logo

Hyderabad: హైదరాబాద్‌లో.. బాబోయ్‌ ఇదేం ట్రాఫిక్‌!

రోడ్డెక్కితే గమ్యం చేరేందుకు వాహనదారులు నరకం చవిచూస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ట్రాఫిక్‌ సమస్యతో విసుగెత్తి పోతున్నారు. అర కిలోమీటరు దూరానికి అరగంట వెచ్చించాల్సి వస్తోంది.

Updated : 23 Jun 2024 08:14 IST

గ్రేటర్‌లో వాహనదారులకు చుక్కలు
ఫొటోలు, చలానాలకే పోలీసులు పరిమితం

ఉప్పల్‌-నారపల్లి ఎలివేటెడ్‌ కారిడార్‌లో రద్దీ

ఈనాడు, హైదరాబాద్‌: రోడ్డెక్కితే గమ్యం చేరేందుకు వాహనదారులు నరకం చవిచూస్తున్నారు. పగలు, రాత్రి అనే తేడా లేకుండా ట్రాఫిక్‌ సమస్యతో విసుగెత్తి పోతున్నారు. అర కిలోమీటరు దూరానికి అరగంట వెచ్చించాల్సి వస్తోంది. కీలకమైన సమయంలో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాల్సిన పోలీసులు కనిపించడం లేదు. పర్యవేక్షించాల్సిన అధికారులు అటు వైపు కన్నెత్తి చూడటం లేదు. ఎన్నికల కోడ్‌లో భాగంగా ట్రాఫిక్‌ అదనపు సీపీ విశ్వప్రసాద్‌ను బదిలీ చేశారు. ఇన్‌ఛార్జిపై అదనపు బాధ్యతలు పడటంతో పర్యవేక్షణ భారంగా మారింది. మూడు నెలలుగా కీలకమైన అధికారి పోస్టు ఖాళీగా ఉంది. మారుతున్న అవసరాలకు తగినట్టుగా ట్రాఫిక్‌ పోలీసు సిబ్బందిని పెంచక పోవటంతో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణ సమస్యగా మారింది.

25 లక్షల వాహనాలు..: 

గ్రేటర్‌లో నిత్యం 25 లక్షల వాహనాలు రోడ్లమీదకు వస్తుంటాయని అంచనా. గతంతో పోల్చితే ఈ సంఖ్య 20 శాతం పెరిగినట్టు ట్రాఫిక్‌ పోలీసులు చెబుతున్నారు. ఇటీవల ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి రాకపోకలు పెరగటంతో, వాహనాల సంఖ్య రెట్టింపునకు చేరింది. ప్రముఖుల పర్యటనలు, ప్రొటోకాల్‌ అమలుతో తరచూ ట్రాఫిక్‌ను నిలిపివేయాల్సి వస్తోంది. విద్యా సంవత్సరంమొదలవడంతో  పాఠశాలల బస్సులు, ప్రైవేటు వాహనాలు, ఆటోలు మళ్లీ రోడ్డెక్కాయి. ఇతర ప్రాంతాల నుంచి నగరంలోకి ప్రవేశించే ప్రైవేటు బస్సులు, లారీలు, భారీ వాహనాలు యథేచ్ఛగా నిబంధనలు ఉల్లంఘిస్తున్నాయి. గతంలో నిబంధనలు పాటించని వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకునేవారు. ప్రస్తుతం చలానాలకే పరిమితం కావటంతో ప్రైవేటు వాహనదారులు తేలికగా తీసుకుంటున్నారు. ఈ ఏడాది 5 నెలల వ్యవధిలోనే మూడు పోలీసు కమిషనరేట్ల పరిధిలో నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 40 లక్షల కేసులు నమోదయ్యాయి.

మొరాయిస్తున్న  బండ్లు..

నగరం, శివారు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యకు ప్రధాన కారణం రోడ్లకు ఇరువైపులా వాహనాలు నిలపటం. కీలకమైన ఎల్బీనగర్, నాగోల్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, తార్నాక, అబిడ్స్, నారాయణగూడ,చాదర్‌ఘాట్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, మాదాపూర్, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మియాపూర్‌ మార్గాల్లో.. వేలాది వాహనాలు రోడ్లకు ఇరువైపులా నిలిపి ఉంటున్నాయి. 3 కమిషనరేట్ల పరిధిలో రోజూ సగటున 20వాహనాలు ఇంధనంలేక, మరమ్మతులకు గురై  మొరాయిస్తున్నాయి. రద్దీ ప్రాంతాలు, పై వంతెనలపై వీటిని తొలగించేందుకు ట్రాఫిక్‌ పోలీసులు 1-2 గంటలు వెచ్చించాల్సి వస్తోంది. చీకటి పడితే చాలు ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు ప్రయాణికులను తీసుకెళ్లే ప్రైవేటు బస్సులు మియాపూర్, కేపీహెచ్‌బీ, ఎస్సార్‌నగర్, అమీర్‌పేట, లక్డీకాపూల్, అబిడ్స్, కాచిగూడ, మెహిదీపట్నం, అత్తాపూర్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్బీనగర్, వనస్థలిపురం, ఉప్పల్‌ ప్రాంతాల్లో  గంటల తరబడి నిలపటంతో ట్రాఫిక్‌ సమస్యలు తప్పడం లేదు. రాత్రి 7 నుంచి అర్ధరాత్రి వరకూ తోపుడుబండ్లు, ద్విచక్ర వాహనాలు రోడ్లపైనే నిలుపుతున్నారు.   

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని