logo

గ్రేటర్‌లో గులాబీదళంపై కాంగ్రెస్‌ కన్ను

గ్రేటర్‌ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ బలాన్ని పెంచుకునేందుకు దూకుడు పెంచింది.

Published : 22 Jun 2024 01:48 IST

 పోచారం ఇంటికి స్వయంగా వెళ్లిన సీఎం 
జానారెడ్డిని కలిసిన ఉప్పల్‌ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
 మరికొందరూ చేరుతున్నారంటూ ప్రచారం

ఈనాడు, హైదరాబాద్, జూబ్లీహిల్స్, ఉప్పల్, న్యూస్‌టుడే: గ్రేటర్‌ హైదరాబాద్‌లో కాంగ్రెస్‌ పార్టీ బలాన్ని పెంచుకునేందుకు దూకుడు పెంచింది. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యేలోపు నగరానికి చెందిన భారాస ఎమ్మెల్యేల్లో సింహభాగం కాంగ్రెస్‌లో చేర్చుకోవాలన్న ఉద్దేశంతో ప్రణాళికను అమలుచేస్తోంది. కాంగ్రెస్‌ నాయకులు కొందరు  గ్రేటర్‌ పరిధిలో భారాస ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో సంప్రదింపులు నిర్వహిస్తున్నారు. కలిసి మాట్లాడుదామంటూ ఇళ్లకు ఆహ్వానిస్తున్నారు.తాజాగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి శుక్రవారం ఉదయం బంజారాహిల్స్‌లో ఉంటున్న పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఇంటికి వెళ్లి కాంగ్రెస్‌ పార్టీలో చేరాలంటూ ఆహ్వానించారు. ఉప్పల్‌ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి రెండు రోజులుగా కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి, ఇతర నేతలను కలుసుకున్నారు. ఆయన కాంగ్రెస్‌లో చేరుతున్నారంటూ ప్రచారం జరుగుతుండగా... తాను భారాసలోనే ఉంటున్నానని, పార్టీ మారడం లేదని బండారి స్పష్టంచేశారు. 

తెర వెనుక మంత్రాంగాలు.. బహిరంగ ప్రకటనలు

గ్రేటర్‌ పరిధిలోని 29 శాసనసభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి నలుగురు మాత్రమే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భాజపా, మజ్లిస్‌ ఎమ్మెల్యేలను మినహాయిస్తే.. 17మంది భారాస ఎమ్మెల్యేలున్నారు. వీరిలో ఇప్పటికే ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌లో చేరగా.. మరికొంతమంది చేరేందుకు ఆసక్తి ప్రదర్శిస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలుసుకుంటున్న ఎమ్మెల్యేల్లో కొందరు హస్తం గూటికి చేరాలనుకుని నిర్ణయించుకున్నా.. చివరి నిమిషంలో వాయిదా వేసుకుంటున్నారు. శివారు నియోజకవర్గాలతో పాటు నగరంలో నలుగురైదుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో మంతనాలు చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్‌ఛార్జ్‌ మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్‌బాబులు కొందరు ఎమ్మెల్యేలతో ‘టచ్‌’లో ఉన్నారు. మంత్రి దామోదర రాజనర్సింహతో సన్నిహిత పరిచయాలున్న ఒకరిద్దరు ఎమ్మెల్యేలు హస్తం పార్టీలో చేరేందుకు మాట్లాడుతున్నారు. కొందరు సీనియర్‌ నేతలు.. భారాస ఎమ్మెల్యేలు కొద్దిరోజుల్లో కాంగ్రెస్‌లోకి చేరుతున్నారంటూ బహిరంగంగా ప్రకటిస్తున్నారు. ఆ పార్టీ నుంచి 20 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఎమ్మెల్యే దానం నాగేందర్‌ వ్యాఖ్యానించగా.. గ్రేటర్‌ పరిధిలో కొద్దిరోజుల్లో మా బలం పెరుగుతుందంటూ మంత్రి కోమటిరెడ్డి ఇటీవలే ప్రకటించడం గమనార్హం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని