logo

డయాలసిస్‌ ఆలస్యమైతే ప్రాణాల మీదకు..

డయాలసిస్‌ కేంద్రాల్లో మరణాల రేటు తగ్గించేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలోని ఉన్న దాదాపు అన్ని డయాలసిస్‌ కేంద్రాలను నిమ్స్, గాంధీతో అనుసంధానించి సేవల మెరుగుదలకు ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టాలని నిర్ణయించింది.

Updated : 22 Jun 2024 04:04 IST

8-15 శాతం మరణాల రేటు నమోదు
సేవల మెరుగుదలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
నిమ్స్, గాంధీ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన

ఈనాడు, హైదరాబాద్‌: డయాలసిస్‌ కేంద్రాల్లో మరణాల రేటు తగ్గించేందుకు ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్రంలోని ఉన్న దాదాపు అన్ని డయాలసిస్‌ కేంద్రాలను నిమ్స్, గాంధీతో అనుసంధానించి సేవల మెరుగుదలకు ప్రత్యేక జాగ్రత్తలు చేపట్టాలని నిర్ణయించింది. నిమ్స్, గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో పేద రోగులకు ఉచితంగా డయాలసిస్‌ సేవలు అందిస్తున్నారు. ఈ మూడు ఆసుపత్రుల్లో 400-600 మంది వరకు నిత్యం డయాలసిస్‌ చేయించుకుంటున్నారు. కిడ్నీలు పాడైన తర్వాత వ్యర్థాలను వడపోసే సామర్థ్యం కోల్పోతాయి. దీంతో యంత్రాల ద్వారా రోగి రక్తంలోని వ్యర్థాలు, ఇతర ద్రవాల ప్రక్రియనే డయాలసిస్‌గా వ్యవహరిస్తారు. తద్వారా రోగులకు ఉపశమనం కల్పిస్తారు. మూత్రపిండాలు పాడైన రోగి కనీసం వారంలో మూడుసార్లు డయాలసిస్‌ చేయించుకోవాలి. ఆరోగ్యశ్రీ కింద ఈ సేవలను ఉచితంగానే అందిస్తున్నారు. జిల్లాలోని ఇతర ప్రభుత్వ ఆసుపత్రులు, జిల్లా, డివిజన్‌ కేంద్రాల్లో డయాలసిస్‌ కేంద్రాలున్నా మరణాల రేటు అధికం. హైదరాబాద్‌ వరకు ఇది 8 శాతం వరకు ఉంటే జిల్లాల్లో 15 శాతం వరకు నమోదవుతోందని వైద్యులు చెబుతున్నారు. కొందరు ప్రత్యామ్నాయ చికిత్సలపై ఆధారపడి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. మరికొందరికి కిడ్నీలు పూర్తిగా పాడైన వరకు అవగాహన ఉండటం లేదు. అధిక రక్తపోటు, మధుమేహం ఉన్న ఔషధాలు తీసుకోవడం లేదు. ఇలాంటి వారిలో కిడ్నీలు తొందరగా పాడవుతున్నాయి. దీంతో పరిస్థితి చేజారిన తర్వాత డయాలసిస్‌ తీసుకుంటున్నప్పటికీ ప్రయోజనం ఉండటం లేదు. ఇలాంటి వారిలో తొలి ఆరు నెలల్లోనే 40 శాతం మృతిచెందుతున్నారు. నిమ్స్, గాంధీలోని డయాలసిస్‌ సెంటర్లతో జిల్లాలు, డివిజన్లలోని కేంద్రాలను అనుసంధానం చేసి పర్యవేక్షించనున్నారు. అక్కడ టెక్నీషియన్లకు, వైద్యులకు డయాలసిస్‌కు సంబంధించి సూచనలు సలహాలిస్తున్నారు. ఆయా కేంద్రాల్లో సేవలను ఇక్కడ నుంచే ఆన్‌లైన్‌లో నేరుగా పరిశీలించనున్నారు.

మరణాల రేటు పెరగడానికి కారణాలు

  •  చాలామంది రోగుల్లో డయాలసిస్‌పై అవగాహన లేకపోవం
  •  5-7 క్రియాటిన్‌ దాటిని డయాలసిస్‌ చేయించుకోకపోవడం
  •  చివరి నిమిషంలో డయాలసిస్‌ కోసం రావడం
  •  కిడ్నీ పాడైనా ప్రత్యామ్నాయ చికిత్సలపై ఆధారపడటం
  •  డయాలసిస్‌ కోసం చేసే ధమని, సిరల మధ్య అనుసంధానం చేసే ఏవీ ఫిస్టులా శస్త్రచికిత్సలో జాప్యం
  •  వైద్యులు సూచించిన దానికంటే తక్కువసార్లు డయాలసిస్‌ చేయించుకోవడం
  •  అధిక రక్తపోటు, మధుమేహం నియంత్రణలో లేకపోవడం
  •  హెపటైటిస్‌ బి, సి ఇతర వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు
  •  కొన్నిసార్లు డయాలసిస్‌ కేంద్రాలపై పర్యవేక్షణ కొరవడం 
  •  డయాలసిస్‌ కేంద్రాల వద్ద రోగుల నిరీక్షణ.. సేవల్లో జాప్యం 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని