logo

అదే రూటు.. అయినా రైట్‌ రైట్‌

రాజధానిలో ఆర్టీసీ బస్సు తిరోగమనంలో ప్రయాణం చేస్తోంది. వేలాది మంది ప్రయాణించే రూట్లలో బస్సులు ఉండటం లేదు. పెద్దగా బస్సులు ఎక్కనిరూట్లలో మాత్రం ఒకదాని వెనుక మరొకటి పరుగులు తీస్తున్నాయి.

Published : 11 Jul 2024 05:17 IST

జనం అధికంగా వెళ్లే ప్రాంతాలకు వెళ్లని బస్సులు
రూట్‌ సర్వేలు చేయడానికి బస్సుల్లో తిరగని డీఎంలు, ఆర్‌ఎంలు

రాజధానిలో ఆర్టీసీ బస్సు తిరోగమనంలో ప్రయాణం చేస్తోంది. వేలాది మంది ప్రయాణించే రూట్లలో బస్సులు ఉండటం లేదు. పెద్దగా బస్సులు ఎక్కని రూట్లలో మాత్రం ఒకదాని వెనుక మరొకటి పరుగులు తీస్తున్నాయి. ప్రతి మూడేళ్లకు ఆర్టీసీ అధికారులు రూట్‌ సర్వే చేసి ప్రయాణికులకు సౌకర్యంగా ఉండే కొత్త మార్గాల్లో బస్సులను తిప్పాల్సి ఉంది. కానీ దశాబ్దాల కిత్రం ప్రారంభించిన రూట్లలోనే బస్సులను తిప్పుతున్నారు. నగరంలోని అత్యంత కీలక ప్రాంతాల వైపు సిటీబస్సులు వెళ్లకపోవడంతో సాధారణ ప్రజలకు క్యాబ్‌లు, బైకులు, ఆటోలే దిక్కవుతున్నాయి. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయి పరిస్థితులపై ‘ఈనాడు’ ప్రత్యేక కథనం.

బస్సెక్కని అధికారులు

ఏ రూట్‌లో కొత్తగా బస్సులు నడపాలి, ప్రస్తుతం నడుస్తున్న సర్వీసులను కొంతదూరమైనా రూటు మారిస్తే అధిక ఆదాయం వస్తుందా అనే సర్వేలు కూడా సరిగా జరగడం లేదనే విమర్శలను ఆర్టీసీ మూటగట్టుకుంటోంది. బస్సుల రూట్‌లపై ప్రతిపాదనలు తయారుచేసి నిర్ణయాలు తీసుకునే డిపో మేనేజర్లు(డీఎం), రీజినల్‌ మేనేజర్‌(ఆర్‌ఎం)లు నాలుగైదు రోజులకు ఒకసారైనా సాధారణ ప్రయాణికుల్లా సిటీ బస్సుల్లో ప్రయాణిస్తే వాస్తవ సమస్యలు తెలిసే అవకాశముంది. కానీ వారికి ఆర్టీసీ సంస్థ కార్లు కేటాయించడంతో సిటీ బస్సుల్లో ప్రయాణించడం అరుదుగా మారింది. వారికి క్షేత్రస్థాయి సమస్యలు సరిగా తెలియవని, తాము చెప్పినా కనీసం శ్రద్ధగా వినరని ఓ కండక్టర్‌ వ్యాఖ్యానించారు.

ఇదీ పరిస్థితి

  • మెట్రో స్టేషన్ల కింద అవకాశం ఉన్నా ఆర్టీసీ బస్సులను ఆపడం లేదు. ఉదాహరణకు కూకట్‌పల్లి, ఎర్రగడ్డ నుంచి కోఠి వచ్చే సిటీ బస్సులను ఆపడానికి అమీర్‌పేట మెట్రో స్టేషన్‌ కింద ప్రత్యేకంగా బస్‌ బే కూడా నిర్మించారు. అయినా నిలపడం లేదు.
  • ఇటు బీహెచ్‌ఈఎల్, కేపీహెచ్‌బీ, కూకట్‌పల్లి, అటు హయత్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి ఎన్టీఆర్‌ గార్డెన్స్, నెక్లెస్‌ రోడ్‌ రూట్లలో సిటీబస్సులు లేక ఆటోలను ఆశ్రయించాల్సి వస్తోంది. కనీనం ఆ రూట్‌లో వెళ్లడానికి అటు నాంపల్లి, ఇటు అమీర్‌పేట నుంచి లింకు బస్సులైనా లేకపోవడం గమనార్హం.
  • గతంలో కొన్ని పెద్ద కాలనీల నుంచి ప్రత్యేకంగా బస్సులను నడిపేవారు. అత్తాపూర్, ఎర్రమంజిల్‌లోని కొన్ని కాలనీల నుంచి తిప్పేవారు. కరోనా తరువాత ఈ బస్సులను తిప్పడం మానేయడంతో స్థానికులు ఇబ్బందులు పడుతున్నారు.
  • ఆరాంఘర్, అత్తాపూర్‌ వైపు నుంచి ప్రయాణికులు పంజాగుట్ట నిమ్స్‌ వైపు రావాలంటే ప్రత్యేకంగా బస్సులు లేవు. ఎల్బీనగర్‌లో బయలుదేరిన బస్సు ఆరాంఘర్‌ మీదుగా మెహిదీపట్నం రైతు బజారు దగ్గర ఆగిపోతుంది. అక్కడి నుంచి ఇటు పంజాగుట్ట వైపు వెళ్లాలంటే రైతు బజారు దగ్గర దిగి రెండు బస్సులు మారాల్సి వస్తోంది. మెహిదీపట్నం రైతు బజారు నుంచి కూకట్‌పల్లి, లింగంపల్లి, సికింద్రాబాద్‌ వంటి అనేక ప్రాంతాలకు వెళ్లే బస్సులన్నీ బంజారాహిల్స్, పంజాగుట్ట మీదుగానే పంపిస్తున్నారు. నేరుగా నిమ్స్‌ మీదుగా నడపడం లేదు.
  • హయత్‌నగర్, ఎల్‌బీ నగర్, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల నుంచి నిత్యం 156, 218 వంటి నంబర్లతో అనేక బస్సులు బోరబండ, కూకట్‌పల్లి, లింగంపల్లి, పటాన్‌చెరు ప్రాంతాలకు వెళ్తుంటాయి. ఈ రూటు సర్వీసులను ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం ప్రారంభించారు. ఈ మార్గంలో కొంతమేర మెట్రో రైలు కూడా వచ్చింది. అయినా బస్సు రూటును మార్చకపోవడం గమనార్హం.
  • హయత్‌నగర్, ఎల్‌బీ నగర్, దిల్‌సుఖ్‌నగర్‌ ప్రాంతాల నుంచి నిత్యం కోఠి ఉమెన్స్‌ కాలేజీ స్టాప్‌ వరకూ అనేక బస్సులు నడుస్తున్నాయి. చాదర్‌ఘాట్‌ నుంచి కోఠి ఉమెన్స్‌ కాలేజీ స్టాఫ్‌ వరకూ నిత్యం విపరీతమైన ట్రాఫిక్‌ ఉంటుంది. అదే రూటులో హయత్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్‌ల నుంచి బోరబండ, కూకట్‌పల్లి, లింగంపల్లి, పటాన్‌చెరు ప్రాంతాలకు వెళ్లే లాంగ్‌రూట్‌ 156, 218 వంటి నంబర్ల బస్సులను కూడా తిప్పుతున్నారు. ఈ రూటు సర్వీసులను ఎప్పుడో కొన్ని దశాబ్దాల క్రితం ప్రారంభించారు. వీటిని చాదర్‌ఘాట్‌ వంతెన నుంచి గౌలిగూడ సాయిబాబా గుడి మీదుగా కోఠి మీదుగా మళ్లిస్తే ప్రయోజనం ఉంటుంది.
  • మెహిదీపట్నం నుంచి పెద్దసంఖ్యలో సిటీబస్సులు సికింద్రాబాద్‌ వైపు వెళుతున్నా వాటిని లక్డీకాపూల్‌ బస్టాపులో అపడం లేదు. వాటిని నేరుగా టెలిఫోన్‌ భవన్‌ వద్ద నిలుపుతున్నారు. దీంతో అమీర్‌పేట నుంచి లక్డీకాపూల్‌ వరకు వచ్చిన బస్సుల్లో దిగిన ప్రయాణికులు సెక్రటెరియేట్, రాణిగంజ్, సికింద్రాబాద్‌ వైపు వెళ్లడానికి మెహిదీపట్నం నుంచి వచ్చే బస్సులను ఎక్కడానికి వీల్లేకుండా పోతోంది.
  • ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌లో దిగేవారు పంజాగుట్ట వైపు వెళ్లే బస్సు ఎక్కాలంటే ఖైరతాబాద్‌ బస్టాప్‌ వరకూ నడవాల్సి వస్తోంది. ఖైరతాబాద్‌ మెట్రో స్టేషన్‌ కింద ఆపే అవకాశం ఉన్నా ఆపడం లేదు.

ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని