logo

గంగారం వద్ద డబుల్‌ డెక్‌ ఫ్లైఓవర్‌

మెట్రో అధికారులు ఆలస్యంగా మేల్కొన్నారు. గంగారం వద్ద మాత్రం డబుల్‌ డెక్‌ ఫ్లైఓవర్‌ నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారు.

Published : 11 Jul 2024 04:35 IST

పైన మెట్రో కింద రహదారి

అధికారులతో సమావేశమైన మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: మెట్రో అధికారులు ఆలస్యంగా మేల్కొన్నారు. గంగారం వద్ద మాత్రం డబుల్‌ డెక్‌ ఫ్లైఓవర్‌ నిర్మించాలనే నిర్ణయానికి వచ్చారు. ముందే మేల్కొంటే అన్ని మార్గాల్లోనూ డబుల్‌డెక్‌ ఫ్లైఓవర్లతో కింద రహదారి, పైన మెట్రోతో ట్రాఫిక్‌ తిప్పలు తప్పేవనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రతిపాదిత మెట్రో రెండో దశ మార్గాల్లో ఇప్పటికే ఉన్న పైవంతెనలు, కొత్తగా చేపట్టే, నిర్మాణంలో ఉన్న పైవంతెనల వద్ద ఎదురవుతున్న సవాళ్లు, పరిష్కారాలపై మెట్రో, ఎన్‌హెచ్‌ అధికారులు బుధవారం చర్చించారు. బేగంపేటమెట్రోరైలు భవన్‌లో హైదరాబాద్‌ మెట్రోరైలు ఎండీ ఎన్వీఎస్‌రెడ్డి, ఇంజినీర్ల బృందం, డీపీఆర్‌ కన్సల్టెన్సీ ఇంజినీరింగ్‌ నిపుణులతో కలిసి ఎన్‌హెచ్‌ అధికారులు సమావేశమయ్యారు.

  • ఎల్బీనగర్‌-హయత్‌నగర్‌ కారిడార్‌ సుమారు 7 కి.మీ. ఉంటుంది. ఎల్బీనగర్‌ కూడలి వద్ద ఇప్పటికే ఉన్న మెట్రో వయాడక్ట్‌ పొడిగింపుగా నిర్మించనున్నారు.
  • మదీనగూడ గంగారాం ప్రాంతం వద్ద 1.2 కి.మీ. పొడవైన ఫ్లైఓవర్‌ నిర్మాణానికి ఎన్‌హెచ్‌ అధికారులు ప్రణాళికలు చేశారు. ఇక్కడ డబుల్‌ డెక్‌ ఫ్లైఓవర్‌ కమ్‌ మెట్రో వయాడక్ట్‌ సంయుక్తంగా నిర్మించే సాధ్యాసాధ్యాలను అన్వేషించనున్నట్లు తెలిపారు.
  • బీహెచ్‌ఈఎల్‌ కూడలిలో నిర్మాణంలోని ఫ్లైఓవర్‌ ఎడమవైపు అలైన్‌మెంట్‌ ఖరారు చేశారు.

ఆరాంఘర్‌ వద్ద : ఎయిర్‌పోర్ట్‌ మెట్రో కారిడార్‌లో మైలార్‌దేవ్‌పల్లి నుంచి నూతన హైకోర్ట్‌ వరకు సుమారు 5 కి.మీ. మెట్రో పొడిగింపు ప్రతిపాదన ఉంది. ఆరాంఘర్‌ వద్ద పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వేకి ఎడమవైపు మెట్రో మార్గం వస్తుంది. వ్యవసాయ వర్సిటీ, ఫ్లైఓవర్‌ మధ్య అనువైన ప్రదేశంలో మెట్రో మార్గం కుడివైపు అలైన్‌మెంట్‌ మారుతుందని తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని