logo

ఆశ.. నిరాశేనా..!

జిల్లాలో నైరుతి రుతు పవనాలు దోబూచులాడుతున్నాయి. ఈ పరిణామం మెట్ట పంటలు సాగు చేస్తున్న రైతులను ఆందోళనకు గురి చేస్తోంది.

Updated : 22 Jun 2024 04:17 IST

జిల్లాలో వర్షపాతం అంతంతే..

బుద్దారం గ్రామంలో పొలం దున్నుతున్న ట్రాక్టర్‌ 

న్యూస్‌టుడే, తాండూరు: జిల్లాలో నైరుతి రుతు పవనాలు దోబూచులాడుతున్నాయి. ఈ పరిణామం మెట్ట పంటలు సాగు చేస్తున్న రైతులను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రారంభంలో ఆశించినమేర వర్షాలు పడటంతో రైతులు సంతోషిం చారు. ప్రస్తుతం వరుణుడు జాడలేక పోవడంతో విత్తనాలు విత్తిన రైతులు ఆవేదన చెందుతున్నారు. 

ఆరంభం అదిరిందని సంతోషిస్తే..

మృగశిర కార్తె కంటే ముందే నైరుతి పలకరిస్తుందని వాతావరణ శాఖ పేర్కొనడంతో రైతుల మోముల్లో సంతోషం కనిపించింది. కొన్ని మండలాల్లో అనుకున్నట్లే భారీ వర్షాలు కురిశాయి. మరి కొన్ని మండలాల్లో సాధారణ వర్ష పాతం కంటే తక్కువగా వర్షాలు కురిశాయి.

  •  మొత్తంగా ఈనెల ఒకటో తేదీ నుంచి 18వ తేదీ వరకు పరిశీలిస్తే జిల్లా సాధారణ వర్షపాతం 60.8 మి.మీకు గాను 105.1 మి.మీ వర్షపాతం నమోదైంది. వర్షాలు ఎక్కువగా కురిసిన మండలాల్లో రైతులు పత్తి, కంది, పెసర, మినుము వంటి విత్తనాలను విత్తారు. తీరా నాలుగైదు రోజుల నుంచి వర్షాలు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఈ పరిణామంతో రైతులు తమ ఆశలు నిరాశలవుతున్నాయని ఆందోళన చెందుతున్నారు. 

తక్కువ వర్షపాతం నమోదైనవి 

నవాబుపేట 64.9 మి.మీకు 62.8, వికారాబాద్‌ 80.4కు 70.4, పూడూరు 71.7కు 58.6, పరిగి 58.1కు 43.7, కుల్కచర్ల 55కు 19.3, దుద్యాల 54.6కు 50.3 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైంది. దోమలో 57.4 మి.మీ సాధారణ వర్షపాతానికి 58.1 మి.మీ వర్షపాతం నమోదైందని జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయం సిబ్బంది వెల్లడించారు.

కొందరు సద్వినియోగం చేస్తున్నారు 

జిల్లాలో 6 లక్షల వ్యవసాయ పొలాలు ఉంటే రైతులు శనివారం వరకు 1.42 లక్షల ఎకరాల్లో విత్తనాలు వేశారు. మిగిలిన ఎకరాల్లో విత్తనాలు వేసే రైతులు వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు పొలాలను సిద్ధం చేయని రైతులు వర్షాలు కురవని వాతావరణాన్ని అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఆమేరకు ట్రాక్టర్లతో పొలాలను దున్నించడం వేగం చేశారు. పొలాల నుంచి వ్యర్థాలను తొలగిస్తున్నారు. పనులు పూర్తయిన రైతులు వర్షం కురిసి తెరిపివ్వగానే విత్తనాలు వేసేందుకు సిద్ధం అవుతున్నారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు