logo

ముందు డబ్బా.. తర్వాత కబ్జా

చిన్న..చిన్న షెడ్లు... డబ్బాలు..ఇవీ కబ్జా గుర్తులు. హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌(ఆర్థిక జిల్లా)లో 15 ఎకరాల్లోని సర్కారు జాగాలో పాగా వేసేందుకు కొందరు అక్రమార్కులు ప్రదర్శించిన మాయాజాలాన్ని రెవెన్యూ అధికారులు అడ్డుకుంటున్నారు. 

Published : 24 Jun 2024 03:18 IST

ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో అక్రమార్కులు
క్రమబద్ధీకరణ దరఖాస్తుల నిలిపివేత

ఈనాడు,హైదరాబాద్‌: చిన్న..చిన్న షెడ్లు... డబ్బాలు..ఇవీ కబ్జా గుర్తులు. హైదరాబాద్‌లోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌(ఆర్థిక జిల్లా)లో 15 ఎకరాల్లోని సర్కారు జాగాలో పాగా వేసేందుకు కొందరు అక్రమార్కులు ప్రదర్శించిన మాయాజాలాన్ని రెవెన్యూ అధికారులు అడ్డుకుంటున్నారు. 

ఎలాగంటే..: పేద, మధ్యతరగతికి చెందినవారమని జీవో 59 ప్రకారం తమ భూములను క్రమబద్ధీకరించాలని చేసిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచారు. అమెరికన్‌ కాన్సులేట్, ఐటీ కారిడార్‌లో ఇవి ఉండటంతో రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారికి అనుమానం వచ్చి ప్రాథమిక విచారణ చేయించడంతో విషయం తెలిసింది. ఆ దరఖాస్తులు క్రమబద్ధీకరణకు అర్హమైనవికావని ప్రభుత్వానికి నివేదికను పంపించారు.

భారీ వెంచర్లకు ప్రణాళికలు..: శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, రాయదుర్గం, ఖాజాగూడ, కోకాపేట, పుప్పాలగూడ, గౌలిదొడ్డి, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతాల్లో ఐదేళ్ల నుంచి అనూహ్యంగా స్థిరాస్తి వెంచర్లు పెరగడంతో ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లోని ప్రభుత్వభూములను సొంతం చేసుకునేందుకు అక్రమార్కులు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. గండిపేట మండలం ఫైనాన్షియల్‌ డ్రిస్ట్రిక్ట్‌లో సుమారు 15 ఎకరాల సర్కారు భూములను సొంతం చేసుకుని భారీ వెంచర్లు వేసేందుకు ప్రణాళికలతో ప్రైవేటు వ్యక్తులు సిద్ధమయ్యారు. చిన్నచిన్న షెడ్లు, తలుపులు లేని డబ్బాలను తాత్కాలికంగా ఏర్పాటు చేశారు. ఆమోదముద్రకు రూ.కోట్లలో ముడుపులు ఇచ్చేందుకు తలూపారు. 

భారీగా భూముల విలువ: గండిపేట మండలం పరిధిలోని ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో జీవో నంబర్‌ 59 ప్రకారం ప్రైవేటు వ్యక్తులు కొట్టేెయాలనుకున్న భూముల విలువ రూ.750కోట్ల వరకూ ఉంటుంది. ప్రైవేటు వ్యక్తుల వెనుక కొందరు ప్రజాప్రతినిధుల అనుచరులు, స్థానిక నాయకులు ఉన్నారని రెవెన్యూ అధికారులు అనుమానిస్తున్నారు.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని