logo

హత్యల పరంపర

ఒక పోలీసుస్టేషన్‌ ఉంటే..దాని చుట్టూ ఉండే ప్రాంతంలోని రౌడీషీటర్లు, దందా చేసే ముఠాల్లో వణుకు పుడుతుంది

Updated : 22 Jun 2024 04:05 IST

ఒకేరోజు నలుగురి హతం

నిఘా నియంత్రణ లేక హల్‌చల్‌

ఈనాడు- హైదరాబాద్‌ : ఒక పోలీసుస్టేషన్‌ ఉంటే..దాని చుట్టూ ఉండే ప్రాంతంలోని రౌడీషీటర్లు, దందా చేసే ముఠాల్లో వణుకు పుడుతుంది..ఇదంతా గతమన్నట్టే ప్రస్తుత నేరాలు స్పష్టం చేస్తున్నాయి. పోలీసులంటే ఏ మాత్రం భయం లేకుండా హత్యల పరంపర కొనసాగిస్తున్నారు.
రాజధానిలో వరుస హత్యలు, హత్యాయత్నాలు దడ పుట్టిస్తున్నాయి. ఈ నెల 14న ఒకేరోజు వేర్వేరు ప్రాంతాల్లో ఐదు హత్యలు జరిగాయి. ఈ దుర్ఘటనలు మరువకముందే మంగళవారం అర్థరాత్రి నుంచి బుధవారం అర్థరాత్రి వరకూ దాదాపు 30 గంటల వ్యవధిలో 4 హత్యలు, ఒక హత్యాయత్నం కలకలం రేపుతోంది. రైలు పట్టాలపై ఓ వ్యక్తి మృతిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మృతుల్లో ముగ్గురు రౌడీషీటర్లు ఉన్నారు. పాత కక్షలు, ఆధిపత్యం, ప్రతీకార దాడులతో ఈ ఘాతుకాలు జరుగుతున్నాయి. రౌడీషీటర్లపై నిఘా తగ్గడంతో పేట్రేగిపోతున్నారు.

పాతబస్తీలో రక్త చరిత్ర

పాతబస్తీ.. దాని పరిసర ప్రాంతాల్లో వరుస హత్యలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. రౌడీషీటర్లు, ఆకతాయిలు రెచ్చిపోతున్నారు. మంగళవారం అర్థరాత్రి తర్వాత నమోదైన నాలుగు హత్యల్లో రెండు పాతబస్తీ.. దాని పరిసరాల్లో పోలీస్‌స్టేషన్లలోనే జరిగాయి. శాలిబండలో ఒకరు అసిఫ్‌నగర్‌లో ఒకరు హతమయ్యారు. గత గురువారం బాలాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో సమీర్‌ని కత్తులతో పొడిచి చంపారు. అదే రోజు అసిఫ్‌నగర్‌లో వీధుల్లో ఓ యువకుడిని కొందరు వెంటాడి కత్తులతో పొడుస్తూ.. రాళ్లతో విచక్షణారహితంగా కొట్టడంతో మరణించాడు. ఇవన్నీ అర్థరాత్రి వేళ జరిగినవే.  అల్లరిమూకలు, ఆకతాయిలు వీధుల వెంట తిరుగుతూ వీరంగం సృష్టిస్తున్నారు. కొందరు యువకులు బైకులు, కార్లపై తిరుగుతూ నగరంలో హల్‌చల్‌ చేస్తున్నారు.

పెట్రోలింగ్‌ ఏమైంది..?

నేరస్థులపై నిఘా తగ్గిపోవడం, అర్థరాత్రి వేళ పెట్రోలింగ్‌ వ్యవస్థ నిస్సారంగా మారడంతో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయి. రహదారులపై విజిబుల్‌ పోలీసింగ్, నిరంతర గస్తీతో పరిస్థితి హద్దుమీరకుండా చూసేవారు. గత కొన్నిరోజులుగా వివిధ ప్రాంతాల్లో అర్థరాత్రి వేళ పెట్రోలింగ్‌ ఉన్నా నేరాలు జరుగుతున్నాయి. హుస్సేన్‌సాగర్‌ చుట్టూ ఎన్టీఆర్‌ మార్గ్, ట్యాంక్‌బండ్‌పై యువత బైకుల మీద వచ్చి తిష్ఠ వేస్తున్నారు. టీహబ్‌ దగ్గర రహదారిపై తరచూ రేసింగ్‌లు జరుగుతున్నాయి. బుధవారం ఒక్కరోజే రెండు స్నాచింగ్‌లు జరిగాయి. గత శనివారం శామీర్‌పేట, జవహర్‌నగర్‌లో మూడు స్నాచింగ్‌లు జరిగాయి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు