logo

పాతబస్తీ విధులంటే సుస్తీ!

పాతబస్తీలో విధులు నిర్వహించడం ప్రభుత్వ అధికారులకు కత్తిమీద సాములా మారింది. వామ్మో! అక్కడ మాకు పోస్టింగ్‌ వద్దని పోలీసులు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కొందరు ద్వితీయ శ్రేణి నేతలు పోలీసులు

Updated : 08 Apr 2022 03:33 IST

కొందరు కార్పొరేటర్ల తీరుతో వణికిపోతున్న అధికారులు
ఈనాడు-సిటీ బ్యూరో ప్రధాన ప్రతినిధి; న్యూస్‌టుడే, కేశవగిరి

గత ఎన్నికల సమయంలో పాతబస్తీలో పోలీసు వాహనంపై దాడికి

పాల్పడుతున్న ఓ పార్టీ నాయకులు, కార్యకర్తలు

పాతబస్తీలో విధులు నిర్వహించడం ప్రభుత్వ అధికారులకు కత్తిమీద సాములా మారింది. వామ్మో! అక్కడ మాకు పోస్టింగ్‌ వద్దని పోలీసులు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కొందరు ద్వితీయ శ్రేణి నేతలు పోలీసులు, జలమండలి, విద్యుత్తు తదితర శాఖల అధికారులను తరచూ బెదిరిస్తుండడం, దాడులకు తెగబడడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడింది. వీటిపై కేసులు నమోదు కాకపోవడమూ అధికారుల్లో అభద్రత భావాన్ని పెంచుతోంది.

కొందరు కార్పొరేటర్లు చట్టాన్ని చుట్టంలా భావించడం వల్లే పాతబస్తీలో అనేక సమస్యలు తలెత్తుతున్నాయి. తమ కనుసన్నల్లోనే అన్నీ జరగాలని వారు కోరుకుంటున్నారు. అలా జరగకపోతే అసలు సహించడం లేదు. అవసరమైతే జనం మధ్యే అధికారులను పరుష పదాలతో దుర్భాషలాడి దాడులకు తెగబడుతున్నారు. గత రెండు మూడేళ్లలో ఇటువంటి సంఘటనలు అనేకం జరిగాయి. తమ అధినేతలకు సర్కార్‌ పెద్దలతో సన్నిహిత సంబంధాలున్నాయని అందుచేత తాము ఏం చేసినా చెల్లుబాటవుతుందన్న ధీమాలో వీరుండడమే ఈ పరిస్థితికి ఒక కారణం. రెండు రోజుల కిందట అర్ధరాత్రి దాటినా తెరిచి ఉన్న దుకాణాలను మూయించడానికి వెళ్లిన పోలీసులను భోలక్‌పూర్‌ కార్పొరేటర్‌ గౌసుద్దీన్‌ తాహా తిట్లపురాణంతో అడ్డుకోవడం విదితమే. దీనిపై మంత్రి కేటీఆర్‌ సీరియస్‌గా స్పందించిన తరువాతే కేసు నమోదు చేసి ఆయన్ను అరెస్టు చేశారు. 

ఇవీ ఘటనలు

* గత నెలలో సర్దార్‌ మహల్‌ సమీపంలో బకాయి చెల్లించలేదంటూ కనెక్షన్‌ తీసేయడానికి వచ్చిన విద్యుత్తు అధికారులపై ఓ కార్పొరేటర్‌ విరుచుకుపడ్డారు. ఈ అధికారం నీకు ఎవడిచ్చాడంటూ బూతులు తిట్టారు. మళ్లీ ఇటువైపు రావద్దంటూ హుకుం జారీ చేశారు.

* ఓ ప్రార్థనాలయం సమీపంలో చారిత్రక కట్టడం వద్ద తవ్వకాలు జరుపుతున్న పురావస్తుశాఖ అధికారులపై ఓ కార్పొరేటర్‌ తనదైన శైలిలో దూషణకు దిగారు. నానా హంగామా చేశారు.

* గతంలో మీరాలంమండిలోని విద్యుత్‌ కార్యాలయంలోకి చొరబడిన ఓ మాజీ కార్పొరేటర్‌ అధికారులు, సిబ్బందిని పరుష పదజాలంతో  తిడుతూ చివరకు ఓ అధికారిపై దాడికి పాల్పడ్డారు. ఇవి వెలుగులోకి వచ్చిన కొన్ని ఘటనలు మాత్రమే. బయటకు రాని ఇలాంటి ఘటనలు మరెన్నో.

జనం మెప్పు పొందేందుకు..

కొందరు కార్పొరేటర్లు, నాయకులు తరచూ జనాన్ని పోగుచేసి అధికారులపై బూతుల వర్షం కురిపిస్తూ పరువు తీయడం పరిపాటిగా మారింది. ఈ సందర్భంగా తీయించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ చేస్తూ ‘అధికారులపై తిరగబడ్డ లీడర్‌’ అంటూ పెడుతున్నారు. వాటికొచ్చే ప్రశంసలు చూసి మరికొందరు కార్పొరేటర్లు, నాయకులు అదేబాట పడుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని