logo

ఠాణాల్లో కాదు... రోడ్లమీదకు రండి

నగరంలో వరుస హత్యలు, దొంగతనాలు, దోపిడీలకు కళ్లెం వేసేందుకు పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగింది. నగర సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా పోలీస్‌స్టేషన్ల తనిఖీ చేపట్టారు.

Updated : 24 Jun 2024 03:18 IST

నగర పోలీసు అధికారులకు సీపీ దిశానిర్దేశం

ఈనాడు, హైదరాబాద్, న్యూస్‌టుడే, ఆసిఫ్‌నగర్‌: నగరంలో వరుస హత్యలు, దొంగతనాలు, దోపిడీలకు కళ్లెం వేసేందుకు పోలీసు యంత్రాంగం రంగంలోకి దిగింది. నగర సీపీ కొత్తకోట శ్రీనివాసరెడ్డి ఆకస్మికంగా పోలీస్‌స్టేషన్ల తనిఖీ చేపట్టారు. ఏడు జోన్ల పరిధిలో సుమారు 20కు పైగా యాంటీ చైన్‌స్నాచింగ్‌ టీమ్‌లను రంగంలోకి దింపారు. శాంతిభద్రతల సమస్యకు కారకులయ్యేవారి పట్ల కఠినంగా వ్యవహరించాలని సీపీ స్పష్టం చేసినట్టు సమాచారం. విధినిర్వహణలో అలసత్వం, పోలీస్‌స్టేషన్లకే పరిమితమవుతున్న ఎస్‌హెచ్‌వో, ఎస్సైలను గుర్తించి మందలించినట్టు తెలుస్తోంది. ఠాణాలు వదలి రోడ్ల మీదకు వచ్చి శాంతిభద్రతలు, ట్రాఫిక్‌ నిర్వహణలో భాగం కావాలని ఆదేశించారు. శుక్రవారం అర్ధరాత్రి దాటాక ఆసిఫ్‌నగర్, చిలకలగూడ ఠాణాల పరిధిలో శాంతిభద్రతల అదుపులో భాగంగా పోలీసులు కాల్పులు జరపటం సంచలనంగా మారింది. రెండు సంఘటనల్లోనూ కరడుగట్టిన దొంగలు, రౌడీషీటర్లున్నట్టు పోలీసులు నిర్ధారించారు. రోజూ డీసీపీ స్థాయి నుంచి కానిస్టేబుల్‌ వరకూ గస్తీవిధులు పకడ్బందీగా నిర్వహించాలని, పాతనేరస్థులు, రౌడీషీటర్ల కదలికలపై నిఘా ఉంచాలని సీపీ పోలీసు సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు. సీపీ ఆదేశాలతో శనివారం రాత్రి నుంచి ఆదివారం తెల్లవారుజాము వరకూ సున్నితమైన ప్రాంతాలు, ప్రధాన మార్గాల్లో పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. ఆసిఫ్‌నగర్, గుడిమల్కాపూర్, గోల్కొండ, పాతబస్తీ, పంజాగుట్ట, సికింద్రాబాద్‌ పరిసర ప్రాంతాల్లో అర్ధరాత్రి రోడ్లపై తిరిగేందుకు బయటకు వచ్చిన విద్యార్థులు, యువకులను గుర్తించారు. సరైన పత్రాల్లేకుండా వాహనాలు నడపుతున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కొందరు మైనర్లు ఉండటంతో తల్లిదండ్రులకు సమాచారం అందజేశారు. పైరవీలతో తమ వారిని తీసుకెళ్లేందుకు వచ్చిన వారిని ఠాణాల్లో కూర్చొబెట్టారు.

జిబుల్‌ పోలీసింగ్‌పై గురి.. 

నగరంలో విజిబుల్‌ పోలీసింగ్‌ తరచూ పోలీసు ఉన్నతాధికారులు చెబుతుండే మాట. నేర నియంత్రణలో ఇదే కీలక పాత్ర. లా అండ్‌ ఆర్డర్, ట్రాఫిక్‌ విభాగాల సిబ్బంది క్షేత్రస్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే శాంతిభద్రతలు అదుపులో ఉంటాయని తరచూ పోలీస్‌బాస్‌ల ఆదేశం. పండగలు, ప్రముఖుల పర్యటనలతో నిత్యం బందోబస్తు విధుల్లో ఉంటున్న పోలీసులకు విజిబుల్‌ పోలీసింగ్‌ ఆచరణలో సవాల్‌గా మారుతోంది. దీన్నే నేరస్థులు అనువుగా మలచుకుంటున్నారు. దీంతో పోలీసులు పర్యాటక ప్రాంతాలు, ప్రధాన మార్గాలతో సహా పబ్‌లు, బార్‌ అండ్‌ రెస్టారెంట్లు, బస్టాపుల్లో డెకాయ్‌ ఆపరేషన్‌లు ప్రారంభించారు. సివిల్‌ దుస్తుల్లో ఉన్న పోలీసులు సామాన్యుల మధ్య ఉంటూ దొంగలు, పోకిరీలను గమనిస్తూ అదుపులోకి తీసుకుంటున్నారు. యాంటీ స్నాచింగ్‌ టీమ్‌లకు ఆయుధాలు ఇచ్చారు. అత్యవసర పరిస్థితుల్లో కాల్పులు జరిపేందుకు అనువుగా ఆదేశాలు జారీచేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని