logo

ఉప్పల్, నాగోల్‌ ఇన్‌స్పెక్టర్లపై బదిలీ వేటు

విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అభియోగంపై ఉప్పల్, నాగోల్‌ ఇన్‌స్పెక్టర్లపై బదిలీ వేటు పడింది.

Updated : 24 Jun 2024 03:27 IST

కేసుల నమోదులో నిర్లక్ష్యం

పరశురాం, ఎలక్షన్‌రెడ్డ్చి

ఈనాడు- హైదరాబాద్, నాగోల్, ఉప్పల్, న్యూస్‌టుడే: విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే అభియోగంపై ఉప్పల్, నాగోల్‌ ఇన్‌స్పెక్టర్లపై బదిలీ వేటు పడింది. ఉప్పల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎలక్షన్‌రెడ్డి, నాగోల్‌ ఇన్‌స్పెక్టర్‌ పరశురాంను రాచకొండ కమిషనరేట్‌ ప్రధాన కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ కమిషనర్‌ తరుణ్‌జోషి శనివారం రాత్రి వేర్వేరుగా ఆదేశాలిచ్చారు.  ఉప్పల్‌లో ఓ కేసులో ఎస్సై శంకర్‌ను డీసీపీ కార్యాలయానికి అటాచ్‌ చేశారు. 

ఎస్సీ, ఎస్టీ ఫిర్యాదులో ..!

ఎస్సీ, ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద కేసు నమోదు చేయాలంటూ బాధితుడు ఇచ్చిన ఫిర్యాదును సరిగా పట్టించుకోని వ్యవహారంలో నాగోల్‌ ఇన్‌స్పెక్టర్‌ పరశురాంను బదిలీ చేశారు. ఎల్బీనగర్‌ ఠాణా పరిధిలోని ఎన్టీఆర్‌నగర్‌లో నివసించే గౌతమ్‌ ఆలియాస్‌ బద్దు(22)పై నాగోలు పోలీస్‌స్టేషన్‌లో 2 చోరీ కేసులున్నాయి. ఎల్బీనగర్‌లో సస్పెక్ట్‌ షీట్‌ ఉంది. అతనికి నాగోలు సమీపంలోని సాయినగర్‌ గుడిసెలకు చెందిన సంతోష్‌కు మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ నెల 6ః తెల్లవారుజామున 2.30గంటల ప్రాంతంలో ఎన్టీఆర్‌నగర్‌లోని స్నేహితుడి ఇంట్లో గౌతమ్‌ను.. సంతోష్‌ మరికొందరు కలిసి తీవ్రంగా కొట్టారు.  సాయినగర్‌కు తీసుకువచ్చి స్తంభానికి కట్టేసి మరోసారి కర్రలతో కొట్టారు. ఈ దాడిలో గౌతమ్‌కు దవడ పగిలి నాలుగు దంతాలు ఊడిపోయాయి. స్థానికుడొకరు డయల్‌ 100, 108కు సమాచారమిచ్చాడు. ఎల్బీనగర్, నాగోల్‌ పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని అతన్ని 108లో ఆస్పత్రిలో చేర్పించారు. తీవ్ర గాయాలతో ఉన్న బాధితుడు గౌతమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. గౌతమ్‌పై గతంలో నమోదైన చోరీ కేసుల విషయంలో నాగోల్‌ ఎస్సై మధు ఫోన్‌ చేసి ఠాణాకు రావాలని సూచించాడు. గౌతమ్‌ ఈ నెల 12న ఠాణాకు వెళ్లి తనపై దాడి జరిగిందని, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదుచేయాలని కోరాడు. దొంగతనం కేసులో పిలిచినందుకు దాడి చేశారని ఫిర్యాదు ఇస్తున్నట్లు భావించిన పోలీసులు సక్రమంగా స్పందించలేదు. ఫిర్యాదు మార్చి తీసుకురావాలన్నారు. బాధితుడు రాచకొండ సీపీ తరుణ్‌జోషిని ఆశ్రయించాడు. తనపై జరిగిన దాడి దృశ్యాలతోపాటు గాయాల ఫొటోలు, వీడియోలను సీపీకి అందజేశాడు సీపీ ఆదేశాలతో ఏసీపీ కృష్ణయ్య ఈ నెల 21న ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేశారు. సంతోష్, అతని తల్లిదండ్రులు మరో 8మందిని రిమాండుకు తరలించారు. కేసు నమోదు చేయడంలో తాత్సారం చేసినందుకు ఇన్‌స్పెక్టర్‌ పరశురాంను కమిషనరేట్ కార్యాలయానికి అటాచ్‌ చేస్తూ సీపీ తరుణ్‌జోషి ఉత్తర్వులు జారీచేశారు.ఎస్సై మధుతోపాటు 6న రాత్రి విధుల్లో ఉన్న ఏఎస్సై అంజయ్యపైనా చర్యలు తీసుకోనున్నట్లు తెలిసింది. 

కేసు నమోదులోనే..: కొందరు పోకిరీలు ప్రేమజంటను వేధించిన కేసులో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే కారణంతో ఉప్పల్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎలక్షన్‌రెడ్డిని కమిషనర్‌ కార్యాలయానికి అటాచ్‌ చేశారు. ఈ నెల 15న ఉప్పల్‌ భగాయత్‌లో తెల్లవారుజామున ప్రేమజంటను కొందరు పోకిరీలు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారు. ప్రేమ జంట ఉప్పల్‌ పోలీసుల్ని ఆశ్రయించగా.. ఎస్సై శంకర్‌ ఐదుగురు నిందితుల్ని గుర్తించారు. బాధితులు రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వకపోవడంతో పెట్టీ కేసు నమోదు చేసి పంపించారు. రాజీ చేస్తామంటూ సంతోశ్‌రెడ్డి, శివ ఎస్సై పేరు చెప్పి పోకిరీల నుంచి రూ.2.7 లక్షలు వసూలు చేశారు. ఈ వ్యవహారం కమిషనర్‌ తరుణ్‌జోషి దృష్టికి చేరడంతో విచారించి డీసీపీ కార్యాలయానికి అటాచ్‌ చేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు