logo

ఆదాయం మీకు.. ఖర్చు మాకు

అనాలోచితంగా తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు హెచ్‌ఎండీఏకు తలకు మించిన భారంగా మారుతుంటాయి. ఆదాయం వచ్చేలా ఆయా సంస్థలకు అవకాశం ఇచ్చి.. ఖర్చు పెట్టాల్సిన చోట మాత్రం మేమే చూసుకుంటామని పేర్కొనడం ఇబ్బందికరంగా మారుతోంది.

Published : 24 Jun 2024 03:26 IST

అవుటర్‌పై పచ్చదనం నిర్వహణ బాధ్యత హెచ్‌ఎండీఏకు 
అనాలోచిత నిర్ణయంతో ఆర్థిక భారం

ఈనాడు, హైదరాబాద్‌: అనాలోచితంగా తీసుకుంటున్న కొన్ని నిర్ణయాలు హెచ్‌ఎండీఏకు తలకు మించిన భారంగా మారుతుంటాయి. ఆదాయం వచ్చేలా ఆయా సంస్థలకు అవకాశం ఇచ్చి.. ఖర్చు పెట్టాల్సిన చోట మాత్రం మేమే చూసుకుంటామని పేర్కొనడం ఇబ్బందికరంగా మారుతోంది. అవుటర్‌ రింగ్‌ రోడ్డును 30 ఏళ్లపాటు టోల్, ఆపరేట్‌ అండ్‌ ట్రాన్స్‌ఫర్‌లో ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలర్స్‌ లిమినెటెడ్‌కు రూ.7,380 కోట్లతో లీజుకు ఇచ్చారు. టోల్‌ వసూలే కాకుండా రహదారి నిర్వహణ బాధ్యత సంస్థే చూడాలి. అప్పట్లో అధికారుల అనాలోచిత చర్యతో అవుటర్‌ పచ్చదనం నిర్వహణ మాత్రం హెచ్‌ఎండీఏ చూసేలా ఒప్పందం చేసుకున్నారు. 

ఇలా భారం: పచ్చదనం ప్రైవేటు సంస్థకు అప్పగిస్తే...నిర్వహణ ఎలా ఉంటుందోనని హెచ్‌ఎండీఏ పరిధిలోనే ఉండేలా చూశామని అప్పట్లో అధికారులు చెప్పారు. ఇప్పుడదే భారంగా మారుతోంది. తాజాగా అవుటర్‌ చుట్టూ మొక్కల పెంపకం...నిర్వహణకు రూ.30 కోట్లతో టెండర్లు పిలిచేందుకు అర్బన్‌ ఫారెస్టు విభాగం సిద్ధమవుతోంది. ఒకటి రెండు రోజుల్లో టెండర్ల నోటిఫికేషన్‌ వెలువడనుంది. 

చేయాల్సిన పనులివీ...

  • మహానగరం చుట్టూ 150 కిలోమీటర్ల మేరకు అవుటర్‌ రింగ్‌ రోడ్డు విస్తరించి ఉంది. అయిదు ప్యాకేజీలను 62 బ్లాకులుగా విభజించి డ్రిప్‌ పద్ధతిలో మొక్కలను పెంచుతున్నారు. సెంట్రల్‌ మీడియన్, ఇంటర్‌ ఛేంజ్‌లు, రోటరీలు, యుటిలిటీ కారిడార్‌...ఇలా అన్ని వైపులా 1500 కిలోమీటర్ల మేర మొక్కలు, చెట్లు విస్తరించి ఉన్నాయి. 
  • గతంలో 63,13,503 మొక్కలు నాటినట్లు హెచ్‌ఎండీఏ ప్రకటించింది. ఎక్కడ చూసినా రంగు రంగు పూలతో అవుటర్‌ దర్శనమిచ్చేలా తీర్చిదిద్దింది. టెకోమా, అర్జెంటీయా, బొగాన విలియా కాగితపు పూల మొక్కలు, పొగొడా, దురంతా, బొంబే బోర్డర్, నందివర్ధన తదితర రకాలు కనువిందు చేస్తున్నాయి. అవుటర్‌పై వెళ్లే వాహనదారులకు ఆహ్లాదం, ఆనందం పంచుతున్నాయి. 
  • వీటి నిర్వహణకు రూ.47 కోట్లతో 3 వరుసల్లో స్కాడా సాంకేతికతతో కూడిన డ్రిప్‌ను అందుబాటులోకి తెచ్చారు. 94 బోర్‌వెల్‌లు, 92 సంపులు ఏర్పాటు చేశారు. 
  • ఇంతా చేసిన తర్వాత ప్రైవేటు సంస్థకు 30 ఏళ్లకు లీజుకు ఇవ్వడంతో...పచ్చదనం నిర్వహణ భారం మొత్తం ప్రస్తుతం హెచ్‌ఎండీఏపై పడింది. రోజుకు 1.50 లక్షల వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. నెలకు రూ.60 కోట్ల వరకు ప్రైవేటు సంస్థకు ఆదాయం సమకూరుతోంది. 
  • ఇప్పటికే గతంలో ఏర్పాటు చేసిన డ్రిప్‌లో 80 శాతం మాత్రమే పనిచేస్తోంది. మరో 20 శాతం వరకు ట్యాంకర్లతో నీటి సరఫరా చేస్తున్నారు. డ్రిప్‌ సమకూర్చిన సంస్థే ఏడేళ్లపాటు నిర్వహణ కూడా చేపట్టాలి. పాడైన డ్రిప్‌ను తిరిగి పునరుద్ధరించేలా హెచ్‌ఎండీఏ చర్యలు చేపట్టాల్సి ఉంది. 
  • జూన్‌ ఒకటి నుంచి అవుటర్‌పై భారీగా మొక్కలు నాటేందుకు హెచ్‌ఎండీఏ సిద్ధమవుతోంది. 11 రకాల మొక్కలను సిద్ధం చేస్తున్నారు. వీటికి రూ.30 కోట్లతో టెండర్లను పిలిచేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు.  
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని