logo

నిమిషాల్లో ఓఆర్‌ఆర్‌పైకి!

ఐటీ నగరంలో ట్రాఫిక్‌ కష్టాలను తొలగించే వంతెనల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. పెరగనున్న ఉద్యోగులు, వాహన రద్దీని దృష్టిలో ఉంచుకుని జీహెచ్‌ఎంసీ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్సార్డీపీ) కింద మరిన్ని పైవంతెనలు,

Published : 06 May 2022 06:13 IST

ఐటీ నగరిలో వేగంగా పైవంతెనల నిర్మాణం


శిల్పా లేఅవుట్‌ పైవంతెన

ఈనాడు, హైదరాబాద్‌: ఐటీ నగరంలో ట్రాఫిక్‌ కష్టాలను తొలగించే వంతెనల నిర్మాణాలు వేగంగా సాగుతున్నాయి. పెరగనున్న ఉద్యోగులు, వాహన రద్దీని దృష్టిలో ఉంచుకుని జీహెచ్‌ఎంసీ వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్సార్డీపీ) కింద మరిన్ని పైవంతెనలు, అండర్‌పాస్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది.  ఐకియాకు పక్కగా డెలాయిట్‌ సంస్థ వెనుక వైపునున్న రోడ్డును 120 అడుగుల మేర విస్తరించి ఎత్తైన భవనాల మధ్య నుంచి గచ్చిబౌలి ఓఆర్‌ఆర్‌ పైకి పైవంతెన నిర్మాణమవుతోంది. పనులు 90 శాతం పూర్తయ్యాయి. ‘వై’ ఆకారంలో రూపుదిద్దుకుంటున్న ఈ నిర్మాణం.. గచ్చిబౌలి పైవంతెన మీదుగా వెళ్లి ఓఆర్‌ఆర్‌కు రెండువైపులా నేలకు తాకుతుంది. మైండ్‌స్పేస్‌ కూడలి, హైదరాబాద్‌ నాలెడ్జ్‌ సిటీలోని ఐటీ సంస్థలు, నివాస సముదాయాల నుంచి 5 నిమిషాల్లో ఓఆర్‌ఆర్‌ను చేరుకునేలా ఈ నిర్మాణం ఉపయోగపడుతుంది. ఆగస్టు 15కు నిర్మాణాన్ని పూర్తి చేయాలన్నది లక్ష్యం.

ఓఆర్‌ఆర్‌ నుంచి బొటానికల్‌ గార్డెన్‌ వైపు.. శిల్పా లేఅవుట్‌ పైవంతెనతోపాటు ఓఆర్‌ఆర్‌ నుంచి బొటానికల్‌ గార్డెన్‌ వైపు మరో పైవంతెన నిర్మాణమవుతోంది. ఆరు లైన్ల వెడల్పుతో నిర్మాణమయ్యే ఈ పైవంతెనపై రెండు వైపులా రాకపోకలుంటాయి. ఓఆర్‌ఆర్‌ నుంచి బొటానికల్‌ గార్డెన్‌, కొండాపూర్‌, మియాపూర్‌ మధ్య రాకపోకలు సాగించే వారికి ఈ నిర్మాణం ఉపయోగపడుతుంది.   పనులు పూర్తయ్యేందుకు రెండేళ్లు పడుతుందని అంచనా.

కొత్తగూడ కూడలిపై.. గచ్చిబౌలి నుంచి కొండాపూర్‌, మియాపూర్‌ వెళ్లే వాహనాల కోసం జీహెచ్‌ఎంసీ కొత్తగూడ కూడలి వద్ద పైవంతెనను నిర్మిస్తోంది. ఇది ఎస్‌ఎల్‌ఎన్‌ టెర్మినల్స్‌ వద్ద, బొటానికల్‌ గార్డెన్‌ కూడలికి ముందు మొదలై కొత్తగూడ కూడలి మీదుగా కొండాపూర్‌ ఆర్‌టీఏ కార్యాలయం వరకు సాగుతుంది. బొటానికల్‌ గార్డెన్‌ రోడ్డు మీదుగా వచ్చి కొండాపూర్‌, మియాపూర్‌ వెళ్లే వాహనాలూ ఈ వంతెనను ఉపయోగించుకునేలా అప్‌ ర్యాంపు నిర్మిస్తున్నారు. పనులు దాదాపు తుది దశకు వచ్చాయి. ఈ వంతెన ఎక్కిన వాహనాలు శిల్పారామం రోడ్డుపైకి కూడా దిగొచ్చు. అందుకోసం కొత్తగూడ కూడలిలో డౌన్‌ ర్యాంపు నిర్మాణమవుతోంది. ఇక మియాపూర్‌, కొండాపూర్‌ నుంచి గచ్చిబౌలి, ఓఆర్‌ఆర్‌ వెళ్లే వాహనాల కోసం కొత్తగూడ కూడలిలో అండర్‌పాస్‌ నిర్మాణమైంది. మొత్తం ప్రాజెక్టు మరో 2 నెలల్లో పూర్తవనుందని ఇంజినీర్లు చెబుతున్నారు.

నెలలో కైత్లాపూర్‌ ఆర్వోబీ.. కూకట్‌పల్లి, బోయినపల్లి, మూసాపేట ప్రాంతాల నుంచి హైటెక్‌ సిటీ మధ్య రాకపోకలు సాగించే వారికి ట్రాఫిక్‌ కష్టాలు తొలగించే కైత్లాపూర్‌ ఆర్వోబీ నిర్మాణ పనులు వచ్చే నెలలో పూర్తికానున్నట్లు ఇంజినీర్లు తెలిపారు.

నిర్మాణాల వ్యయం

బొటానికల్‌ గార్డెన్‌-కొత్తగూడ కూడలిపై నిర్మించే పైవంతెన: రూ.263 కోట్లు

శిల్పాలేఅవుట్‌ పైవంతెన: 225.50 కోట్లు

ఓఆర్‌ఆర్‌-బొటానికల్‌ గార్డెన్‌ రోడ్డు పైవంతెన: రూ.209.5 కోట్లు

కైత్లాపూర్‌ ఆర్వోబీ: రూ.83.06 కోట్లు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని