logo

హత్యా.. ఆత్మహత్యా?

అనుమానాస్పద స్థితిలో రైలు పట్టాలపై బాలుడు దుర్మరణం చెందాడు. అయితే ఇది హత్యా..? ఆత్మహత్యా..? అనే విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. పోలీసులు, మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం..

Updated : 24 Jun 2024 03:28 IST

రైలు పట్టాలపై బాలుడి దుర్మరణం 
ఘటనపై పలు అనుమానాలు

డానీష్‌  

మూసాపేట, న్యూస్‌టుడే: అనుమానాస్పద స్థితిలో రైలు పట్టాలపై బాలుడు దుర్మరణం చెందాడు. అయితే ఇది హత్యా..? ఆత్మహత్యా..? అనే విభిన్న కథనాలు వినిపిస్తున్నాయి. పోలీసులు, మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. అల్లాపూర్‌ పరిధి సఫ్దర్‌నగర్‌కు చెందిన అహ్మద్, అన్వరి బేగం దంపతులకు కుమార్తెతోపాటు కుమారుడు డానీష్‌(17). ఇతను ఇంటర్‌ చదువుతున్నాడు. శనివారం రాత్రి 9.30 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిన కుమారుడు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు పలుమార్లు ఫోన్‌ చేశారు. ఎంతకీ ఫోన్‌ తీయలేదు. కొంతసేపటి తర్వాత స్విచ్ఛాఫ్‌ అయ్యింది. అనుమానం వచ్చిన కుటుంబీకులు కుమారుడి ఆచూకీ కోసం ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అర్ధరాత్రి ఒంటిగంట తర్వాత అల్లాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో బోరబండ రైల్వేస్టేషన్‌ చివరలోని పట్టాలపై ఛిద్రమైన యువకుడి మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన రైల్వే రక్షణదళం హెడ్‌ కానిస్టేబుల్‌ నాంపల్లి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. ఆదివారం ఉదయం ఘటనా స్థలానికి చేరుకున్న డానీష్‌ తల్లిదండ్రులు తమ కుమారుడి మృతదేహాన్ని గుర్తించి బోరుమన్నారు. ఇది ఆత్మహత్య అయి ఉండొచ్చని రైల్వే పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తుండగా.. తమ కుమారుడికి ఆత్మహత్య చేసుకోవాల్సిన అగత్యం లేదని, ఎవరో హత్య చేసి రైల్వే పట్టాలపై పారేసి ఉంటారని తల్లిదండ్రులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 19న సనత్‌నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధి భరత్‌నగర్‌ సమీపంలో చోరీ సొత్తు పంపకాల విషయంలో తలెత్తిన వివాదం కారణంగా సయ్యద్‌ అజార్‌(22) అనే యువకుడిని అతని సహచరుడైన ఆసీఫ్‌ హత్యచేసిన విషయం తెలిసిందే. ఆ ఇద్దరితో డానీష్‌కు స్నేహం ఉండడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని