logo

వానొచ్చినా.. వరదొచ్చినా.. సన్నద్ధం

రానున్న రోజుల్లో భారీ వర్షాలు ఉండొచ్చన్న వాతావరణ శాఖ అంచనాలతో జీహెచ్‌ఎంసీ తగిన ఏర్పాట్లతో సిద్ధమైంది.

Updated : 22 Jun 2024 04:10 IST

168 నీటిని తోడే మోటార్లు సిద్ధం చేసిన బల్దియా
నాలా రక్షణ చర్యలపైనా దృష్టి

హుస్సేన్‌సాగర్‌ వద్దనున్న అంబేడ్కర్‌ నాలాలో ముమ్మరంగా పూడికతీత 

ఈనాడు, హైదరాబాద్‌: రానున్న రోజుల్లో భారీ వర్షాలు ఉండొచ్చన్న వాతావరణ శాఖ అంచనాలతో జీహెచ్‌ఎంసీ తగిన ఏర్పాట్లతో సిద్ధమైంది. రోడ్లపై వరదను దారి మళ్లించే స్టాటిక్‌ బృందాలు ఇప్పటికే రంగంలోకి దిగాయని, నగరమంతా తిరుగుతూ వరదనీటి సమస్యలను పరిష్కరించే సంచార బృందాలు తాజాగా రంగంలోకి దిగాయని ఇంజినీరింగ్‌ విభాగం స్పష్టం చేస్తోంది. కుండపోత వానలతో తలెత్తుతున్న ముంపు నుంచి ఉపశమనం కల్పించడమే ధ్యేయంగా ఇంజినీరింగ్‌ విభాగం 168 నీటిని తోడే మోటార్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. నాలా ప్రమాదాలు చోటుచేసుకోకుండా తీసుకునే చర్యలను సైతం పూర్తిచేశామని జోనల్‌ కమిషనర్లు నివేదిక ఇచ్చారు.

నీరు నిలిచే ప్రాంతాలకు చికిత్స

నగరవ్యాప్తంగా 141 ప్రాంతాలు చిన్నవానకే చెరువును తలపిస్తున్నాయని విపత్తు స్పందన బృందాలు(డీఆర్‌ఎఫ్‌) నివేదిక ఇవ్వగా.. ఆయా ప్రాంతాల్లో వరద సాఫీగా సాగేందుకు అవసరమైన చర్యలను ఇంజినీరింగ్‌ విభాగం చేపట్టింది. ఇప్పటివరకు 31చోట్ల దిద్దుబాటు పనులు పూర్తవగా, 52 ప్రాంతాల్లో పనులు పురోగతిలో ఉన్నాయి. మిగిలిన 58 ప్రాంతాల్లో సహాయక సిబ్బందిని ఉంచి రక్షణ చర్యలు తీసుకుంటామని ఇంజినీర్లు చెబుతున్నారు.

చివరి దశలో పూడికతీత : నగరంలో 390కి.మీ ప్రధాన నాలాలతో కలిపితే 1,302కి.మీ వరద నాలాలు ఉన్నాయి. వాటిలో ఏటా 4.5లక్షల క్యూబిక్‌ మీటర్ల పూడిక వస్తుందని అంచనా. ఈ ఏడాదిలో రూ.56.38 కోట్లతో 919కి.మీ నాలాల్లో పూడిక తొలగించేందుకు 201 పనులు చేపట్టగా, ఇప్పటివరకు తొలగించిన పూడిక మట్టి 3.12లక్షల క్యూబిక్‌ మీటర్లు మాత్రమే.

ఎస్‌ఎల్‌టీ బృందాలు..   238
ఎంఈటీ బృందాలు.. 154 (నలుగురు కార్మికులు, వాహనం, డ్రైవరు, రక్షణ సామగ్రితో 24గంటలు అందుబాటులో)

సన్నద్ధత ఇలా..

సన్నద్ధత పనులకు కేటాయించిన నిధులు.. రూ.41.45 కోట్లు
(ఒకరు లేదా ఇద్దరు సిబ్బంది నీరు నిలిచే ప్రాంతాల్లో ఉంటూ వరదను దారి మళ్లించే బాధ్యతలో)
రహదారుల నిర్వహణ చూస్తున్న గుత్తేదారు సంస్థల ఆధ్వర్యంలో..29  ఎంఈటీ బృందాలు
వరదనీరు నిలిచే చోట నీటిని నాలాల్లోకి ఎత్తిపోసేందుకు.. 168  

మోటార్లు సహాయక చర్యల నోడల్‌ అధికారులు.. 203 మంది

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని