logo

బడ్జెట్‌ను మెట్రో అందుకునేనా?

మెట్రో రైలు విస్తరణ సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక(డీపీఆర్‌)కు మరింత సమయం పడుతుందా? అవుననే అంటున్నాయి మెట్రోరైలు వర్గాలు. ప్రభుత్వం మెట్రో విస్తరణపై సమీక్ష నిర్వహించే నాటికి తుది నివేదిక సిద్ధమవుతుందని చెబుతున్నారు.

Published : 23 Jun 2024 02:27 IST

సర్కారు సమీక్ష తరువాతే డీపీఆర్‌కు తుదిరూపు

ఈనాడు, హైదరాబాద్‌: మెట్రో రైలు విస్తరణ సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదిక(డీపీఆర్‌)కు మరింత సమయం పడుతుందా? అవుననే అంటున్నాయి మెట్రోరైలు వర్గాలు. ప్రభుత్వం మెట్రో విస్తరణపై సమీక్ష నిర్వహించే నాటికి తుది నివేదిక సిద్ధమవుతుందని చెబుతున్నారు. ఎన్నికల కోడ్‌ అనంతరం సర్కారు దృష్టి అంతా రైతు రుణమాఫీ, రైతు భరోసాపై ఉండటంతో మెట్రో వంటి ఇతర అంశాలపై సమీక్షించే అవకాశం రాలేదు. హైదరాబాద్‌లో రెండోదశలో 70 కి.మీ. మేర మెట్రోని విస్తరించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం నిర్ణయించి డీపీఆర్‌ రూపకల్పనకు ఆదేశించింది. రాయదుర్గం నుంచి నానక్‌రాంగూడలోని అమెరికన్‌ కాన్సులేట్‌ వరకు, నాగోల్‌-ఎల్బీనగర్‌-చంద్రాయణగుట్ట- జల్‌పల్లి-పీ7 రోడ్, శంషాబాద్‌ విమానాశ్రయం, ఇదే మార్గం అరాంఘర్, కొత్త హైకోర్ట్‌ వరకు, మియాపూర్‌ నుంచి పటాన్‌చెరు వరకు, ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్, ఎంజీబీఎస్‌ నుంచి ఫలక్‌నుమా, చంద్రాయణగుట్ట వరకు రెండోదశలో విస్తరణకు మార్గాలను సర్కారు ఎంపిక చేసింది. రెండు కన్సల్టెన్సీలకు ఈ బాధ్యతలు అప్పగించారు. డీపీఆర్‌ కోసం ఈ మార్గాల్లో మట్టి నమూనా పరీక్షలు, ట్రాఫిక్, ఇతరత్రా సర్వేలను పూర్తి చేసి ప్రాథమిక సమగ్ర ప్రాజెక్ట్‌ నివేదికను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. సీఎం సమీక్ష అనంతరం మార్పులు, చేర్పుల అనంతరం తుది నివేదికకు మంత్రివర్గం ఆమోదం తెలిపితే నిధుల సాయానికి కేంద్రానికి పంపనున్నారు.

ఎంతిస్తారు? 

ప్రాజెక్ట్‌ వ్యయంలో ఈక్విటీలో కేంద్రం తోడ్పాటు 15 శాతం, రాష్ట్రం 35 శాతం నిధులు వెచ్చిస్తుంది. చేరి సగం కూడా భరించే అవకాశం ఉంది. మిగిలిన 50 శాతానికి రుణాలు తీసుకుంటారు. ఇందులో ఒక 5 శాతం ప్రైవేటు భాగస్వామ్యం పెట్టుబడులు పెట్టేందుకు అవకాశాలు ఉన్నాయి.

కేంద్ర బడ్జెట్‌ అనంతరమే.. 

వచ్చే నెలలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై కేంద్రం ఇప్పటికే కసరత్తు మొదలెట్టింది. మెట్రో విస్తరణకు నిధులు ఇవ్వాలని సర్కారు గతంలోనే కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. విస్తరణ డీపీఆర్‌ను సిద్ధం చేసి పంపిస్తామని చెప్పింది. ఇప్పటివరకు రాష్ట్రమే ఇంకా డీపీఆర్‌కు ఆమోద ముద్ర వేయలేదు. దీనికి మరో నెల రోజులు సమయం పట్టేలా ఉంది. కాబట్టి బడ్జెట్‌తో సంబంధం లేకుండా కేంద్రాన్ని మెట్రోకి నిధులను కోరే అవకాశం ఉంది.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని