logo

రీఫండ్‌ విషయంలో సేవాలోపాలు

ఒప్పందం ప్రకారం గడువులోగా ఫొటోషూట్‌ పూర్తి చేయకుండా చెల్లించిన అడ్వాన్స్‌ మొత్తం రీఫండ్‌ ఇవ్వకుండా ఇబ్బందిపెట్టిన ఫ్రీలాన్స్‌ ఫొటోగ్రాఫర్‌ ఒయింద్రిలా భోల్‌కు రంగారెడ్డి జిల్లా కమిషన్‌ జరిమానా విధించింది.

Published : 24 Jun 2024 01:26 IST

ఈనాడు, హైదరాబాద్‌: ఒప్పందం ప్రకారం గడువులోగా ఫొటోషూట్‌ పూర్తి చేయకుండా చెల్లించిన అడ్వాన్స్‌ మొత్తం రీఫండ్‌ ఇవ్వకుండా ఇబ్బందిపెట్టిన ఫ్రీలాన్స్‌ ఫొటోగ్రాఫర్‌ ఒయింద్రిలా భోల్‌కు రంగారెడ్డి జిల్లా కమిషన్‌ జరిమానా విధించింది. వినియోగదారుడి నుంచి వసూలు చేసిన రూ.20వేలు రీఫండ్‌ చేయడంతో పాటు రూ.5వేలు పరిహారం, రూ.2వేలు కేసు ఖర్చులు చెల్లించాలని ఆదేశించింది. నార్సింగికి చెందిన సందీపన్‌బసు ‘బౌడోయిర్‌ ఫొటోగ్రఫీ సెషన్‌’ కోసం పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రతివాద ఫొటోగ్రాఫర్‌ను వాట్సాప్‌లో సంప్రదించారు. ఫొటోషూట్‌కి మొత్తం రూ.40వేలు ఖర్చవుతుందని, అందులో అడ్వాన్స్‌గా రూ.20వేలు చెల్లించాలని కోరడంతో ఫిర్యాదీ 2022 ఏప్రిల్‌లో గూగుల్‌పే ద్వారా చెల్లించారు. తర్వాతి రోజు స్టూడియో బుక్‌ అయ్యిందా అని ప్రశ్నించగా బుక్‌ అయ్యిందని..త్వరలో సమాచారం ఇస్తానని ప్రతివాద ఫొటోగ్రాఫర్‌ చెప్పారు. కాలయాపన తప్ప షూట్‌ జరగకపోవడంతో ఫిర్యాదీ తన డబ్బు రీఫండ్‌ చేయాలని కోరారు. అందుకు ఫొటోగ్రాఫర్‌ అంగీకరించలేదు. దీంతో ఆమె రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించి లీగల్‌ నోటీసులు పంపారు. విచారించిన కమిషన్‌ మొత్తం డబ్బు, పరిహారం, కేసు ఖర్చులు కలిపి చెల్లించాలని తీర్పు వెలువరించింది. ్య రీఫండ్‌ విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇబ్రహీంపట్నం రీజనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీకి రంగారెడ్డి జిల్లా వినియోగదారుల కమిషన్‌ మొట్టికాయలు వేసింది. 9శాతం (రూ.17,235 కి) వడ్డీ, పరిహారం రూ.10వేలు, కేసు ఖర్చులు రూ.5వేలు కలిపి 45 రోజుల్లో చెల్లించాలని ఆదేశించింది. బడంగ్‌పేట్‌కు చెందిన గజ్జెల చిన్న ఓబన్న తన కారు ఆర్‌సీ గడువు విషయంలో గందరగోళానికి గురై రెన్యువల్‌ కోసం ఇబ్రహీంపట్నం ఆర్టీఏకు దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు చెప్పిన ప్రకారం రూ.17,270 చెల్లించారు. అయితే కొద్దిరోజులకే ఆర్‌సీ గడువు మరోనాలుగేళ్లు ఉందంటూ ఓ ధ్రువపత్రం లభించడంతో...చెల్లించిన డబ్బు రీఫండ్‌ చేయాలని ఆర్టీఏకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే మూడేళ్ల కాలయాపన తర్వాత డబ్బులు ఖాతాలో పడినా..వ్యయ ప్రయాసలకు గురి చేసి సేవాలోపానికి పాల్పడ్డారని కమిషన్‌ను ఆశ్రయించారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని