logo

Hyderabad: మత్తు గుప్పిట అమ్మాయిలు!.. డ్రగ్స్‌ స్మగ్లర్ల చేతిలో కీలుబొమ్మలు

మిత్రుల ప్రభావం.. ఒత్తిడి నుంచి బయటపడేందుకు మత్తుకు అలవాటైన అమ్మాయిలను స్మగ్లర్లు పావులుగా వాడుకుంటున్నారు. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకొని సరకును సురక్షితంగా గమ్యానికి చేరవేసేందుకు ఏజెంట్లుగా మలచుకుంటున్నారు.

Updated : 19 Jun 2024 09:07 IST

పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి సంచలన విషయాలు

  •  నెల్లూరు జిల్లా యువతి.. ఇంజినీరింగ్‌ పూర్తయ్యాక ఐటీ కొలువు రావడంతో నగరం చేరింది. మిత్రుల ప్రభావంతో నెమ్మదిగా మాదకద్రవ్యాలకు అలవాటైంది. వారానికోసారి ఆ కిక్కు లేకుండా ఉండలేని స్థితికి చేరింది. కొద్దిరోజుల క్రితం దూల్‌పేట్‌లో గంజాయి కొనేందుకు వెళ్లి ఎక్సైజ్‌ పోలీసులకు పట్టుబడింది. గట్టిగా ప్రశ్నిస్తే స్నేహితుల కోసం సరకు తీసుకెళ్లేందుకు వచ్చానంటూ అసలు విషయం చెప్పింది. ఆమె తల్లిదండ్రులకు ఫోన్‌ చేసి చెబితే.. తమ కూతురు అమాయకురాలంటూ వాదించారు. చివరకు వైద్య పరీక్షలో రుజువు కావడంతో విలవిలలాడారు.
  •  ముషీరాబాద్‌కు చెందిన మహిళ.. ఒత్తిడి నుంచి బయటపడేందుకు నిద్రమాత్రలు తీసుకునేది. మరింత కిక్కు  కోసం ఇన్‌స్టాగ్రాములో పరిచయమైన స్నేహితుడి సూచనతో ఎల్‌ఎస్‌డీబ్లాట్స్‌కు దగ్గరైంది. క్రమంగా ఇద్దరూ కలసి గోవా, ముంబయి, బెంగళూరు వెళ్లి.. రావడం ప్రారంభించారు. ఆమె అలవాటును అవకాశంగా తీసుకున్న అతడు.. డ్రగ్స్‌ సరఫరాకు అనువుగా మలచుకున్నాడు. నగరంలో 50 మందికిపైగా ఇతడి వద్ద డ్రగ్స్‌ కొనుగోలు చేస్తున్నట్లు గుర్తించిన టీజీన్యాబ్‌ పోలీసులు నిఘా ఉంచి వారిద్దరిని అరెస్టు చేశారు.

ఈనాడు, హైదరాబాద్‌: మిత్రుల ప్రభావం.. ఒత్తిడి నుంచి బయటపడేందుకు మత్తుకు అలవాటైన అమ్మాయిలను స్మగ్లర్లు పావులుగా వాడుకుంటున్నారు. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకొని సరకును సురక్షితంగా గమ్యానికి చేరవేసేందుకు ఏజెంట్లుగా మలచుకుంటున్నారు. విలాసవంతమైన జీవితం, ఉచితంగా మత్తును ఆస్వాదించవచ్చని ఆశ చూపి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. గచ్చిబౌలి ప్రాంతానికి చెందిన ఓ మహిళ భర్త దుబాయ్‌లో ఉండేవాడు. ఒంటరిగా ఉన్న ఆమె పబ్‌లకు వెళ్లినపుడు డ్రగ్స్‌కు అలవాటైంది. అక్కడ పరిచయమైన యువకుడి ప్రోత్సాహంతో డ్రగ్స్‌ చేరవేస్తూ టీజీన్యాబ్‌కు పట్టుబడింది. కౌన్సెలింగ్‌ ద్వారా ఆమెను మార్చేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఇటీవల ఆమెకు చేసిన వైద్యపరీక్షల్లో నెగిటివ్‌ వచ్చినట్లు సమాచారం. నార్సింగి ప్రాంతంలోని మ్యూజిక్‌ టీచర్‌ డ్రగ్స్‌ తీసుకునేది. ఆమె స్నేహితుడు దీన్ని ఆసరా చేసుకొని ఏజెంట్‌గా మార్చాడు. పోలీసుల గణాంకాల ప్రకారం నగరంలో గంజాయి, కొకైన్, హెరాయిన్, ఎల్‌ఎస్‌డీ బ్లాట్స్‌ వాడుతున్న ప్రతి 100 మందిలో 40 మంది మహిళలు ఉన్నట్లు గుర్తించారు. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, కుటుంబీలకు దూరంగా ఉంటున్న మహిళలే అధికంగా మత్తు ముఠాల బారినపడుతున్నట్లు దర్యాప్తులో నిర్ధారించారు.

తనిఖీలకు చిక్కకుండా..

విద్యాలయాలు, పని చేసే సంస్థలు, విందు, వినోదాలు, సామాజిక మాధ్యమాల ద్వారా మత్తు పదార్థాలు చేతులు మారుతున్నాయి. నైజీరియన్‌ ముఠాలు, అంతర్రాష్ట్ర స్మగ్లర్లపై పోలీసుల నిఘా ఉండడంతో దాన్నుంచి తప్పించుకునేందుకు అప్పటికే మాదకద్రవ్యాలకు అలవాటుపడిన అమ్మాయిలను రంగంలోకి దించుతున్నారు. ఉచితంగా డ్రగ్స్, ఖర్చులకు డబ్బు సమకూరడంతో ఉద్యోగం చేస్తున్న కొందరు మహిళలు తప్పటడుగు వేస్తున్నారని ఓ పోలీసు అధికారి ఆవేదన వెలిబుచ్చారు. మిత్రులతో కలసి సరదాగా గడిపేందుకు గోవా, ముంబయి, బెంగళూరు వెళ్తున్నారు. అక్కడ నైజీరియన్లు, స్థానిక ముఠాల నుంచి డ్రగ్స్‌ కొనుగోలు చేస్తున్నారు. వాటిని మహిళల చేతిసంచులు, లోదుస్తుల్లో ఉంచి.. ప్రైవేటు వాహనాలు, బస్సుల్లో ప్రయాణిస్తూ తనిఖీల  నుంచి తప్పించుకుంటున్నారు. నగరం చేరాక మహిళలతో కొనుగోలుదారులకు సరకు చేరవేస్తున్నారు. ఇటీవల పోలీసులకు పట్టుబడిన మహిళలను పోలీసులు ప్రశ్నించినపుడు సంచలన విషయాలు వెలుగుచూశాయి. మైకంలో ఉన్నపుడు నగ్నంగా మార్చి తీసిన వీడియోలు, ఫొటోలు చూపి భయపెడుతూ మాదకద్రవ్యాల సరఫరాకు వినియోగించుకుంటున్నట్లు ఓ యువతి ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. జిమ్‌లో పరిచయమైన కోచ్‌ ప్రొటీన్‌ పౌడర్‌ అంటూ తనకు ఎండీఎంఏ అలవాటు చేశాడని వాపోయినట్లు తెలిసింది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని