logo

వానాకాలం సాగు ప్రణాళిక ఖరారు

జిల్లాలో వానాకాలం పంటల సాగు ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. నీటి వనరుల ఆధారంగా క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అధికారులు రైతుల నుంచి పంటల వివరాలు సేకరించారు. ఏ రకమైన పంటలు, ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తారనే అంచనాతో జాబితా సిద్ధం చేశారు.

Published : 19 May 2024 03:23 IST

జిల్లాలో 2,77,723 ఎకరాల్లో పంటల అంచనా

న్యూస్‌టుడే, పెద్దపల్లి కలెక్టరేట్‌: జిల్లాలో వానాకాలం పంటల సాగు ప్రణాళికలు రూపుదిద్దుకున్నాయి. నీటి వనరుల ఆధారంగా క్షేత్ర స్థాయిలో వ్యవసాయ అధికారులు రైతుల నుంచి పంటల వివరాలు సేకరించారు. ఏ రకమైన పంటలు, ఎన్ని ఎకరాల్లో సాగు చేస్తారనే అంచనాతో జాబితా సిద్ధం చేశారు. జిల్లాలో నీటి వనరులు సమృద్ధిగా ఉండటంతో ఎప్పటిమాదిరిగానే ఈసారి కూడా వరి పంటకు పెద్దపీట వేశారు. గతేడాది కంటే సాగు విస్తీర్ణం స్వల్పంగా పెంచుతూ ప్రతిపాదించారు. రైతులకు అవసరమైన విత్తనాలు సమకూరుస్తూనే ఉద్యాన పంటలైన ఆయిల్‌పామ్, మామిడి, కూరగాయల సాగును అధికారులు ప్రోత్సహిస్తున్నారు. విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా పర్యవేక్షిస్తున్నారు.

ఇసుక మేటలతో తగ్గనున్న విస్తీర్ణం

గోదావరి, మానేరు, హుస్సేన్‌మియా, మానేరు పరీవాహక ప్రాంతాల్లో అధిక విస్తీర్ణంలో వరి సాగవుతోంది. గడిచిన మూడేళ్ల సాగు గణాంకాలు పరిశీలిస్తే విస్తీర్ణం స్వల్పంగా పెరుగుతోంది. 2022-23లో 1,93,200 ఎకరాలు, 2023-24లో 2,77,003 ఎకరాలు ఉండగా ప్రస్తుతం 2,77,723 ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగవుతాయని భావిస్తున్నారు. ఆయకట్టు ప్రాంతం కావడంతో పప్పుదినుసుల సాగు అంతంత మాత్రంగానే ఉంది. ఇటీవలి కాలంలో కొందరు ఆయిల్‌సామ్‌ సాగుకు ముందుకొస్తున్నారు. జిల్లాలో 2,500 ఎకరాల్లో మొక్కలు నాటుతారని అంచనా వేశారు. గతేడాది భారీ వర్షాలకు గోదావరి, మానేరు పరీవాహక ప్రాంతంలోని పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో ఈసారి సాగు విస్తీర్ణం కొద్దిగా తగ్గనుందని భావిస్తున్నారు. 

కృత్రిమ కొరత లేకుండా..

జిల్లాలో విత్తనాలు, ఎరువుల కొరత లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వరి, పత్తి, ఇతర పంటల విత్తనాలు అందుబాటులో ఉండేలా చూస్తున్నారు. రాయితీ విత్తనాలను కూడా సమకూరుస్తున్నారు. ఇప్పటికే 24,384 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, యూరియా, కాంప్లెక్స్‌ పొటాష్, ఇతర ఎరువులు నిల్వ ఉన్నాయి. వీటితో పాటు 32,082 మెట్రిక్‌ టన్నుల యూరియా, 8,280 మెట్రిక్‌ టన్నుల డీఏపీ, 24,579 మెట్రిక్‌ టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు, 6,889 మెట్రిక్‌ టన్నుల పొటాష్‌ అవసరమవుతాయి. సీజన్‌లో కీలక సమయంలో కొందరు డీలర్లు ఎరువుల కృత్రిమ కొరత సృష్టించి రైతులను ఇబ్బందులకు గురి చేస్తుండటంతో పునరావృతం కాకుండా అధికారులు చర్యలు  తీసుకుంటున్నారు. 

నకిలీ ఉత్పాదకాలపై నిఘా

జిల్లాలో వాతావరణ పరిస్థితులకనుగుణంగా పంటల సాగు ప్రణాళిక రూపొందించాం. చీడపీడలు, తెగుళ్లు నివారణకు రైతుల్లో అవగాహన కల్పిస్తున్నాం. నకిలీ ఎరువులు, విత్తనాల విక్రయంపై నిఘా పెంచి టాస్క్‌ఫోర్స్‌ కమిటీలతో తనిఖీ చేయనున్నాం. నిబంధనలకు విరుద్ధంగా విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవు. 

-ఆదిరెడ్డి, జిల్లా వ్యవసాయ అధికారి 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని