logo

బూడిద చుట్టూ రాజకీయ చిచ్చు!

బూడిద రవాణా వ్యవహారం రాజకీయ దుమారం లేపుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకుల పరస్పర విమర్శలకు కేంద్రంగా మారింది.

Published : 13 Jun 2024 04:54 IST

మరోసారి చర్చనీయాంశమైన తరలింపు వ్యవహారం
ఈనాడు, కరీంనగర్, పెద్దపల్లి

బూడిద రవాణా వ్యవహారం రాజకీయ దుమారం లేపుతోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకుల పరస్పర విమర్శలకు కేంద్రంగా మారింది. రామగుండం ఎన్టీపీసీ పరిశ్రమ నుంచి వెలువడే బూడిద రవాణాకు సంబంధించి కాంగ్రెస్, భారాస నేతల మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ పెరుగుతోంది. రవాణాలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఓ పార్టీ ఆరోపిస్తుండగా.. రాజకీయ కక్షతోనే ఆరోపణలు చేస్తున్నారని మరో పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. 

పెద్దపల్లి జిల్లా అంతర్గాం మండలం కుందనపల్లి చెరువు నుంచి ఇతర ప్రాంతాలకు కొన్నేళ్లుగా బూడిద తరలిస్తున్నారు. ‘అక్రమ రవాణాతో పాటు ప్రతి రోజూ రూ.లక్షల్లో అవినీతి జరుగుతోందని, ఇందుకు అధికార పార్టీ ముఖ్య నేత సహకారముంద’ని హుజూరాబాద్‌ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపణలు ఉమ్మడి జిల్లాలో చర్చకు దారి తీశాయి. తాను స్వయంగా కొన్ని లారీలను పట్టించినప్పటికీ రవాణా శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని ఆయన పేర్కొంటుండగా, ఈ ఆరోపణలను కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ప్రణవ్‌ ఖండించారు. కౌశిక్‌రెడ్డి అబద్ధాలు చెబుతున్నారని, అధికారులు కేసులు నమోదు చేశారనే విషయాన్ని ఆధారాలతో చూపించారు. బూడిద తరలింపు వ్యవహారంలో తమ పార్టీకి సంబంధం లేదని చెప్పడానికి తాను చర్చకు సిద్ధమని సవాల్‌ విసిరారు. 

పక్కా పర్యవేక్షణతోనే అడ్డుకట్ట

ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చే బూడిద తరలింపు వ్యవహారంపై రవాణా శాఖ అధికారులు పక్కాగా పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది. తరలింపు కేంద్రం వద్ద సీసీ కెమెరాల నిఘాతో పాటు రోజూవారీగా ఎన్ని వాహనాలు వెళ్తున్నాయనే విషయమై వివరాలు పక్కాగా ఉంటేనే బూడిద రవాణా ప్రక్రియ పారదర్శకంగా సాగే వీలుంది. అంతేకాకుండా వాహనాలను మార్గమధ్యంలో తనిఖీలు చేయడం వల్ల అక్రమాలకు అడ్డుకట్ట వేసే అవకాశముంది. మోతాదు కంటే అధిక పరిమాణంలో సరఫరా చేస్తుండటంతో లారీల వెనుక ప్రయాణించే ద్విచక్రవాహనదారులు అవస్థలు పడుతున్నారు. రామగుండం నుంచి రాజీవ్‌ రహదారి సహా హుజూరాబాద్, వరంగల్‌ మార్గంలో నిత్యం వివిధ జిల్లాలకు పెద్ద ఎత్తున బూడిద రవాణా జరుగుతోంది. రాత్రింబవళ్లు వందలాది వాహనాలు వెళ్తుండటంతో ప్రమాదాలు పెరుగుతున్నాయి. లారీలతో పలు చోట్ల రహదారులు ధ్వంసమవుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్రమాలు, అవినీతికి తావు లేకుండా బూడిద రవాణా ప్రక్రియ నిర్వహించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది. ఈ విషయమై పెద్దపల్లి జిల్లా రవాణా శాఖ అధికారి రంగారావును ‘ఈనాడు’ వివరణ కోరగా ఇటీవలి కాలంలో 70 వరకు అనుమతి లేని బూడిద లారీలను పట్టుకొని జరిమానా విధించామని చెప్పారు. బూడిద తరలింపులో నిబంధనలు పాటించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.


యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన

రామగుండంలోని బొగ్గు ఆధారిత ఎన్టీపీసీ విద్యుత్తు పరిశ్రమ నుంచి వెలువడే తడి, పొడి బూడిదను అంతర్గాం మండలం కుందనపల్లిలోని ప్రత్యేక చెరువులో నింపుతారు. 500 ఎకరాల్లో ఉన్న ఈ చెరువులో ప్రతి రోజూ టన్నుల కొద్దీ బూడిదను డంప్‌ చేస్తారు. ఇక్కడి బూడిదను రహదారుల నిర్మాణానికి, ఇటుకల తయారీకి వినియోగిస్తారు. ఎప్పటికప్పుడు తరలించేందుకు టెండర్లు పిలుస్తారు. కాగా లారీలో గరిష్ఠంగా 40 టన్నుల బూడిదను తీసుకెళ్లాల్సి ఉండగా, పక్కలకు చెక్కలు కట్టి అదనంగా మరో 15-20 టన్నులు రవాణా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే రవాణా చేసే లారీకి తప్పనిసరిగా నంబరు ఉండాలి. కానీ నంబరు ప్లేటు లేని వాహనాల్లో యథేచ్ఛగా తరలిస్తూ కొందరు అవినీతికి పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా బూడిద రవాణా జరుగుతోందని, ఇందుకు లెక్కా పత్రం ఉండటం లేదనే విమర్శలున్నాయి. పెద్దపల్లి జిల్లాలోని పలు ఇటుక బట్టీలకు, క్వారీల్లో గుంతలు పూడ్చేందుకు కూడా బూడిదను వినియోగిస్తున్న దాఖలాలున్నాయి. అలాగే ఎక్కడ పడితే అక్కడ బూడిద నిల్వలు కనిపిస్తుండగా, ఇది చెరువు నుంచి అక్రమంగా తరలించినదేనంటూ పలువురు గతంలో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన సందర్భాలున్నాయి.   

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని