logo

అందరి మాట.. బడి బాట

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి జిల్లాలో ‘ప్రొ.జయశంకర్‌ బడిబాట’  కార్యక్రమాన్ని చేపట్టారు. అనుకున్న దానికంటే ఎక్కువ సత్ఫలితాలు ఇవ్వటంతో అధికారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Published : 23 Jun 2024 01:36 IST

ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన చేరికలు

అవగాహన ర్యాలీలో అధికారులు, ఉపాధ్యాయులు

న్యూస్‌టుడే, వికారాబాద్‌ కలెక్టరేట్, పరిగి: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి జిల్లాలో ‘ప్రొ.జయశంకర్‌ బడిబాట’  కార్యక్రమాన్ని చేపట్టారు. అనుకున్న దానికంటే ఎక్కువ సత్ఫలితాలు ఇవ్వటంతో అధికారులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 6 గురువారం మొదలై 19 బుధవారం వరకు ఈ కార్యక్రమం సాగింది. కేవలం 14 రోజుల వ్యవధిలో 8 వేలకు పైగా విద్యార్థులు సర్కార్‌ బడిలో చేరారు. గత ఏడాది 7,500 దాకా ఉన్నారు. పెరిగిన విద్యార్థుల సంఖ్యతో జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు కళకళలాడుతున్నాయి. 

అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు

ప్రభుత్వ పాఠశాలల్లో విశాలమైన మైదానాలు, అర్హత, అనుభవం కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారు. ఈసారి అమ్మ ఆదర్శ పథకం, మన ఊరు మన బడి పథకం కింది అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించారు. దీనికితోడు ఉచిత పుస్తకాలు, దుస్తులు, మధ్యాహ్న భోజనం కార్యక్రమాలు పేదింటి పిల్లలనే కాదు ఉన్నతాదాయ వర్గాలను ప్రభుత్వ పాఠశాలల వైపు నడిపిస్తున్నాయి. 

జిల్లాలో వివిధ ప్రభుత్వ యాజమాన్యాల పరిధిలో 1068 పాఠశాలలున్నాయి. వీటిలో గత విద్యా సంవత్సరం 80,213 మంది చదివారు. 

పెంపే లక్ష్యంగా ప్రత్యేక కార్యాచరణ  

ప్రభుత్వ పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరానికి విద్యార్థుల సంఖ్య పెంపే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించి అమలు చేశారు. జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారి ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం సమావేశం నిర్వహించారు. గత నెలలో ప్రతి మండలంలో ఎంపీడీవోలు ఆధ్వర్యంలో తహసీల్దారు, ఎంఈఓ, ఎంఎన్‌ఓ, హెచ్‌ఎంలు, స్వచ్ఛంద సంస్థలతో సమావేశం నిర్వహించి మొరుగైన ఫలితాల కోసం కసరత్తు చేశారు. 

  • ప్రైవేట్‌ పాఠశాలల నుంచి విద్యార్థులను సర్కారు బడుల వైపు మళ్లించాలనే లక్ష్యంతో పనులు చేశారు. గ్రామాల్లో ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలల్లో ఎంత మంది చదువుతున్నారని లెక్కలు తీశారు. ప్రైవేట్‌కు పంపిస్తున్న తల్లిదండ్రులను నేరుగా, చరవాణి ద్వారా సంప్రదించి ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని కోరారు. 
  • జిల్లాలో బడిబాట సాగినన్ని రోజులు ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయలు ఇంటింటా ప్రచారం చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ప్రచారం నిర్వహించారు. కూడళ్లలో వినూత్నంగా బ్యానర్లు ప్రదర్శించారు. గ్రామాల్లో ప్రచారం చేయించారు.   

సద్వినియోగం చేసుకోవాలి:

రేణుకాదేవి, జిల్లా విద్యాధికారిణి

ప్రభుత్వ బడుల్లో అర్హత కలిగిన ఉపాధ్యాయులతో చక్కటి బోధన ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోని మెరుగైన ఫలితాలు సాధించాలి. తల్లిదండ్రులు స్వయంగా తమ పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలల్లోనే చేర్పించారు.  

జులై చివరి వరకు అవకాశం:

రజనీకుమారి, సమ్మిళిత విద్య కో ఆర్డినేటర్‌

విద్యార్థులు చేరేందుకు జులై నెల చివరి వరకు అవకాశం ఉంది. దీన్ని మిగిలిన వారు సద్వినియోగం చేసుకోవాలి. ఎక్కువగా ప్రాథమిక పాఠశాలల్లో చేరుతున్నారు. గ్రామాల్లో విద్యార్థుల తల్లిదండ్రులు వీలు చూసుకుని పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని