logo

చుట్టూ శునకాలు.. అరచేతిలో ప్రాణాలు

సుమారు పది శునకాలు ఓ మహిళపై దాడి చేశాయి. అటుగా ద్విచక్రవాహనంపై వచ్చిన మరో వ్యక్తి సాయం చేయడంతో బతికి బయటపడింది. బాధితురాలి వివరాల ప్రకారం.. మణికొండ చిత్రపురికాలనీకి చెందిన రాజేశ్వరి శనివారం ఉదయం వాకింగ్‌కు బయల్దేరగా వీధి కుక్కలు వెంటపడ్డాయి.

Updated : 23 Jun 2024 06:09 IST

ఒక్కసారిగా ఎగబడడంతో కిందపడిన మహిళ
ప్రాణభయంతో పడుతూ.. లేస్తూ.. పోరాటం
మణికొండ చిత్రపురి కాలనీలో ఘటన 

సీసీ కెమెరాల్లో నమోదైన శునకాల దాడి దృశ్యాలు

మణికొండ, న్యూస్‌టుడే: సుమారు పది శునకాలు ఓ మహిళపై దాడి చేశాయి. అటుగా ద్విచక్రవాహనంపై వచ్చిన మరో వ్యక్తి సాయం చేయడంతో బతికి బయటపడింది. బాధితురాలి వివరాల ప్రకారం.. మణికొండ చిత్రపురికాలనీకి చెందిన రాజేశ్వరి శనివారం ఉదయం వాకింగ్‌కు బయల్దేరగా వీధి కుక్కలు వెంటపడ్డాయి. ఆమె చేతిలోని ఫోన్‌ను ఆహారంగా భావించి దాడిచేయడానికి ప్రయత్నించాయి. ఈ క్రమంలో రాజేశ్వరి పలుమార్లు కిందపడి లేచారు. ఎన్నిసార్లు వాటిని వెళ్లగొట్టే ప్రయత్నం చేసినా వదలకుండా ఆమెను వెంబడించాయి. ఈ ఘటనలో ఆమె స్వల్పంగా గాయపడ్డారు. చివరికి అదే సమయంలో ఓ ద్విచక్ర వాహనదారుడు రావడంతో శునకాలు పారిపోయాయి. దీంతో ఆమె ఊపిరిపీల్చుకున్నారు. ప్రాణభయంతో ఆమె చేసిన ప్రయత్నం సీసీ కెమెరాల్లో రికార్డైంది. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా చక్కర్లు కొట్టింది. 

ప్రాణాలతో బయటపడుతానని అనుకోలేదు

కుక్కలు ఇలా దాడి చేస్తాయని అనుకోలేదు. చేతిలో ఉన్న ఫోన్‌తోనే వాటిని కొడుతూ రక్షించుకోగలిగాను. దేవుడి దయవల్ల బతికి బయటపడ్డాను. చేతిపై ఒక్క చోట కుక్క కరిచింది. కింద పడినందున స్వల్పంగా గాయాలయ్యాయి. రోడ్డుపైకి వచ్చాక ఒకరు బైకుపై, కారులో మరొకరు రావడంతో కుక్కలు వెనుదిరిగాయి.

రాజేశ్వరి 

కుక్కల బెడద ఉంటే సమాచారం ఇవ్వండి

కుక్కల బెడద ఉందని తెలిస్తే వెంటనే వాటిని అరికట్టడానికి తక్షణ చర్యలు తీసుకుంటున్నాం. చిత్రపురికాలనీలో శనివారం జరిగిన కుక్కల దాడి విషయం తెలియగానే బ్లూ క్రాస్‌ సంస్థను అప్రమత్తం చేశాం. మణికొండ మున్సిపల్‌ పరిధిలో ఎక్కడైనా కుక్కల బెడద ఉంటే తమ దృష్టికి తీసుకురావాలి. 

- ప్రదీప్‌కుమార్, మణికొండ మున్సిపల్‌ కమిషనర్‌  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని