logo

గృహ లబ్ధిదారుల ఎడతెగని నిరీక్షణ

ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చాలాచోట్ల పూర్తయినా వాటిని లబ్ధిదారులకు కేటాయించడం లేదు. రామగుండం మండలంలోని మల్కాపూర్‌ సమీపంలో నిర్మించిన రెండు పడకగదుల ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు.

Updated : 13 Jun 2024 05:11 IST

న్యూస్‌టుడే, గోదావరిఖని

ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం చాలాచోట్ల పూర్తయినా వాటిని లబ్ధిదారులకు కేటాయించడం లేదు. రామగుండం మండలంలోని మల్కాపూర్‌ సమీపంలో నిర్మించిన రెండు పడకగదుల ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. అసలైన నిరుపేదలకు ఇళ్లను అందించేందుకు ప్రభుత్వం డ్రా పద్ధతిలో ఎంపిక చేసింది. మండలంలో ఒకే ప్రాంతంలో నిర్మాణం పూర్తి చేసిన 660 ఇళ్లకోసం వేలాది మంది దరఖాస్తు చేసుకున్నారు. అర్హులైన వారి జాబితా తయారు చేసి 2023 మార్చి 16న గోదావరిఖని సింగరేణి కమ్యూనిటీహాలులో డ్రా తీశారు. ఇందులో రిజర్వేషన్ల ఆధారంగా లబ్ధిదారుల జాబితా తయారు చేసి డ్రా ద్వారా ఎంపికైన వారికి అందులో ఇళ్లు కేటాయిస్తామని అధికారులు ప్రకటించారు. మొత్తం 660 మందిని డ్రా ద్వారా ఎంపిక చేయగా ఇప్పటి వరకూ ఇళ్లు కేటాయించలేదు. వాటిని తమకు కేటాయిస్తారా లేదంటే మళ్లీ ఏదైనా కొత్త విధానం తీసుకువస్తారా అన్న సందేహాన్ని లబ్ధిదారులు వ్యక్తం చేస్తున్నారు.

సమకూరని వసతులు 

రెండు పడక గదుల ఇళ్ల నిర్మాణం పనులు పూర్తి చేసిన అధికారులు వాటిలో మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించలేదు. ఆయా నిర్మాణాలు నివాసయోగ్యంగా లేకపోవడంతో అధికారులు వాటిని లబ్ధిదారులకు అప్పగించనట్లు తెలుస్తోంది. మల్కాపూర్‌ సమీపంలో నిర్మించిన 660 ఇళ్లకు సంబంధించి నీటి సౌకర్యం కోసం పైపులైను పనులు చేపట్టాల్సి ఉంది. కొన్ని ఇళ్లకు ఇంకా తలుపులు బిగించలేదు. డ్రైనేజీ నీరు వెళ్లేందుకు కాలువలు, విద్యుత్తు దీపాల కోసం స్తంభాలు ఏర్పాటు చేయాల్సి ఉంది.


తప్పని ఆందోళన

డ్రా ద్వారా ఎంపికైన 660 మంది లబ్ధిదారులు తమకు ఇళ్లను కేటాయించాలని ఆందోళన బాట పడుతున్నారు. ఇది వరకే తహసీల్దార్‌ కార్యాలయం ముందు ధర్నా చేయగా తాజాగా మంగళవారం సైతం ఆందోళన చేపట్టి తహసీల్దార్‌కు వినతి పత్రం అందజేశారు. తమకు వెంటనే ఇళ్లు కేటాయించాలని విన్నవించారు. ఏడాది గడచిపోయినా తమకు ఇళ్లు కేటాయించకుండా జాప్యం చేస్తున్నారని పేర్కొన్నారు. 


ఇంకా కొన్ని పనులు చేపట్టాలి

- కుమారస్వామి, తహసీల్దార్, రామగుండం

రెండు పడక గదుల ఇళ్లకు సంబంధించిన కొన్ని పనులు చేపట్టాల్సి ఉంది. వాటిని పూర్తి చేయగానే లబ్ధిదారులకు అప్పగిస్తాం. నివాస యోగ్యంగా లేని ఇళ్లను కేటాయించడం ద్వారా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. మిగిలిపోయిన పనులు పూర్తి కాగానే లబ్ధిదారులకు అప్పగిస్తాం. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని