ప్రధాన కూడళ్లు, రహదారుల్లో నిత్యం  పోలీసులు బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. అన్ని పోలీస్‌ స్టేషన్ల పరిధిలో తాగుబోతుల కట్టడికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. శ్వాస పరీక్షల్లో తేలిన మోతాదును బట్టి జైలుశిక్షలు ఖరారు చేస్తున్నారు. ఇటీవల ఈ కేసుల్లో తీర్పులు కఠినంగా వస్తున్నాయి. రెండు రోజుల నుంచి వారం రోజుల వరకు జైలుశిక్షతో పాటు ఒక్కొక్కరికి రూ.2 వేలు జరిమానా విధిస్తున్నారు. జిల్లాలో సగటున రోజుకు 5 నుంచి 20 కేసులు నమోదవుతున్నాయి. 

గత మే 22న మద్యం తాగి వాహనాలు నడిపిన ముగ్గురికి వికారాబాద్‌ న్యాయస్థానం వినూత్న తీర్పు వెలువరించింది. ముగ్గురికి రూ.2 వేల చొప్పున జరిమానా విధించడంతో పాటు వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు మందుల కొనుగోలుకు రూ.వెయ్యి, పండ్ల కొనుగోలుకు మరో రూ.వెయ్యి చొప్పున చెల్లించాలని తీర్పు వెలువరించారు. దీన్ని అమలుచేయించారు.

ఒకసారి లైసెన్స్‌ రద్దయితే..అంతే..

  • తాగి వాహనాలు నడిపి వరుసగా మూడుసార్లు పట్టుబడితే వారి చోదక అనుమతి (లైసెన్స్‌) రద్దవుతుంది. ఒకసారి లైసెన్స్‌ రద్దు చేస్తే మళ్లీ తీసుకోవడం చాలా కష్టం. వాహన చోదకులతో పాటు రహదారి వెంట వెళ్లే వారికి భద్రత కల్పించడం కోసమే ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. 
  •  మందుబాబులకు పోలీసులు ఎక్కడికక్కడ కౌన్సెలింగ్‌ నిర్వహిస్తున్నారు. వారితో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా పిలిపించి వారి ముందే తాగితే వచ్చే నష్టాలు, జరిగే ప్రమాదాల గురించి వివరిస్తున్నారు. కౌన్సెలింగ్‌ నిర్వహించడంతో పాటు మార్పు తెచ్చేందుకు సలహాలు ఇస్తున్నారు. తల్లిదండ్రులతో కలిసి ప్రతిజ్ఞ కూడా చేయిస్తున్నారు. దీంతో మార్పు వస్తోంది.  

5 మాసాల్లో 3,814 కేసులు

జిల్లా పరిధిలో మద్యం తాగి వాహనాలు నడిపిన వారిపై గత ఐదు మాసాల్లో 3,814 కేసులు నమోదయ్యాయి. వీరిలో 100 శాతానికి పైగా మద్యం తాగిన 140 మందికి జరిమానాతో పాటు జైలుశిక్ష విధించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు