logo

కొలువొచ్చిన ఆనందం.. అంతలోనే విషాదం

ఆ యువతి అమ్మానాన్నలకు అండగా ఉండాలనుకుంది.. కష్టపడి డిగ్రీ పూర్తి చేసింది. కోరుకున్న కొలువు సంపాదించి.. తిరుపతి వెళ్లి వేంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకొని తిరిగి వచ్చింది.

Updated : 11 Jul 2024 05:16 IST

ఆర్టీసీ బస్సు ఢీకొని యువతి దుర్మరణం

ఆసిఫ్‌నగర్, న్యూస్‌టుడే: ఆ యువతి అమ్మానాన్నలకు అండగా ఉండాలనుకుంది.. కష్టపడి డిగ్రీ పూర్తి చేసింది. కోరుకున్న కొలువు సంపాదించి.. తిరుపతి వెళ్లి వేంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించుకొని తిరిగి వచ్చింది. కోరిన కల నెరవేరిందనే ఆనందాన్ని ఆస్వాదించకుండానే ఆర్టీసీ బస్సురూపంలో మృత్యువు వెంటాడింది. ఈ విషాదకర ఘటన హుమాయున్‌నగర్‌ ఠాణా పరిధిలోని ఆసిఫ్‌నగర్‌ ఆయిల్‌ మిల్లు రోడ్డులో మంగళవారం రాత్రి జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ సైదేశ్వర్, ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి బుధవారం తెలిపిన వివరాల ప్రకారం.. హిమాయత్‌నగర్‌ అడ్వకేట్‌కాలనీలోని మద్రికా అపార్ట్‌మెంట్‌లో శ్రీనివాస్, వాణి దంపతులు నివసిస్తున్నారు. వారి కుమార్తె డి.స్రవంతిరాణి(20) ఇటీవలే డిగ్రీ పూర్తి చేసింది. ఈ నెల మొదటి వారంలో జెన్‌ప్యాక్‌ కంపెనీలో కొలువు సంపాదించింది. తొలి ప్రయత్నంలోనే ఉద్యోగం రావటంతో రెండ్రోజుల క్రితం శ్రీవారి మొక్కులు చెల్లించుకునేందుకు తిరుమల వెళ్లింది. తిరిగి మంగళవారం నగరానికి వచ్చింది. అదే రోజు రాత్రి ఆసిఫ్‌నగర్‌లో ఉండే మిత్రుడికి లడ్డూ ప్రసాదం ఇచ్చేందుకు సిటీ బస్సులో వెళ్లింది. తిరిగి రాత్రి 10గంటల సమయంలో  ఇల్లు చేరేందుకు సిద్ధమైంది. స్నేహితుడి కుటుంబసభ్యులు ఒంటరిగా వెళ్లవద్దని వారించడంతో బైక్‌పై స్రవంతిరాణితో పాటు స్నేహితుడు బయలుదేరారు. మిత్రుడు వెనక కూర్చోగా.. యువతి నడుపుతోంది. ఆసిఫ్‌నగర్‌ ఆయిల్‌ మిల్లు సమీపంలోని ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంక్‌ వైపు నుంచి అతివేగంగా వచ్చిన ఆర్టీసీ సిటీబస్సు రాత్రి 10.22 సమయంలో బైక్‌ను ఢీ కొట్టింది. యువతి బస్సు కింద పడి తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే ఆమెను ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. బస్సు డ్రైవర్‌ మహ్మద్‌ అబ్దుల్‌ కరీంను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హుమాయున్‌నగర్‌ ఎస్పై శ్రీనివాస్‌రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. స్వల్పగాయాలతో బయటపడిన యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని