logo

కొండగట్టుకు ఉత్సవ శోభ

రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు(12 నుంచి 14 వరకు) హనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు.

Published : 12 May 2023 05:46 IST

నేటి నుంచి హనుమాన్‌  పెద్ద జయంతి ఉత్సవాలు  

విద్యుత్తు వెలుగుల్లో ఆలయం

మల్యాల, న్యూస్‌టుడే: రాష్ట్రంలోనే ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో శుక్రవారం నుంచి ఆదివారం వరకు(12 నుంచి 14 వరకు) హనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉత్సవాల ప్రారంభంలో భాగంగా గురువారం సాయంత్రం యాగశాలలో అంకురార్పణ కార్యక్రమం నిర్వహించారు. ఉత్సవ ఏర్పాట్లపై ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ సాయంత్రం పరిశీలించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.  

ఏర్పాట్లు ఇలా..

హనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాలకు దాదాపు 2 లక్షల మంది దీక్షాపరులు తరలివచ్చే అవకాశం ఉన్నట్లు, కొండగట్టు పరిసరాల్లో 55 తాత్కాలిక, 64 శాశ్వత మరుగుదొడ్లను సిద్ధం చేసినట్లు ఈవో వెంకటేశ్‌, ఏఈవో బుద్ది శ్రీనివాస్‌, ఏఈ లక్ష్మణ్‌రావు తెలిపారు. 1500 నాయీబ్రాహ్మణులు, కొండగట్టు దిగువ, పైన ఏడు ప్రాంతాల్లో భక్తుల వాహనాల పార్కింగ్‌కు స్థలాన్ని సిద్ధం చేసినట్లు వివరించారు. శుద్ధజలం అందించేందుకు 5 సంచార ఆటోలు, 28 చోట్ల చలివేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు, కొత్తకోనేరులో ఎప్పటికప్పుడు నీళ్లను నింపడంతోపాటు 120 షవర్లు ఏర్పాటు చేశామన్నారు. కొండపై చరవాణి సిగ్నల్‌కు అంతరాయం ఏర్పడకుండా జియోతోపాటు 4 రోజులపాటు తాత్కాలికంగా ఎయిర్‌టెల్‌ సేవలు అందించడానికి ఏర్పాట్లు చేశామని, ప్రసాదం విక్రయానికి 12 కౌంటర్లు ఏర్పాటు చేయడంతోపాటు టిక్కెట్ల రీఇష్యూ, అక్రమ వసూళ్లపై ప్రత్యేక నిఘా ఉంటుందని ఈవో పేర్కొన్నారు. రాత్రి వేళల్లో కొండగట్టుకు వచ్చే దీక్షాపరులు ప్రమాదాల బారిన పడకుండా వారి బ్యాగులకు, వెనుకవైపు దుస్తులకు రేడియం స్టిక్కర్లు అంటించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని, దారివెంట సేదతీరడానికి ప్రధాన రహదారి పక్కన పలుచోట్ల తడికల పందిళ్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఉత్సవాల్లో విధులు నిర్వరించే అధికారులు, సిబ్బందితోపాటు భక్తులకు ఉచిత అన్నదానం ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. 16 కళాబృందాలు ఆలయ పరిసరాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయన్నారు.

భక్తులకు సూచనలు..

హనుమాన్‌ పెద్ద జయంతి ఉత్సవాల సందర్భంగా కొండగట్టు అంజన్న దర్శనం కోసం వచ్చే దీక్షాపరులు, భక్తులు తమ వాహనాలను నిర్ణీత పార్కింగ్‌ ప్రదేశాల్లో నిలిపి కాలినడకన ఆలయానికి వెళ్లాలి. కొండపైకి పోలీసులు ఎలాంటి వాహనాలను అనుమతించరు. ఎండ తీవ్రత కారణంగా ఉదయం, సాయంత్రం వేళల్లో పాదయాత్రతో కొండపైకి చేరుకోవడం చాలా మంచిది. జగిత్యాల ప్రధాన రహదారి నుంచి వచ్చే భక్తులు ఘాట్‌రోడ్డు మీదుగా లేదా మెట్లదారిలో కరీంనగర్‌వైపు నుంచి వచ్చే వారు జేఎన్టీయూ కళాశాల మీదుగా  ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. జిల్లా కలెక్టరు ఆదేశాల మేరకు వివిధ శాఖల అధికారులు, సిబ్బంది ఆలయంలో విధులు నిర్వర్తిసారు. జిల్లా ఎస్పీ నేతృత్వంలో పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని