logo

అదనపు బస్సులు లేక.. ఉన్నవి సరిపోక

ఆధ్యాత్మిక క్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి దర్శనానికి రాష్ట్రంలోని వివిధ  ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి రోజూ వేలాది మంది తరలి వస్తుంటారు. రాజన్న దర్శనానికి వచ్చే వారిలో ఎక్కువ సంఖ్యలో పేదలు వస్తుంటారు.

Published : 13 Jun 2024 04:29 IST

రాజన్న భక్తులు, ప్రయాణికులకు తిప్పలు
న్యూస్‌టుడే, వేములవాడ 

ధ్యాత్మిక క్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి దర్శనానికి రాష్ట్రంలోని వివిధ  ప్రాంతాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి రోజూ వేలాది మంది తరలి వస్తుంటారు. రాజన్న దర్శనానికి వచ్చే వారిలో ఎక్కువ సంఖ్యలో పేదలు వస్తుంటారు. వీరు చాలా వరకు ఆర్టీసీ ప్రయాణంపైనే ఆధారపడుతుంటారు. వీరితో పాటు వేములవాడ పట్టణానికి చుట్టు పక్కల ప్రాంతాల నుంచి ప్రయాణికులు వివిధ పనుల కోసం వస్తుంటారు. దీంతో నిత్యం ఆర్టీసీ బస్టాండ్‌ భక్తులు, ప్రయాణికులతో సందడిగా ఉంటుంది. వేములవాడ పట్టణానికి వచ్చే భక్తులు, ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. అయితే అందుకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులు లేవు. ఫలితంగా ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి నెలకొంది.

రాజన్న దర్శనానికి ప్రతి సోమ, ఆది, శుక్రవారాల్లో భారీగా భక్తులు వస్తుంటారు. ఆయా రోజుల్లో ఆర్టీసీ బస్టాండ్‌ భక్తులు, ప్రయాణికులతో కిక్కిరిసిపోతోంది. ఉన్న బస్సులు సరిపోక వీరు పడే బాధలు వర్ణణాతీతం. అరకొర బస్సులతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నప్పటికీ ఆర్టీసీ అధికారులు మాత్రం బస్సుల సంఖ్యను పెంచేందుకు చర్యలు చేపట్టకపోవడంపై నిరసన వ్యక్తమవుతోంది. బస్సు సామర్థ్యానికి మించి ప్రయాణికులను తీసుకెళ్లాల్సి రావడం ఆందోళన కలిగిస్తోంది. మహిళలకు ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించడంతో రద్దీ మరింత పెరిగింది.

కొత్తవి రాక...

వేములవాడ ఆర్టీసీ డిపో చాలా ఏళ్లుగా 65 బస్సులతోనే కొనసాగుతోంది. అదనపు బస్సుల మంజూరు కోసం అధికారులు ప్రతిపాదనలు పంపినప్పటికీ మోక్షం లభించలేదు. గతంలో కన్నా ప్రస్తుతం ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయినా అవే బస్సులతో అధికారులు కాలం వెల్లదీస్తున్నారు. దీంతో ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. ముఖ్యంగా వేములవాడ నుంచి ఎక్కువ సంఖ్యలో పది డీలక్స్‌లు, మరో పది ఎక్స్‌ప్రెస్‌ బస్సులు హైదరాబాద్‌కు నడుస్తుంటాయి. మిగతావి వరంగల్, కరీంనగర్, కోరుట్ల, జగిత్యాల పట్టణాలతో పాటు గ్రామీణ ప్రాంతాలకు తిప్పుతుంటారు. ఇవి రాజన్న భక్తులు, ప్రయాణికులకు ఏ మూలకు సరిపోవడం లేదు. హైదరాబాద్, వరంగల్‌ వైపు నుంచి అధిక సంఖ్యలో రాజన్న దర్శనానికి వస్తుంటారు. ఆది, సోమ, శుక్రవారాల్లో బస్టాండ్‌ జాతరను తలపిస్తోంది. ఇటీవల పాఠశాలలు పునఃప్రారంభానికి ముందు రోజుల్లో నిత్యం పండగ వాతావరణం నెలకొంది. ఇలాంటి సందర్భంలో ఆర్టీసీ అధికారులు ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని పెద్ద డిపోల నుంచి అయిదు, చిన్న డిపోల నుంచి మూడు చొప్పున 40 నుంచి 50 బస్సులను రప్పించి వేములవాడ డిపో నుంచి నడిపిస్తున్నప్పటికీ అవి కూడా చాలడం లేదు. ఇప్పటికైనా ఆర్టీసీ అధికారులు అదనపు బస్సులను రప్పించి రాజన్న భక్తులు, ప్రయాణికులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.


ప్రతిపాదనలు పంపాం

- మురళీకృష్ణ, డిపో మేనేజర్, వేములవాడ 

వేములవాడ డిపోలో ఉన్న బస్సులు ప్రస్తుతం భక్తులు, ప్రయాణికుల రద్దీకి సరిపోవడం లేదు.  సోమ, ఆది, శుక్రవారాల్లో ఇతర డిపోల నుంచి 40 నుంచి 50 బస్సుల వరకు రప్పించి వేములవాడ నుంచి నడిపిస్తున్నాం. అయినా ప్రయాణికులకు సరిపోక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. కొత్తగా డిపోకు 23 బస్సుల కోసం ప్రతిపాదనలు పంపించాం. అవి వస్తే కొంత వరకు ఇబ్బందులు తొలగిపోతాయి.

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని