logo

దొంగల్ని 30 గంటల్లో పట్టేశారు

మేడ్చల్‌లో ఆభరణాల దుకాణంలో దోపిడీ కేసును సైబరాబాద్‌ పోలీసులు 30 గంటల్లో చేధించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చాదర్‌ఘాట్‌లో పట్టపగలు ఆభరణాల దుకాణం యజమానిని కత్తులతో పొడిచి దోపిడీ చేసిన వ్యక్తి.. ఇప్పుడు మేడ్చల్‌లోనూ చోరీకి యత్నించాడు.

Published : 23 Jun 2024 02:13 IST

గతంలో చాదర్‌ఘాట్‌లో దోపిడీ చేసిన ప్రధాన నిందితుడు

మాట్లాడుతున్న సీపీ అవినాశ్‌ మహంతి, డీసీపీలు నరసింహ, కోటిÈరెడ్డి, శ్రీనివాస్‌

ఈనాడు- హైదరాబాద్, రాయదుర్గం, న్యూస్‌టుడే: మేడ్చల్‌లో ఆభరణాల దుకాణంలో దోపిడీ కేసును సైబరాబాద్‌ పోలీసులు 30 గంటల్లో చేధించారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో చాదర్‌ఘాట్‌లో పట్టపగలు ఆభరణాల దుకాణం యజమానిని కత్తులతో పొడిచి దోపిడీ చేసిన వ్యక్తి.. ఇప్పుడు మేడ్చల్‌లోనూ చోరీకి యత్నించాడు. ఆఫ్రికా, అమెరికా, చైనా దేశాల్లో ఉద్యోగం చేసిన నిందితుడు డబ్బు సరిపోక దోపిడీలు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. సైబరాబాద్‌ సీసీఎస్‌ పోలీసులు 16 బృందాలుగా ఏర్పడి మరుసటి రోజే ఇద్దరు నిందితుల్ని.. అరెస్టు చేశారు. బురఖా, ద్విచక్రవాహనం, ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. సైబరాబాద్‌ క్రైమ్స్‌ డీసీపీ కొత్తపల్లి నరసింహ, మేడ్చల్‌ డీసీపీ కోఠిరెడ్డి, ఎస్‌వోటీ డీసీపీ శ్రీనివాస్, అదనపు డీసీపీ శోభన్‌తో కలిసి సైబరాబాద్‌ కమిషనర్‌ అవినాశ్‌ మహంతి శనివారం వివరాలు వెల్లడించారు. 

ముంబయికి చెందిన నజీమ్‌ అజీజ్‌ కొటాడియా(36) గ్రాడ్యుయేషన్‌ పూర్తవ్వగానే డబ్బు సంపాదించాలని ఉద్యోగ అవకాశాల కోసం ఆఫ్రికా, చైనా, అమెరికా వెళ్లాడు. అతని తల్లిదండ్రులు అమెరికాలోనే ఉంటున్నారు. కొన్నాళ్లు అమెరికాలో ఉద్యోగం చేశాక 2022లో హైదరాబాద్‌కు వచ్చాడు. కొంపల్లిలో ఉంటూ వివాహం చేసుకున్నాడు. వ్యాపారం మొదలుపెట్టినా నష్టాలు రావడంతో ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేశాడు. రెండు బైకులు కొని జీడిమెట్ల సుభాష్‌ నగర్‌కు చెందిన షౌకత్‌ రైనీ(19), వారిస్‌(18)లను డ్రైవర్లుగా పెట్టుకున్నాడు. ఎంత కష్టపడ్డా డబ్బు సరిపోకపోవడంతో లండన్‌ వెళ్లాలనుకున్నాడు. ఇందుకు అవసరమైన డబ్బు కోసం దోపిడీలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ర్యాపిడోపై ఒక కస్టమర్‌ను దింపేందుకు చాదర్‌ఘాట్‌లోని ఆభరణాల దుకాణానికి వెళ్లాడు. అక్కడ పరిస్థితులు, భద్రతాపరమైన లోపాలు గమనించి దుకాణాన్ని దోపిడీ చేయాలనుకున్నాడు. 

జైల్లో స్నేహితులు.. కొటాడియాకు జైల్లో నగరానికి చెందిన పాత నేరస్థులు షేక్‌ సొహైల్‌(23), సల్మాన్‌తో పరిచయం ఏర్పడింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో ముగ్గురూ జైలు నుంచి విడుదలయ్యారు. పలుచోట్ల రెక్కీ చేసి మేడ్చల్‌లోని ఆభరణాల దుకాణాన్ని ఎంచుకున్నారు. ఈ నెల 17న హబ్సిగూడలో ఒక ద్విచక్రవాహనం దొంగిలించారు. 20న ట్రాలీ ఆటోలో వచ్చి మూణ్నాలుగు సార్లు మళ్లీ దుకాణాన్ని పరిశీలించారు. దుకాణంలో చోరీకి యత్నించడం.. కత్తితో పొడిచినా వెరవకుండా యజమాని అప్రమత్తమై బయటకు రావడంతో అవకాశం చిక్కలేదు. కొటాడియా, సోహైల్‌ ద్విచక్రవాహనంపై పరారయ్యారు. సల్మాన్‌ ఆటోతో వెళ్లిపోయాడు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని