logo

దూరం తగ్గేను.. ఆదాయం పెరిగేను

ప్రయాణికులను రైలు రవాణా సౌకర్యం కల్పించేందుకు, వస్తు రవాణా వ్యాప్తికి తాండూరు నుంచి కొత్తగా మరో రైలు మార్గం ఏర్పడబోతోంది. జహీరాబాద్‌ వరకు నూతన రైలు మార్గం నిర్మించేందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది.

Updated : 24 Jun 2024 03:14 IST

తాండూరు- జహీరాబాద్‌ మధ్య కొత్త రైలు మార్గం
సర్వే పనులకు శ్రీకారం
న్యూస్‌టుడే, తాండూరు గ్రామీణ 

ప్రయాణికులను రైలు రవాణా సౌకర్యం కల్పించేందుకు, వస్తు రవాణా వ్యాప్తికి తాండూరు నుంచి కొత్తగా మరో రైలు మార్గం ఏర్పడబోతోంది. జహీరాబాద్‌ వరకు నూతన రైలు మార్గం నిర్మించేందుకు దక్షిణ మధ్య రైల్వే సన్నాహాలు చేస్తోంది. తాజాగా సర్వే పనులు చేపట్టింది. పూర్తయిన వెంటనే రైలు మార్గం నిర్మించేందుకు ఆ శాఖ రూ.1,400కోట్ల అంచనాలతో ప్రతిపాదనల్ని సిద్ధం చేసింది. రైలు మార్గం అందుబాట్లోకి వస్తే కేవలం గంట వ్యవధిలోనే జహీరాబాద్‌ చేరుకునే వీలుంటుంది. వేలాది మంది వ్యాపారులు, ప్రయాణికులకు సౌకర్యంగా మారుతుంది. ఈ నేపథ్యంలో ‘న్యూస్‌టుడే’ కథనం. 

ప్రస్తుతం మూడు గంటల ప్రయాణం

తాండూరు-సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌కు కొత్త రైలు మార్గం నిర్మించాలనేది  కొన్ని సంవత్సరాలుగా ఉన్న డిమాండ్‌. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే ఆచరణ పెడుతోంది. కొత్త రైలు మార్గం నిర్మించేందుకు నాలుగు రోజుల క్రితం సర్వే పనులను ప్రారంభించింది. సర్వే ముగిశాక 70 కి.మీ. మేర తాండూరు- జహీరాబాద్‌ రైలు మార్గం నిర్మించేందుకు మార్గం సుగమం అవుతుంది.

ప్రస్తుతం ఉన్న రైలు మార్గం వికారాబాద్‌ మీదుగా నిర్మించడంతో 104 కి.మీ. ప్రయాణించి జహీరాబాద్‌ చేరేందుకు ఏకంగా మూడు గంటల సమయం పడుతోంది. నూతన రైలు మార్గం అందుబాట్లోకి వస్తే కేవలం గంటన్నర వ్యవధిలో చేరుకునే వీలుంటుంది. దీంతో ప్రయాణ భారం తప్పడంతోపాటు సమయం ఆదా అవుతుంది. దేశంలో ఖ్యాతి గడించిన తాండూరు కందుల ఎగుమతులకు సౌలభ్యంగా మారనుంది. ఇక్కడి ఐదు సిమెంటు కర్మాగారాల ఎగుమతులు, దేశ విదేశాల్లో పేరొందిన నాపరాయి తరలించేందుకు వీలుండటంతో వ్యాపార కార్యకలాపాలు మరింత విస్తరించేందుకు దోహదపడుతుంది. ఇప్పటికే ఉపాధి పొందుతున్న పాతిక వేల మంది కార్మికులతోపాటు మరింత కొంత మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయి.

అరకొర ఆర్టీసీ బస్సులతో అవస్థలు

తాండూరు-జహీరాబాద్‌కు రోడ్డు మార్గం ద్వారా వెళ్తే 54 కి.మీ. దూరం. రైలు మార్గంతో పోల్చితే ఇది సగానికి తగ్గుతుంది. దీంతో ఎక్కువ మంది రహదారి ప్రయాణానికి ఆసక్తి చూపుతున్నారు. తాండూరు డిపో ద్వారా మూడు సర్వీసులు, జహీరాబాద్‌ డిపో నుంచి ఒక సర్వీసు బస్సు నడుపుతున్నారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సర్వీసులను పెంచకపోవడంతో కిక్కిరిసిన ప్రయాణంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిరోజు బస్సుల్లో 2వేల మంది రాకపోకలు సాగిస్తుండగా మరో వెయ్యిమంది ప్రైవేటు వాహనాల్లో వచ్చిపోతున్నారు. రైలు మార్గం అందుబాట్లోకి వస్తే వీరంతా ఆర్టీసీ ప్రయాణం మీద ఆధారపడకుండా రైళ్లలో సాఫీగా రాకపోకలు సాగించేందుకు ఆస్కారముంటుంది.  

ఎగుమతులకు మరింత సౌకర్యం

కొత్త రైలు మార్గం ఏర్పాటైతే తాండూరు నుంచి జహీరాబాద్‌కు గంటన్నర వ్యవధిలో వెళ్లే వీలుంటుంది. ప్రయాణ ఛార్జీలు, సమయం ఆదా అవుతుంది. ప్రయాణానికి, సరకు ఎగుమతులకు సౌకర్యంగా మారుతుంది. నూతన రైలు మార్గం గురించి పూర్తి స్థాయిలో సమాచారం మాకు అందాల్సి ఉంది. - అరుణ్, రైల్వే స్టేషన్‌ బాధ్యులు, తాండూరు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని