logo

కార్యాచరణ సరే .. భూములే కొరత

పరిశ్రమల విస్తరణ.. డాటా కేంద్రాల ఏర్పాటు.. ఐటీ సంస్థల రాక.. గృహ, వాణిజ్య, మాల్స్‌ నిర్మాణాల దూకుడుతో విద్యుత్తు వినియోగం ఏటేటా పెరుగుతోంది.

Updated : 11 Jul 2024 04:57 IST

వచ్చే ఐదేళ్ల కోసం కొత్తగా 61 ఉపకేంద్రాలు
స్థలాలు కేటాయించాలని జిల్లా కలెక్టర్లను కోరిన విద్యుత్తు శాఖ

ఈనాడు, హైదరాబాద్‌: పరిశ్రమల విస్తరణ.. డాటా కేంద్రాల ఏర్పాటు.. ఐటీ సంస్థల రాక.. గృహ, వాణిజ్య, మాల్స్‌ నిర్మాణాల దూకుడుతో విద్యుత్తు వినియోగం ఏటేటా పెరుగుతోంది. ప్రస్తుతం సిటీలో 5వేల మెగావాట్ల డిమాండ్‌ను తట్టుకునేలా విద్యుత్తు ఉపకేంద్రాలు, లైన్లు ఉన్నాయి. ఈ ఏడాది వేసవిలో గరిష్ఠంగా 4352 మెగావాట్ల డిమాండ్‌ నమోదైంది. ఈ నేపథ్యంలో భవిష్యత్తు అవసరాలను తట్టుకునేలా నెట్‌వర్క్‌ను అభివృద్ధి చేసేందుకు డిస్కం సన్నద్ధమవుతోంది. విద్యుత్తు డిమాండ్‌  అధికంగా ఉంటున్న రంగారెడ్డి జిల్లాలో కొత్తగా 25 చోట్ల విద్యుత్తు ఉపకేంద్రాల ఏర్పాటు అవసరం ఉందని అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో తమకు 1500 నుంచి 2000 చదరపు గజాల ప్రభుత్వ స్థలాలను ప్రజాప్రయోజనాల రీత్యా కేటాయించాలని రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు టీజీఎస్పీడీసీఎల్‌ ఆర్‌ఆర్‌ జోన్‌ చీఫ్‌ ఇంజినీర్‌ లేఖ రాశారు.

హైదరాబాద్‌ పరిధిలోని మెట్రోజోన్, మేడ్చల్‌ జోన్‌ నుంచి ఆయా జిల్లా కలెక్టర్లకు విద్యుత్తు ఉపకేంద్రాల నిర్మాణానికి స్థలాలు కేటాయించాలని కోరారు. మెట్రోజోన్‌కు 18, రంగారెడ్డి జోన్‌కు 25, మేడ్చల్‌ జోన్‌కు 18 చొప్పున కొత్తగా 33కేవీ ఉపకేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదించారు.

మేడ్చల్‌ జోన్‌ పరిధిలో..  మేడ్చల్‌ జోన్‌లో కొత్తగా ప్రతిపాదించిన 18 ఉపకేంద్రాలకు గాను 5 చోట్ల స్థలాలు అందుబాటులో ఉన్నాయి. మరో 13 ఉపకేంద్రాలకు భూములు కేటాయించాలని మేడ్చల్, సంగారెడ్డి జిల్లా కలెక్టర్లకు సీఈ లేఖ రాశారు. ఒక్క సంగారెడ్డి సర్కిల్‌లోనే కొత్తగా 10 విద్యుత్తు ఉపకేంద్రాలను వచ్చే ఐదేళ్లకోసం ప్రతిపాదించారు. మెట్రోజోన్‌లోనూ 18 ఉపకేంద్రాలకు స్థలాలు కావాలని హైదరాబాద్‌ కలెక్టర్‌ను కోరారు.

కార్యాలయాల ఏర్పాటుకూ..

ఒక్కో ఉపకేంద్రానికి 1500 నుంచి 2000 చదరపు గజాల భూముల అవసరమని ఇంజినీర్లు చెబుతున్నారు. అవుట్‌డోర్‌ 33/11కేవీ సబ్‌స్టేషన్ల నిర్మాణం కోసం ఎక్కువ స్థలాన్ని డిస్కం కోరుతుంది. భవిష్యత్తులో విస్తరణను బట్టి ఆయా ప్రాంతాల్లో విద్యుత్తు కార్యాలయాల ఏర్పాటుకూ స్థలాలను కోరుతున్నారు. డిస్కం గుర్తించిన స్థలాల్లో రెవెన్యూశాఖ, అటవీ, జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖలకు చెందినవి ఉన్నాయి.

మంచిరేవుల సర్వేనెం. 283లో దాదాపు 6 ఎకరాలు కేటాయించాలని.. అక్కడ 220/132/33కేవీ ఈహెచ్‌టీ ఉపకేంద్రానికి స్థలం కేటాయించాలని సీఈ కలెక్టర్‌ను కోరారు.

భవిష్యత్తు డిమాండ్‌ మేరకు..

నగరంలో విద్యుత్తు డిమాండ్‌ ఏటా 15 నుంచి 20 శాతం దాకా ఉంటుంది. గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో విద్యుత్తు లోడ్‌ పెరగడంతో అదనంగా 11కేవీ ఫీడర్లు ఉన్నాయి. ఇప్పుడున్న 33/11కేవీ ఉపకేంద్రాలపై లోడు పెరిగే కొద్దీ ఒత్తిడి పెరుగుతుంది. సుదూర ప్రాంతాల్లో ఏర్పాటు చేయడం వల్ల పంపిణీ నష్టాలు ఎక్కువ.  భవిష్యత్తు డిమాండ్‌కు అనుగుణంగా సబ్‌స్టేషన్ల ఏర్పాటుకు అనువైన ప్రాంతాలను విద్యుత్తు అధికారులు గుర్తించారు. జాబితాను రూపొందించి కలెక్టర్లకు అందజేశారు.

రంగారెడ్డిలో ఎక్కడెక్కడ..

  • సైబర్‌సిటీ సర్కిల్‌ పరిధిలో బొటానికల్‌గార్డెన్, నెక్నాంపూర్, నల్లగండ్ల హుడా, హఫీజ్‌పేట్, 8వ బెటాలియన్, మంచిరేవుల ప్రాంతాలు అనువైనవని.. అక్కడ స్థలాలు కేటాయించాలని కలెక్టర్‌ను కోరారు.
  • రాజేంద్రనగర్‌ సర్కిల్‌ పరిధిలో అత్యధిక కొత్త ఉపకేంద్రాలకు భవిష్యత్తులో డిమాండ్‌ ఉంటుందని అంచనా వేశారు. ఇక్కడ 14చోట్ల స్థలాల అవసరం ఉంది. హిమాయత్‌సాగర్‌ పీ అండ్‌ టీ కాలనీ, హిమాయత్‌సాగర్, కిస్మత్‌పూర్, సాతంరాయి, గగన్‌పహాడ్, అలీనగర్, రాళ్లగూడ, శంషాబాద్‌ టౌన్‌ హుడాకాలనీ, మీరాలం పార్క్, రాజేంద్రనగర్‌ ఆర్‌డీవో కార్యాలయం సమీపంలో, కాటేదాన్‌ కింగ్స్‌ కాలనీ, జల్‌పల్లి, గౌస్‌నగర్, బండ్లగూడ 2బీహెచ్‌కే ప్రాంతాల్లో స్థలాల అవసరం ఉందని లేఖలో పేర్కొన్నారు.
  • సరూర్‌నగర్‌ సర్కిల్‌ ఫతుల్లాగూడ ఎస్‌టీపీ, కుంట్లూరు, బీఎన్‌రెడ్డినగర్, బడంగ్‌పేట్‌ డంపింగ్‌ యార్డ్, మన్సురాబాద్‌ పెద్దచెరువు ప్రాంతాల్లో కొత్త సబ్‌స్టేషన్ల నిర్మాణాలకు స్థలాల అవసరం ఉందని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని