logo

అదృశ్యం కాదు.. బాలుడి అపహరణ

బాలుడి అదృశ్యం కేసును పహాడీషరీఫ్‌ పోలీసులు ఛేదించారు. మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి కథనం ప్రకారం.

Published : 22 Jun 2024 01:36 IST

అడవిలో బంధించి చిత్రహింసలు పెట్టిన నిందితుడు

కానిస్టేబుల్‌తో బాలుడు

పహాడీషరీఫ్, న్యూస్‌టుడే: బాలుడి అదృశ్యం కేసును పహాడీషరీఫ్‌ పోలీసులు ఛేదించారు. మహేశ్వరం డీసీపీ సునీతారెడ్డి కథనం ప్రకారం... జల్‌పల్లి శ్రీరామకాలనీలో ఉండే ఎద్దుల తిరుపతమ్మ ఆరేళ్ల కుమారుడు సాయి అలియాస్‌ చిన్ను(6).. ఈనెల 19న ఇంటిముందు ఆడుకుంటూ అదృశ్యమైన విషయం తెలిసిందే. పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలించగా.. అదృశ్యం కాదు అపహరaణగా తేలింది. జల్‌పల్లి పార్దీవాడలోని ఆటవిక ప్రాంతంలో పొదల్లో బంధీగా ఉన్న బాలుడు సాయి, అక్కడే ఉన్న నిందితుడు అర్జున్‌కుమార్‌ వర్మ(20)ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించారు. జల్‌పల్లి శ్రీరామకాలనీలో ఉండే బాలుడి ఇంటి పక్కనే ఉండే యూపీకి చెందిన బర్మ ప్రేమ్‌కుమార్‌ గృహానికి ఉపాధి నిమిత్తం వారం క్రితమే అతని స్వస్థలం నుంచి అర్జున్‌కుమార్‌ వర్మ వచ్చాడు. రాగానే అతడ్ని.. ప్రేమ్‌కుమార్‌ గచ్చిబౌలిలోని డీమార్ట్‌లో పనిలో పెట్టాడు. నాలుగు రోజుల్లోనే పని మానేశాడు. ఇంటిపట్టునే ఉన్న అర్జున్‌కుమార్‌ వర్మ.. చేతిలో డబ్బులు లేకపోవడంతో ఈనెల 19న ఏమైనా చేయాలనుకున్నాడు. ఇంటి పక్కనే ఉండే సాయి ఒక్కడే అడుకోవడాన్ని నిందితుడు వర్మ గుర్తించి అపహరించాడు. డబ్బులు వసూలు చేద్దామని కుట్ర పన్నాడు. ఆటవిక ప్రాంతంలోని పొదల్లో దాచిపెట్టి బాలుడిని చిత్ర హింసలు పెట్టాడు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు కేసును ఛేదించారు. బాలుడిని సురక్షితంగా తీసుకొచ్చి తల్లిదండ్రులకు అప్పగించారు. వీధుల్లో అద్దె గదుల్లో ఉండే అపరిచితులతో అప్రమత్తంగా ఉండాలని డీసీపీ సూచించారు. కానిస్టేబుల్‌ రవీందర్‌ను ప్రత్యేకంగా అభినందించారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు