logo

కనిపించని వ్యూహం.. చేరేదెలా గమ్యం

రాజధానిలో వాహనాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ ఏడాది పూర్తయ్యే నాటికి గ్రేటర్‌ పరిధిలో రిజిస్ట్రేషన్‌ అయ్యే వాహనాల సంఖ్య 70లక్షలు దాటుతుంది.

Published : 11 Jul 2024 04:27 IST

రాబోయే పదేళ్లలో రోడ్లపైకి   1.6 కోట్ల వాహనాలు
అదే స్థాయిలో రోడ్లు విస్తరించాల్సిన ఆవశ్యకత

ఈనాడు, హైదరాబాద్‌: రాజధానిలో వాహనాల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. ఈ ఏడాది పూర్తయ్యే నాటికి గ్రేటర్‌ పరిధిలో రిజిస్ట్రేషన్‌ అయ్యే వాహనాల సంఖ్య 70లక్షలు దాటుతుంది. అనధికారికంగా మరో పది లక్షలు నగరంలో రాకపోకలు సాగిస్తుంటాయి. అధికారుల అంచనా ప్రకారం రాబోయే పదేళ్లలో గ్రేటర్‌ హైదరాబాద్‌లోని రిజిస్టర్డు వాహనాలు 1.60కోట్లకు పెరగనున్నాయని అంచనా. అనధికారికంగా పెరిగే వాహనాలతో కలిపితే.. సంఖ్య దాదాపు రెండు కోట్లు దాటనుంది. మరి.. అవి నడిచేందుకు అవసరమైన రహదారులు ఆ స్థాయిలో పెరుగుతాయా? పైవంతెనలు, అండర్‌పాస్‌లు, ఆర్వోబీ, ఆర్‌యూబీలు సాకారమవుతాయా? అవన్నీ జరిగినా, జరగకపోయినా.. ప్రజలు కొత్త వాహనాలను కొనుగోలు చేయక మానరు. అందువల్ల రహదారుల విస్తరణ అంతకంతకు పెరిగితే నగర జీవనం సాఫీగా సాగుతుంది.

 ముందున్న సవాళ్లు..నగరంలో ప్రస్తుతం 9వేల కి.మీ.ల రోడ్లున్నాయి. రవాణా శాఖ అంచనాలను పరిగణనలోకి తీసుకుంటే.. రోడ్లు కూడా మూడు రెట్లు పెరగాల్సి ఉంది. అంటే 27వేల కి.మీ.లకు పెరగాలి. నగరంలోని రోడ్లను విస్తరించడం, శివారు ప్రాంతాల్లో కొత్తవి నిర్మించడం, ఉన్నవి 100 నుంచి 150 అడుగుల మేర వెడల్పు చేయడం, రోడ్ల విస్తరణ సాధ్యంకాని ప్రాంతాల్లో పైవంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణం వంటి చర్యలు తీసుకుంటే.. వచ్చే సవాళ్లను ఎదుర్కోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ప్రజారవాణా వ్యవస్థను మెరుగుపరచాల్సిన అవసరం ఉంది. నూతన రవాణా వసతులను తీసుకొచ్చి, వాటి చెల్లింపులకు ఒకే కార్డుతో చేసే సౌలభ్యం తీసుకురావాలన్నారు.

ప్రస్తుతం జీహెచ్‌ఎంసీలో.. వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం(ఎస్సార్డీపీ) కింద గత ఆరేళ్లలో జీహెచ్‌ఎంసీ రూ.6,500కోట్లు వెచ్చించి 35 పనులు చేసింది. మరో రూ.3వేల కోట్ల పనులు వేర్వేరు దశల్లో ఉన్నాయి. కేబీఆర్‌ పార్కు కింద, ఐటీసీ కోహినూర్‌ రోడ్డుతోపాటు మరో మూడు రోడ్డు మార్గాల్లో సొరంగ మార్గాల నిర్మాణంపై జీహెచ్‌ఎంసీ ఇప్పటికే అధ్యయనం చేస్తోంది. మూసీకి ఇరువైపులా విశాలమైన రోడ్డు మార్గాలను నిర్మించే పనులు సర్వే దశలో ఉన్నాయి. కూడళ్లను విస్తరించే పనులు 107 చోట్ల చేపట్టామని, అందులో 31 పూర్తి, 54 పురోగతిలో, 22 చోట్ల భూసేకరణ చేయాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని