logo

అప్రమత్తతతో వ్యాధులు దూరం

వర్షాకాలంలో నీటి నిల్వలు, అపరిశుభ్ర వాతావరణంతో వ్యాధులు ప్రబలుతాయి. తగు జాగ్రత్తలు పాటించకుంటే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది.

Published : 13 Jun 2024 04:40 IST

న్యూస్‌టుడే, జగిత్యాల, రాయికల్‌

ర్షాకాలంలో నీటి నిల్వలు, అపరిశుభ్ర వాతావరణంతో వ్యాధులు ప్రబలుతాయి. తగు జాగ్రత్తలు పాటించకుంటే అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. జిల్లాలో సుమారు 11 లక్షల జనాభా ఉండగా 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, జగిత్యాల జిల్లా ఆసుపత్రి, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురిలో సామాజిక ఆసుపత్రులు ఉన్నాయి. ఏటా ఆయా ఆసుపత్రుల్లో జ్వరాల నివారణకు ప్రత్యేక పడకలు ఏర్పాటు చేస్తున్నారు. నీటి కుంటల ద్వారా వృద్ధి చెందే మూడు రకాల దోమలు పలు రకాల వ్యాధులను వ్యాప్తి చేస్తాయి. జ్వరాలతో పాటు వర్షాకాలంలో ఈగల ద్వారా అతిసారం లాంటి వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

స్థానిక సంస్థల పాత్ర

పురపాలికలు, పంచాయతీ సిబ్బంది కాలనుగుణ వ్యాధుల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి ఉంది. డెంగీ, మలేరియా జ్వరాలు ప్రబలినప్పుడు మాత్రమే వైద్యశాఖ ప్రోద్బలంతో దోమల నివారణ మందు పిచికారీ చేయిస్తున్నారు. నీటి కుంటలలో ఆయిల్‌ బాల్స్, దోమల నివారణకు గంబూసియా చేపలను విడవాల్సి ఉంది. గ్రామాల్లో నీటి కుంటలు, ఇళ్ల పరిసరాల్లో ఇతర వస్తువులలో నీరు నిల్వకుండా ప్రతి శుక్రవారం డ్రైడే నిర్వహించాలి. నీటి ట్యాంకులను క్లోరినేషన్‌ చేయాలి. గ్రామాల్లో చెత్తను ఎప్పటికప్పుడు తరలించాలి. దోమల లార్వాలను వృద్ధి చెందకుండా నియంత్రించాలి.

వైద్య ఆరోగ్యశాఖ.. 

వైద్య ఆరోగ్యశాఖలో కీటకజనిత వ్యాధుల నివారణకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. మండల స్థాయిలో టాస్క్‌ఫోర్స్‌ బృందాలతో పాటు ఈనెల 30 వరకు మలేరియా నివారణ వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. మలేరియా, డెంగీ తదితర వ్యాధుల నివారణకు గ్రామాల్లో ముందస్తు చర్యలు చేపడుతున్నారు. వ్యాధులు ప్రబలిన ప్రదేశాల్లో ప్రత్యేక వైద్య శిబిరాల ద్వారా చికిత్స అందిస్తూనే ఇంటింటి సర్వే చేసి బాధితులను గుర్తిస్తున్నారు. పుర, పంచాయతీ అధికారుల సహకారంతో పారిశుద్ధ్య చర్యలు చేపట్టాల్సి ఉంది. అన్ని ఆసుపత్రులలో మందులు, వ్యాధుల నివారణకు టీహబ్‌ ద్వారా రక్త నమూనాలు సేకరించి పరీక్షలు చేస్తున్నారు.


ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని వసతులు

- డా.ఎన్‌.శ్రీనివాస్, జిల్లా ఉపవైద్యాధికారి

జిల్లాలో ఈ ఏడాది వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నాం. గ్రామాల్లో ఈనెల 30 వరకు మలేరియా నివారణ మాసోత్సవాలు నిర్వహిస్తున్నాం. ప్రభుత్వ ఆసుపత్రుల్లో జ్వర పీడితుల చికిత్సకు ప్రత్యేక వార్డులున్నాయి. అన్ని ప్రాథమిక ఆసుపత్రుల్లో ప్రత్యేకంగా సేవలు అందిస్తున్నాం. గ్రామాల్లో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా అవగాహనతో పాటు ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తాం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని