logo

కుమారుడు వెళ్లిపోయాడని మనస్తాపంతో తండ్రి మరణం

భూ వివాదంలో తనను కొందరు వేధిస్తున్నారంటూ మనస్తాపానికి గురైన రైతు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇదే సమయంలో తండ్రి మరణించిన ఘటన కలకలం రేపింది.

Published : 11 Jul 2024 04:10 IST

ఈనాడు- హైదరాబాద్, దుండిగల్, న్యూస్‌టుడే: భూ వివాదంలో తనను కొందరు వేధిస్తున్నారంటూ మనస్తాపానికి గురైన రైతు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇదే సమయంలో తండ్రి మరణించిన ఘటన కలకలం రేపింది. ఇప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న రైతు తండ్రి కుమారుడు ఇంటి నుంచి వెళ్లిపోయాడనే విషయం తెలుసుకుని ఆవేదనకు గురై మరణించినట్లు స్థానికులు పేర్కొన్నారు. మేడ్చల్‌ జిల్లా దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. డి.పోచంపల్లిలో త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ సుమారు పదెకరాల్లో విల్లా ప్రాజెక్టు చేపడుతోంది. ఇందులోని 1.13 ఎకరాల భూమిపై గత కొన్నాళ్లుగా వివాదం నడుస్తోంది. త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌ సంస్థ చేపట్టిన ప్రాంతం మధ్యలో తమ 1.13 ఎకరాల భూమి ఉందని స్థానిక బౌరంపేటకు చెందిన వంపుగూడెం కృష్ణారెడ్డి(65) కుమారుడు రైతు మాధవరెడ్డి వాదిస్తున్నారు. త్రిపుర సంస్థ మాత్రం మరో ప్రాంతంలో 1.13 ఎకరాల భూమి ఉందని చెబుతోంది. దీనిపై ఇరువర్గాల మధ్య ఘర్షణ జరుగుతోంది. త్రిపుర సంస్థ ప్రతినిధులు బలవంతంగా లాక్కునేందుకు ప్రయత్నిస్తున్నారని, సంస్థ ఎండీ సుధాకర్, మరికొందరు స్థానిక నేతలు కలిసి దారుణంగా వేధిస్తున్నారని మాధవరెడ్డి స్థానికులతో వాపోయేవాడు. దీనిపై రెండు నెలల క్రితం ఘర్షణ జరగడంతో పోలీసులు రంగంలోకి దిగి ఇరు వర్గాల మీద కేసులు నమోదు చేశారు. మొత్తం 8 మందిని అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. వీరిలో రైతు మాధవరెడ్డి కూడా ఉన్నారు.

లేఖ రాసి అదృశ్యం: గొడవల నేపథ్యంలో భూమిలోకి ఎవరూ వెళ్లకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇది కొనసాగుతుండగానే ఈ నెల 8న రైతు మాధవరెడ్డి లేఖ రాసి ఇంటి నుంచి వెళ్లిపోవడం కలకలం రేపింది. ‘‘1.13 ఎకరాల భూమి విషయంలో త్రిపుర కన్‌స్ట్రక్షన్స్‌ ఎండీ సుధాకర్‌తో కలిసి మేకల వెంకటేశం నన్ను మానసికంగా వేధిస్తున్నారు. 8న నన్ను పిలిపించుకుని అసభ్యంగా దూషించారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై వెళ్లిపోతున్నా. పిల్లలూ, అమ్మనాన్న నన్ను క్షమించండి’’ అని దుండిగల్‌ ఇన్‌స్పెక్టర్‌కు రాసిన లేఖలో పేర్కొన్నారు.  ఈ విషయం మంగళవారం మాధవరెడ్డి తండ్రి కృష్ణారెడ్డికి తెలిసింది. గత కొన్నిరోజులుగా అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన ఆయన్ను కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకొచ్చారు. తన కుమారుడు భూ తగాదా నేపథ్యంలో ఇంటి నుంచి వెళ్లిపోయాడనే విషయం తెలుసుకున్న ఆయన బుధవారం ఉదయం ఇంట్లో కన్నుమూశారని స్థానికులు చెబుతున్నారు.మాధవరెడ్డి ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నిస్తున్నామని దుండిగల్‌ ఇన్‌స్పెక్టర్‌ శంకరయ్య తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు