logo

Passport: స్వీయ తప్పిదాలతోనే పాస్‌పోర్టు జారీలో ఆలస్యం

ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం పరిధిలో 5  సేవా కేంద్రాలు, 14 పోస్టాఫీసు పాస్‌పోర్టు సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి. రోజూ 4,000 పాస్‌పోర్టులు మంజూరు చేస్తున్నారు.

Updated : 16 Jun 2024 08:22 IST

ప్రతి వారం ఆర్పీవో కార్యాలయానికి 500 అభ్యర్థనలు

సికింద్రాబాద్‌లోని పాస్‌పోర్టు కార్యాలయం ఎదుట దరఖాస్తుదారుల క్యూ 

ఈనాడు, హైదరాబాద్‌: ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం పరిధిలో 5  సేవా కేంద్రాలు, 14 పోస్టాఫీసు పాస్‌పోర్టు సేవా కేంద్రాలు పనిచేస్తున్నాయి. రోజూ 4,000 పాస్‌పోర్టులు మంజూరు చేస్తున్నారు. ధ్రువపత్రాల సరిగా లేకపోవడంతో 5 నుంచి 10 శాతం దరఖాస్తులు తిరస్కరణకు గురవుతున్నాయి. అపాయింట్‌మెంట్‌ లభించిన తర్వాత దరఖాస్తుదారులు ఏఆర్‌ఎన్‌ (అప్లికేషన్‌ రిఫరెన్స్‌ నంబరు) ప్రతిలో ఇచ్చిన సూచనలు చదవక పోవడమే ఇందుకు కారణమని అధికారులు చెబుతున్నారు. పాస్‌పోర్టు ప్రక్రియలో స్లాట్‌ దొరికేందుకు సుమారు 22 రోజుల సమయం పడుతోంది. ఈ క్రమంలో దరఖాస్తుదారుల స్వీయ తప్పిదాలతో మరింత జాప్యమవుతోంది.

ధ్రువపత్రాల సమర్పణలో..

సరైన ధ్రువ పత్రాలు సమర్పించకపోవడం, రీషెడ్యూల్‌లో సమస్యలంటూ ప్రతి వారం 500 నుంచి 600 అభ్యర్థనలు వస్తున్నాయి. జిరాక్స్‌ కాపీలపై సెల్ఫ్‌ అటెస్టేషన్‌ లేకపోవడం, రీషెడ్యూల్‌ ఎంపికకు కేవలం మూడుసార్లు అవకాశం ఉండగా అంతకు మించి వినియోగించుకోవడం, పదో తరగతి మార్కుల జాబితా లేకపోతే బదులుగా బోనఫైడ్‌ తీసుకురాకపోవడం, సర్టిఫికెట్లలోని పేర్లలో మార్పులు   వంటి కారణాలతో జారీలో జాప్యమవుతోంది. పోస్టాఫీసు పాస్‌పోర్టు సేవా కేంద్రాల్లో అపాయింట్‌మెంట్‌ ప్రక్రియ సాగుతుండగా, తిరస్కరణకు గురైన వారు నేరుగా ప్రతి గురువారం సికింద్రాబాద్‌ ఆర్పీవో కార్యాలయానికి వచ్చి తమ దరఖాస్తు పరిశీలించి పాస్‌పోర్టు మంజూరు చేయాలని కోరుతున్నారు. ఆన్‌లైన్‌ ఎంక్వైరీ అపాయింట్‌మెంట్‌పై చాలా మందికి అవగాహన ఉండటం లేదు.

చిరునామా ధ్రువీకరణ పత్రాలివే..

నల్లా, టెలిఫోన్, విద్యుత్తు బిల్లులు, ఇన్‌కంటాక్స్‌ అసెసెమెంట్‌ ఆర్డర్, ఓటరు  కార్డు, గ్యాస్‌ కనెక్షన్‌ బిల్లు, పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీల్లో పనిచేసే వారైతే సంస్థ సీల్‌ ఉన్న లెటర్‌హెడ్‌ను చిరునామా రుజువు సమర్పించొచ్చు. కుటుంబ వివరాలున్న భాగస్వామి పాస్‌పోర్టు కాపీ, మైనర్లు అయితే తల్లిదండ్రుల పాస్‌పోర్టు కాపీ, ఆధార్‌ కార్డు, రెంట్‌ అగ్రిమెంట్,  బ్యాంకు పాస్‌ బుక్‌.. వీటిలో ఏవైనా పనికొస్తాయి.

ఆన్‌లైన్‌లో ఎంక్వైరీ అపాయింట్‌మెంట్లు

ఆర్పీవో కార్యాలయం సోమ, మంగళ, శుక్ర వారాల్లో 250 చొప్పున ఆన్‌లైన్‌ ఎంక్వైరీ అపాయింట్‌మెంట్లు జారీ చేస్తోంది. సంబంధిత పీఎస్‌కేల్లో అపాయింట్‌మెంట్‌ రీషెడ్యూల్‌ ఇవ్వకపోతేనే, ఈ అపాయింట్‌మెంట్‌ తీసుకోవాలి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు