logo

రూ. వందల కోట్లు గాల్లో కలిసే..

నగరంలో వాయు కాలుష్య నియంత్రణకు యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు సరైన ఫలితాలు ఇవ్వడం లేదు. ఏటా రూ.కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నా తీవ్రతలో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. 

Published : 24 Jun 2024 03:37 IST

నగరంలో తగ్గని వాయు కాలుష్యం
నిధులు ఖర్చయినా ఫలితం శూన్యం
ఈనాడు, హైదరాబాద్‌

నగరంలో వాయు కాలుష్య నియంత్రణకు యంత్రాంగం తీసుకుంటున్న చర్యలు సరైన ఫలితాలు ఇవ్వడం లేదు. ఏటా రూ.కోట్ల నిధులు ఖర్చు చేస్తున్నా తీవ్రతలో పెద్దగా మార్పులు కనిపించడం లేదు. 

ఇలా ఉండాలి.. ‘నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రొగ్రామ్‌’ లో కాలుష్య నియంత్రణకు ‘కార్యాచరణ ప్రణాళిక’ రూపొందించారు. సూక్ష్మ ధూళికణాల (పీఎం 10, పీఏం 2.5)లో నిర్దేశించుకున్న స్థాయిలో మార్పు లేదు. ఘనపు మీటరు గాలిలో పీఎం -10... 60కి మించకూడదని ‘ప్రాణ’ (పోర్టల్‌ ఫర్‌ రెగ్యులేషన్‌ ఆఫ్‌ ఎయిర్‌ పొల్యూషన్‌ ఇన్‌ నాన్‌ ఎటైన్‌మెంట్‌ సిటీస్‌) నివేదిక స్పష్టం చేస్తోంది. 

ప్రణాళిక ఇలా: వాయు కాలుష్య నియంత్రణకు కేంద్రం 2019లో నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రాం ప్రారంభించింది. 2017తో పోల్చితే 2024 నాటికి గాలిలో సూక్ష్మధూళి కణాల స్థాయిని 30శాతం, 2026 నాటికి 40శాతం తగ్గించాలని నిర్దేశించారు. ఇందుకు ఆర్థిక సంఘం నిధులను సమకూర్చింది. హైదరాబాద్, నల్గొండ, పటాన్‌చెరు, సంగారెడ్డి నగరాల్లో కాలుష్య ప్రభావం లేకుండా చేయాలనుకున్నారు. పలు  విభాగాలతో కలిసి 42 అంశాలతో యాక్షన్‌ ప్లాన్‌ రూపొందించారు.

నిధులు: ఐదేళ్లలో రూ.551.05 కోట్లు ఆర్థిక సంఘం నుంచి మంజూరయ్యాయి. వీటితో కాలుష్య కారక అంశాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలి.

అమలు చేసిందిలా: మంజూరయిన నిధుల్లో రూ.405.97 కోట్లు ఖర్చు చేశారు. ఇచ్చిన నిధులను సైతం పూర్తిగా వినియోగించలేదు.

ఇదీ ఫలితం: 2017-18లో గాలి ధూళి, ఇతర కాలుష్య కారకాలు 110 మైక్రో గ్రాములు ఉంది. అప్పటి నుంచి ప్రణాళిక అమలు చేయడంతో  2023- 24 నాటికి 81 మైక్రోగ్రాములకు మాత్రమే చేరింది. 2026కల్లా 66 మైక్రోగ్రాములకు చేరాలి. అంటే ప్రతి రూ.80 కోట్లకు కేవలం ఏటా సగటున 5 మైక్రోగ్రాములు మాత్రమే తగ్గుతోంది. 


ఇలా ఉంటే కాలుష్యం పెరగదా..!

  • 15 ఏళ్లకు పైబడిన వాహనాలు 3లక్షలకు పైగా ఉన్నాయని 2021లో అధికారులు తేల్చారు. ప్రస్తుతం వీటి సంఖ్య మరింతగా పెరిగింది.
  • అరకొరగా నిర్మించే రోడ్లతో దుమ్ము రేగుతోంది. 38 స్వీపింగ్‌ యంత్రాలను తీసుకొచ్చినా సత్ఫలితాలివ్వడం లేదు. 
  • చెత్త, వ్యర్థాల దహనం నివారించలేకపోతున్నారు. 
  • వాహనాల పార్కింగ్‌ సదుపాయాలు లేకపోవడం, అధిక ఇంధన వినియోగంతో కాలుష్యం పెరుగుతోంది.
  • మొక్కల పెంపకం అనుకున్నంతగా లేకపోవడం.

‘ప్రాణ’  లెక్కల ప్రకారం పీఏం 10 (2018 నుంచి)

‘ప్రాణ’ నివేదిక ప్రకారం నిధుల వివరాలు (రూ.కోట్లలో)

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని