logo

పాదచారులను కత్తులతో బెదిరించి దోపిడీ

నగరంలో అర్ధరాత్రిళ్లు కత్తులతో సంచరిస్తూ ఒంటరిగా ఉన్నవారిని బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు కరడుగట్టిన దొంగలను అరెస్టు చేసినట్టు టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్‌ ఆదివారం తెలిపారు.

Published : 24 Jun 2024 01:25 IST

నగరంలో ఇద్దరు సెల్‌ఫోన్‌ స్నాచర్ల అరెస్టు

ఈనాడు, హైదరాబాద్‌- రెజిమెంటల్‌బజార్, న్యూస్‌టుడే: నగరంలో అర్ధరాత్రిళ్లు కత్తులతో సంచరిస్తూ ఒంటరిగా ఉన్నవారిని బెదిరించి దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు కరడుగట్టిన దొంగలను అరెస్టు చేసినట్టు టాస్క్‌ఫోర్స్‌ డీసీపీ సాధన రష్మి పెరుమాళ్‌ ఆదివారం తెలిపారు. ఫలక్‌నుమాకు చెందిన మసూద్‌ ఉర్‌ రెహ్మాన్‌ (31) కొన్నాళ్లు క్యాబ్‌డ్రైవర్, వెల్డర్‌గా పనిచేశాడు. ఇతడిపై నాచారం, మైలార్‌దేవ్‌పల్లి ఠాణాల్లో పోలీసు కేసులున్నాయి. బుధవారం రాత్రి ముషీరాబాద్‌లోని బంధువుల ఇంటికి వెళ్లాడు. ఫజల్‌ ఉర్‌ రెహ్మాన్‌ అలియాస్‌ ఫజల్‌ (22)ను కలిశాడు. ఇద్దరూ కలసి దొంగతనం చేయాలని పథకం వేశారు. చెరో కత్తి తీసుకొని ద్విచక్రవాహనంపై బయల్దేరారు. అర్ధరాత్రి దాటాక చాదర్‌ఘాట్‌లోని స్వాగత్‌బార్‌ వద్ద నిలిపి ఉంచిన ద్విచక్రవాహనం చోరీ చేశారు. ఇద్దరూ బోలక్‌పూర్‌ చేరారు. చోరీ చేసిన వాహనాన్ని అక్కడే నిలిపి.. సొంత బండిపై సికింద్రాబాద్‌ వచ్చారు. అర్ధరాత్రి దాటాక 2.30 గంటల సమయంలో సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ సమీపంలోని గణేశుని ఆలయం వద్ద నడుచుకుంటూ వెళ్తున్న పాదచారికి కత్తి చూపి బెదిరించి సెల్‌ఫోన్‌ లాక్కున్నారు. బాధితుడు కేకలు వేయటంతో సమీపంలో ఉన్న యాంటీ స్నాచింగ్‌ బృందంలోని పోలీసులు దొంగలను పట్టుకునే ప్రయత్నం చేశారు. నిందితులు ఇద్దరూ పోలీసులను తప్పించుకొని పారిపోతూ బాటా షోరూం వద్ద మరో సెల్‌ఫోన్‌ స్నాచింగ్‌ చేశారు. నిందితులను వెంబడించిన పోలీసులు ఎట్టకేలకు సిటీలైట్‌ హోటల్‌ వద్ద అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు ఆ ఇద్దరూ తమ వద్ద ఉన్న కత్తులతో దాడికి తెగబడ్డారు. వీరిపై ఒక కానిస్టేబుల్‌ రెండు రౌండ్లు కాల్పులు జరపటంతో ప్రధాన నిందితుడు మసూద్‌ ఉర్‌ రెహ్మాన్‌ కుడికాలిలోకి బుల్లెట్‌ దూసుకెళ్లింది. అయినా పోలీసులకు చిక్కకుండా ఇద్దరు నిందితులు తప్పించుకున్నారు. అదనపు డీసీపీ పి.అశోక్, గోపాలపురం ఏసీపీ పి.సుబ్బయ్య, డీఐ బి.వి.కౌశిక్, ఇన్‌స్పెక్టర్‌ బాలస్వామి ఆధ్యర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. 48 గంటల వ్యవధిలోనే ఇద్దరు నిందితులను అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రెండు ద్విచక్రవాహనాలు, మూడు చరవాణులు, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు