logo

పాత ఆటోలను ఈవీలుగా మార్చేద్దాం..!

పెట్రోల్, డీజిల్‌ వాహనాల ద్వారా పర్యావరణానికి పెను నష్టం వాటిల్లడంతోపాటు.. వినియోగదారులకు ఇంధన ఖర్చు భారమవుతోంది. దీంతో ఎక్కువ మంది విద్యుత్తు వాహనాలు (ఈవీ) కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు.

Published : 23 Jun 2024 02:11 IST

ఇంధన వ్యయం ఆదా.. కాలుష్య నియంత్రణకు దోహదం

రెట్రోఫిట్‌మెంట్‌ ద్వారా ఈవీలుగా మార్చిన పాత ఆటో

ఈనాడు డిజిటల్, హైదరాబాద్‌: పెట్రోల్, డీజిల్‌ వాహనాల ద్వారా పర్యావరణానికి పెను నష్టం వాటిల్లడంతోపాటు.. వినియోగదారులకు ఇంధన ఖర్చు భారమవుతోంది. దీంతో ఎక్కువ మంది విద్యుత్తు వాహనాలు (ఈవీ) కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీతో నడిచే పాత ఆటోలను సైతం రెట్రోఫిట్‌మెంట్‌ ద్వారా ఈవీలుగా మార్చుకునే వెసులుబాటు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చింది. అలాచేస్తే 50- 60 శాతం నిర్వహణ వ్యయం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. దేశంలో ప్రస్తుతం 7.4 మిలియన్ల ఆటోలు ఉండగా.. 2030 నాటికి వీటి సంఖ్య 11 మిలియన్లకు చేరే అవకాశం ఉంది. కేవలం హైదరాబాద్‌ నగరంలోనే 1.2 లక్షలు ఉన్నాయి. వీటిని విద్యుత్తు వాహనాలుగా మార్చగలిగితే చాలా వరకు కాలుష్యాన్ని నియంత్రించవచ్చు.

రెట్రోఫిట్‌మెంట్‌తో ఉపయోగాలు..    

ఇంజిన్‌ ఆటోలను ఈవీలుగా మార్చడం వల్ల వాటి మన్నిక అదనంగా 5-7 సంవత్సరాలు పెరుగుతుంది. 4 నుంచి 5 సంవత్సరాల క్రితం కొనుగోలు చేసిన వాహనాలను ఈవీలుగా మార్చడం వల్ల నిర్వహణ వ్యయం తగ్గుతుంది. కొనుగోలు చేసి 15 సంవత్సరాలు లోపువాటికి మాత్రమే రెట్రోఫిట్టింగ్‌ చేస్తారు. పెట్రోల్‌తో నడిచే ఆటోలకు కి.మీ.కు రూ.5.34, డీజిల్‌ ఆటోలకు రూ.3.76, సీఎన్‌జీ ఆటోలకు రూ.3.18 వ్యయం అయితే.. రెట్రోఫిట్‌మెంట్‌ ఆటోలకు రూ.1.4 ఖర్చు అవుతుంది. ఇంజిన్‌ ఆటోల్లో డ్రైవర్లు రోజుకు సగటున 1,300 సార్లు గేర్లు మారుస్తుంటారు. విద్యుత్తు ఆటోలతో దీనినుంచి ఉపశమనం పొందొచ్చు. మూడు నుంచి నాలుగు గంటలు ఛార్జింగ్‌ పెడితే  గంటకు 50 కి.మీ. వేగంతో 80-100 కి.మీ.వరకు ప్రయాణించొచ్చు. ఇందులో అమర్చే బ్యాటరీ, మోటార్, కంట్రోలర్‌కు ఆయా  కంపెనీలు మూడేళ్ల వారంటీ కల్పిస్తున్నాయి. 

విడి భాగాలకు అయ్యే ఖర్చు.. 

పాత ఆటోలను ఈవీలుగా మార్చేందుకు సుమారుగా రూ.1.65 లక్షలు వెచ్చించాలి. మోటార్, కంట్రోలర్‌కు రూ.40వేలు, పవర్‌ అవుట్‌పుట్‌ను నియంత్రించే పరికరాలకు రూ.15వేలు 8 కేడబ్ల్యూహెచ్‌ సామర్థ్యం కలిగిన బ్యాటరీ రూ.88వేలు, ఛార్జర్‌తోపాటు ఇతర సామగ్రికి రూ.10వేలు ఖర్చవుతుంది. దీనికి ప్రభుత్వం రూ.15,000 వరకు రాయితీ కల్పించడంతోపాటు.. అదనంగా రాయితీ ఇచ్చేందుకు పలు కార్పొరేషన్లు ముందుకొస్తున్నాయి. పలు ఫైనాన్స్‌ కంపెనీలు, వాణిజ్య బ్యాంకులు రెట్రోఫింట్‌మెంట్‌కు సైతం రుణ సదుపాయం కల్పిస్తున్నాయి. ఈవీగా మార్చడం వల్ల వాహన బరువులో 10-15 శాతం తగ్గుతుంది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని