logo

రుణమాఫీకి రూ.1,705 కోట్లు అవసరం

రాష్ట్ర మంత్రివర్గం రూ.2 లక్షల రైతు రుణమాఫీకి శుక్రవారం ఆమోదం తెలపడంతో జిల్లా రైతులు తమ ఆర్థిక కష్టాలు గట్టెక్కినట్లేనని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Published : 22 Jun 2024 01:17 IST

వికారాబాద్, న్యూస్‌టుడే: రాష్ట్ర మంత్రివర్గం రూ.2 లక్షల రైతు రుణమాఫీకి శుక్రవారం ఆమోదం తెలపడంతో జిల్లా రైతులు తమ ఆర్థిక కష్టాలు గట్టెక్కినట్లేనని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జులై 17 నుంచి ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల వరకు ఉన్న రుణాలను విడతల వారీగా మాఫీ చేయనున్నారు.

మొత్తం 2.32 లక్షల మంది 

జిల్లాలో వికారాబాద్, పరిగి, తాండూరు, కొడంగల్‌ నియోజకవర్గాలుండగా జనాభా 12 లక్షలున్నారు. వీరిలో 2.32 లక్షల మంది రైతులు 5.95 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్‌ పనుల్లో నిమగ్నమవుతున్న రైతులు  రుణమాఫీపై ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. బ్యాంకులనుంచి రుణాలు పొంది సాగు పనులు ముమ్మరం చేయాలని యోచిస్తున్నారు. 

  • 2019 డిసెంబరు 9 వరకున్న పంట రుణాలన్నీ పరిగణనలోకి తీసుకుని అర్హులకు రుణాన్ని మాఫీ చేయడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. 

ఎన్నికల్లో హామీ ఇచ్చిందని పెరిగిన ఆశలు  

  • జిల్లాలో 2.13 లక్షల మంది రైతులకు బ్యాంకుల్లో రూ.2 లక్షల లోపు రుణాలు రూ.1,705 కోట్ల మేర ఉన్నాయి. ఎవరూ బ్యాంకు రుణాలు చెల్లించకండి.. అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.2 లక్షల రైతు రుణాలను మాఫీ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఎన్నికల హామీ ఇచ్చింది. ఆ పార్టీయే అధికారంలోకి రావడంతో రుణాలు మాఫీ అవుతాయన్న ఆశతో రుణాలను నవీకరించుకునే రైతులు సైతం ఆగిపోయారు. మధ్యలో పార్లమెంట్‌ ఎన్నికలు, కోడ్‌ నిబంధనలు రావడంతో ప్రభుత్వ కార్యకలాపాలు ఆగిపోయాయి. కోడ్‌ ముగియడం సర్కారు సంక్షేమ పథకాలు వేగవంతం కావడంతో రైతులు తమ రుణమాఫీపై ఎప్పుడు ప్రకటన వస్తుందా అని ఇన్నాళ్లు ఎదురుచూశారు. ఎట్టకేలకు ప్రభుత్వ నిర్ణయం వెలువడటంతో తమకెంత వర్తిస్తుందోనని అంచనా వేస్తున్నారు. అధికారులు సైతం ప్రభుత్వం నుంచి విధి విధానాలు రాగానే కార్యాచరణ చేపడతామని పేర్కొంటున్నారు. 

ఏడాదిలోపు రుణం చెల్లిస్తే..

పంట రుణం తీసుకున్న తేదీ నుంచి ఏడాదిలోపు వడ్డీతో సహా అసలు చెల్లిస్తే రూ.లక్ష వరకు సున్నా వడ్డీ, రూ.లక్ష నుంచి రూ.3 లక్షల వరకు పావలావడ్డీ పర్తింపజేస్తారు. కానీ ఏడాది గడువు మీరినా మాఫీ విషయం తేలే వరకు అప్పు  చెల్లించడానికి రైతులు ఆసక్తి చూపలేదు. దీంతో బకాయిలు పేరుకుపోయాయి. ప్రస్తుతం రుణమాఫీ చేయనుండటంతో రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని