logo

Hyderabad Metro: 105% పెరిగిన హైదరాబాద్‌ మెట్రో ఆదాయం

మెట్రోని నిర్వహిస్తున్న ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో అమాంతం పెరిగింది.

Updated : 25 Jun 2024 07:23 IST

ఈనాడు, హైదరాబాద్‌: మెట్రోని నిర్వహిస్తున్న ఎల్‌ అండ్‌ టీ హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో అమాంతం పెరిగింది. ఏకంగా 105 శాతం పెరిగినట్లు ఆర్థిక నివేదికలో వెల్లడించింది. 2022-23లో రూ.703.20 కోట్ల ఆదాయం రాగా.. 2023-24లో రూ.1407.81 కోట్లకు పెరిగినట్లు నివేదికలో పేర్కొంది. ఫలితంగా నష్టాలు గతేడాది భారీగా తగ్గాయి. 2022-23లో రూ.1315.99 కోట్ల నష్టాన్ని చూపించిన ఆ సంస్థ... గతేడాది రూ.555.04 కోట్లకు తగ్గినట్లు నివేదికలో వెల్లడించింది. మెట్రో ప్రారంభం నుంచి ఇప్పటివరకు నష్టాలు రూ.5979.36 కోట్లకు చేరాయని పేర్కొంది.

  • గత ఆర్థిక సంవత్సరంలో ప్రయాణికుల టిక్కెట్ల ద్వారా రూ.611.48 కోట్ల ఆదాయం వచ్చింది.
  • టీవోడీ ద్వారా రూ.796.33 కోట్లు వచ్చినట్లు నివేదికలో చూపారు. ఇందులో అద్దెల ద్వారా రూ.110.42 కోట్లు, ప్రకటనల ద్వారా రూ.81.06 కోట్లు, ఇతరత్రా రూ.82.77 కోట్లు వచ్చాయి. ఎల్‌ అండ్‌ టీ మెట్రోకి ప్రభుత్వం లీజుపై ఇచ్చిన రాయదుర్గంలోని భూమిని స్లంప్‌సేల్‌ రూపంలో రహేజా గ్రూప్, బ్రూక్‌ఫీల్డ్‌ కార్పొరేషన్‌కు బదిలీ చేయడం ద్వారా మొదటి విడతగా రూ.511.73 కోట్లు అందింది. దీంతో ఆదాయం పెరిగినట్లయింది.

రూ.5979.36 కోట్లకు చేరిన నష్టాలు

మెట్రోరైళ్లు నగరంలో ఆరేళ్లుగా నడుస్తున్నాయి. కొవిడ్‌ సమయంలో మెట్రో భారీగా నష్టాలను మూటకట్టుకుంది. 2022 మార్చి 31 నాటికి నష్టాలు రూ.4108.37 కోట్లు ఉండగా.. 2023 మార్చి 31 నాటికి రూ.5424.37 కోట్లకు పెరిగాయి. ఈ ఏడాది మార్చి 31 నాటికి నష్టాలు రూ.5979.36 కోట్లకు చేరినట్లుగా ఆర్థిక నివేదికలో ఎల్‌ అండ్‌ టీ మెట్రో వెల్లడించింది.

తగ్గని ఆదరణ

ఎండల ప్రభావం ఒక్కటేకాదు..సమయం కలిసి వస్తుందనుకునే వారి సంఖ్య పెరగడంతో మెట్రోకు ఆదరణ తగ్గడం లేదు. సోమవారం ఉదయం రోజువారీ కంటే ముందే సేవలు ప్రారంభిస్తున్నారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు సేవలను పొడిగించారు. గడిచిన రెండు నెలల్లో ప్రయాణికుల గణాంకాలను పరిశీలిస్తే... ఏప్రిల్‌లో 1,23,95,205 మంది మెట్రోలో వెళ్లారు. రోజువారీగా సగటున 4.13 లక్షల మంది ప్రయాణించారు. మే నెలలో 1,31,05,805 మంది రాకపోకలు సాగించారు. రోజువారీ సగటు 4.22 లక్షలుగా ఉంది.

రద్దీకి తగినట్టు లేక...: ప్రయాణికుల సంఖ్య 6 లక్షల మందికి పెరగాల్సి ఉందని మెట్రో వర్గాలు అంటుంటే...ఉదయం, సాయంత్రం కార్యాలయాల వేళల్లో విపరీతంగా రద్దీ ఉంటోందని దానికి సరిపడా మెట్రోలు లేవని ప్రయాణికులు పేర్కొంటున్నారు.

మరి ఖర్చుల మాటేమిటి?

  • మెట్రోరైలు ఆపరేషన్స్‌కు రూ.400.06 కోట్లు, ఉద్యోగుల వేతన ప్రయోజనాలు రూ.35.85 కోట్లు, పరిపాలన, ఇతర ఖర్చులు రూ.36.03 కోట్లు అయ్యింది.
  • మెట్రో నిర్మాణం కోసం బ్యాంకుల నుంచి తీసుకున్న అప్పులపై చెల్లించిన వడ్డీ గతేడాది రూ.1173.11 కోట్లుగా ఉంది. అంతక్రితం ఏడాదితో పోలిస్తే వడ్డీ భారం స్వల్పంగా తగ్గింది. 2022-23లో వార్షిక వడ్డీ భారమే రూ.1273.36 కోట్లుగా ఉంది. 
  • రూ.309.30 కోట్లను ఆస్తుల తరుగుదల చూపారు. 
  • మొత్తంగా వ్యయం రూ.1962.85 కోట్లుగా చూపారు. ఆదాయం 1407.81 పోగా.. రూ.555.04 కోట్ల నష్టాలను 2023-24 ఆర్థిక సంవత్సరంలో చూపారు.

మెట్రో మార్గాలు  :  3
రోజు నడిచే రైళ్లు  :  57
మెట్రో మార్గం(కి.మీ.)  :  69.2
ప్రతిరోజు మెట్రో ట్రిప్పులు  :  1000
నిత్యం తిరిగే దూరం(కి.మీ.) :  25000
సగటున ఒక్కో ప్రయాణికుడు ప్రయాణిస్తున్న దూరం(కి.మీ.)  :  12.5   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని