logo

కోరల్లేని చట్టంతో భూములు కాపాడేదెలా..?

ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే వెంటనే రెవెన్యూ అధికారులు జేసీబీ యంత్రాలతో వెళ్లి కూల్చేస్తారు. ఫుట్‌పాత్‌లపై అక్రమ నిర్మాణాలు చేపడితే జీహెచ్‌ఎంసీ అధికారులు వాటిని తొలగిస్తారు.

Updated : 24 Jun 2024 03:23 IST

ట్రైబ్యునల్, కోర్టుల్లో వేలాది పెండింగ్‌ కేసులు
ఈనాడు, హైదరాబాద్‌

ప్రభుత్వ భూముల్లో అక్రమ నిర్మాణాలు చేపడితే వెంటనే రెవెన్యూ అధికారులు జేసీబీ యంత్రాలతో వెళ్లి కూల్చేస్తారు. ఫుట్‌పాత్‌లపై అక్రమ నిర్మాణాలు చేపడితే జీహెచ్‌ఎంసీ అధికారులు వాటిని తొలగిస్తారు. కానీ దేవాలయాల భూముల్లో ఎవరైనా ఆక్రమణలకు పాల్పడితే ఆలయ అధికారులకు నోటీసులు ఇచ్చే వరకే అధికారాలు పరిమితం చేయడంతో ఆక్రమణలకు అడ్డుకట్టవేయలేని పరిస్థితి నెలకొంది. దీంతో రెచ్చిపోతున్న ఆక్రమణదారులు నకిలీ పత్రాలు సృష్టించి ఆలయ ఆస్తులను కాజేస్తున్నారు. పలువురి నేతల అండదండా ఉండటంతో అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. కోరల్లేని దేవాదాయచట్టంతోనే ఈ పరిస్థితి ఏర్పడిందంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆక్రమణలను అడ్డుకుందామని వెళ్లినా.. తమకు ఎలాంటి రక్షణ ఉండటం లేదంటూ కొందరు ఆలయ ఈవోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జీహెచ్‌ఎంసీ, రెవెన్యూ తరహాలో దేవాదాయ చట్టంలో మార్పులు చేస్తేనే మాన్యం భూములను కాపాడటం సాధ్యమని చెబుతున్నారు.

మూడు జిల్లాల పరిధిలో 20వేల ఎకరాలు..

హైదరాబాద్‌ జిల్లాలో 5,718 ఎకరాలు, రంగారెడ్డి జిల్లాలో 9వేలు, మేడ్చల్‌ పరిధిలో 6వేల ఎకరాల చొప్పున దేవాదాయశాఖ భూములున్నాయి. ఇందులో వ్యవసాయ, వ్యవసాయేతర భూములుండగా కొన్ని ఆలయాలు మాత్రమే వాటి నుంచి ఆదాయం పొందుతున్నాయి. మిగిలినవి ఖాళీగా ఉండటంతో రాబందుల కళ్లు పడి ఆక్రమణలకు గురవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఆలయ ఈవోలు నోటీసులు ఇచ్చి సరిపెట్టుకోవాల్సి వస్తోంది. దీంతో ఆక్రమణదారులు నిర్మాణాలు కానిస్తున్నారు. ఈలోగా ఈవోలు ఎండోమెంట్‌ ట్రైబ్యునల్, క్రింది కోర్టులు, పైకోర్టులు, హైకోర్టు, సుప్రీంకోర్టు వరకు వెళ్లి పోరాడాల్సి వస్తోంది. నెక్నాంపూర్, కొందుర్గు, అత్తాపూర్‌లోని దేవాలయాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. కొన్నేళ్లగా ఇక్కడ భూవివాదాలు సాగుతుండగా.. అవన్నీ ఆలయ భూములే అంటూ ట్రైబ్యునల్‌ నుంచి ఎవిక్షన్‌ ఆర్డర్లు వచ్చాయి. అయినా మిగిలిన భూములను ఆక్రమించే ప్రయత్నం జరుగుతోంది. కేసులు వేసినా పదేళ్లకో.. పదిహేనేళ్లకో తీర్పులు వస్తాయన్న ధీమా వారిలో కనిపిస్తోందని అధికారులు చెబుతున్నారు.

నిర్మాణాలు మొదలు పెట్టాక..

కొన్నేళ్ల క్రితం వలస వచ్చిన వారంతా కొందుర్గు లక్ష్మీనర్సింహస్వామి ఆలయ భూముల్లో (33 ఎకరాలు) గుడిసెలు వేసుకున్నారు. ఆలయ అధికారులు పట్టించుకోకపోవడంతో నెమ్మదిగా నిర్మాణాలు చేపట్టారు. అధికారులు అప్రమత్తమై కేసులు వేశారు. విచారణ పూర్తయి తీర్పు వెలువడే లోగా అక్కడ వందల సంఖ్యలో నిర్మాణాలు వెలిశాయి. ఇప్పుడు ఆక్రమణలో ఎవరున్నారో గుర్తుపట్టి నోటీసులు అందించేందుకే అధికారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. 

రంగారెడ్డి జిల్లాలోనే అత్యధికం...

సాధారణంగా ఎండోమెంట్‌ ట్రైబ్యునల్‌కు వచ్చే కేసుల్లో దేవాదాయశాఖ భూములు, ఫౌండర్‌ ట్రస్టీ, గోత్రనామాలు, హక్కుదారులకు సంబంధించిన వివాదాలపై విచారణ సాగుతుంది. గ్రేటర్‌ పరిధిలో 2010 నుంచి ఇప్పటి వరకు మొత్తం 2వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. ఇందులో 1,600 భూవివాదాలు, 400 ఇతర కేసులున్నాయి. 1,500 కేసుల్లో తీర్పులు వెలువడ్డాయి. ప్రస్తుతం 500 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. గతేడాది నుంచి జూన్‌ వరకు మొత్తం 90 కేసుల్లో విచారణ పూర్తయ్యింది. ఇవి కాకుండా కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకూ పలు కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 400.. మేడ్చల్‌ జిల్లాలో 300కు పైగా కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని