logo

సామాజిక సేవకు వేదిక

ప్రస్తుతం సామాజిక మాధ్యమాలను కాలక్షేపానికి వినియోగిస్తుండగా.. ధర్మపురికి చెందిన రేణికుంట రమేష్‌ గత 9 ఏళ్లుగా ఫేస్‌బుక్‌ ద్వారా పేదల జీవితాల్లో కాంతులు నింపుతున్నారు.

Published : 13 Jun 2024 04:48 IST

ఫేస్‌బుక్‌ ద్వారా రూ.1.60 కోట్ల విరాళాలు
నిరుపేదల ఇళ్లకు, విద్య, వైద్యానికి సాయం
న్యూస్‌టుడే, ధర్మపురి

ప్రస్తుతం సామాజిక మాధ్యమాలను కాలక్షేపానికి వినియోగిస్తుండగా.. ధర్మపురికి చెందిన రేణికుంట రమేష్‌ గత 9 ఏళ్లుగా ఫేస్‌బుక్‌ ద్వారా పేదల జీవితాల్లో కాంతులు నింపుతున్నారు. రమేష్‌ ఫేస్‌బుక్‌ వేదికగా ఇప్పటి వరకు 130 మంది నిరుపేదలకు రూ.1.60 కోట్లు దాతల ద్వారా అందించారు. వీటితో 26 మంది నిరుపేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వగా.. మిగతా వారికి వైద్యం, విద్య పరంగా సాయం చేశారు. రమేష్‌ క్షేత్ర స్థాయిలో నిరుపేదలను గుర్తించి.. వారి పరిస్థితిని, సమస్యలను, బ్యాంకు ఖాతా వివరాలతో సహా ఫేస్‌బుక్‌లో పోస్టులు పెడతారు. దీంతో దాతలు నేరుగా బాధితులకు నగదు సాయం అందిస్తున్నారు. కొందరు దాతలు రమేష్‌ను చరవాణి ద్వారా సంప్రదిస్తూ శుభకార్యాల సందర్భంగా పేదలకు ఇళ్లు నిర్మించేందుకు ముందుకు వస్తున్నారు. కేవలం ఒక ప్రాంతానికే పరిమితం కాకుండా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలకు రమేష్‌ తన సేవలు విస్తరించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు, కర్ణాటకకు చెందిన బళ్లారి మిత్రులు, జగిత్యాలకు చెందిన సత్యసాయి అభయహస్తం సభ్యులు, సినీ హీరో చిరంజీవి అభిమానులు తదితరులు విరాళాలు అందిస్తూ పేదలకు అండగా నిలుస్తున్నారు. 

మొదటి పోస్టు

బుద్దేశ్‌పల్లికి చెందిన రాగుల సత్తయ్య-దుర్గ దంపతుల కూతురు వైష్ణవికి 2015లో మెదడులో రక్తం గడ్డ కట్టి కాళ్లు చేతులు పడిపోయి మంచానికే పరిమితమైంది. శస్త్రచికిత్సకు రూ.3 లక్షలు ఖర్చు అవుతాయని వైద్యులు చెప్పడంతో కూలీ పనులు చేసే ఆ దంపతులకు దిక్కుతోచలేదు. దీంతో మొదటిసారిగా రమేష్‌ వైష్ణవి పరిస్థితిపై సామాజిక మాధ్యమంలో దాతలు నుంచి సాయం కోరడంతో అనూహ్య స్పందన వచ్చింది. రూ.9 లక్షలు రావడంతో వైష్ణవికి రూ.3 లక్షలతో శస్త్రచికిత్స చేయించి.. రూ.6 లక్షలను ఆ చిన్నారి పేరు మీద ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేశారు. 


ప్రస్తుతం సొంతంగా పనులు 

బూరుగుపల్లికి చెందిన సౌదాని కొమురక్క తీవ్ర అనారోగ్యఆనికి గురై కాళ్లు చేతులు పడిపోవడంతో మంచానికే పరిమితమైంది. నిరుపేద కుటుంబానికి చెందిన వారు కావడంతో వైద్యానికి డబ్బులు లేక ముగ్గురు పిల్లలతో భర్త రాజన్నకు ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో రమేష్‌ ఫేస్‌బుక్‌ పోస్టు ద్వారా దాతలు రూ.1.30 లక్షలు సాయం అందించడంతో హైదరాబాద్‌లో వైద్యం చేయించుకుని ప్రస్తుతం సొంతంగా పనులు చేసుకుంటోంది. 


చిన్నారికి సాయం

తుమ్మెనాలకు చెందిన వలస కార్మికుడు శెకెల్లి పోషన్న, బీడీ కార్మికురాలు మమత దంపతుల కూతురు శెకెల్లి శ్రీకృతి బోన్‌మ్యారో వ్యాధితో బాధపడుతుండగా.. వైద్యం కోసం ఆ తల్లిదండ్రులు పడరాని పాట్లు పడ్డారు. ఈ సమయంలో దాతలు రమేష్‌ రూ.2.61 లక్షలు విరాళాలు అందించగా.. హైదరాబాద్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయించుకుని ప్రస్తుతం పాఠశాలకు వెళుతోంది.


ఇల్లు నిర్మించి ఇచ్చారు

ర్మపురికి చెందిన పోచంపల్లి జమునకు ఇద్దరు కూతుళ్లు. కొడుకు పుట్టలేదని భర్త నాలుగేళ్ల కిందట వదిలేసి వెళ్లగా.. కూలీ పనులు చేస్తూ ఇద్దరు కుమార్తెలను పోషిస్తూ గుడిసెలో ఉండేది. రమేష్‌ ఇచ్చిన సమాచారంతో ఏపీలోని జంగారెడ్డిగూడేనికి చెందిన సుంకర ప్రవీణ్‌ తన కుమారుడి పు±ట్టిన రోజు సందర్భంగా రూ.2.20 లక్షలతో ఇళ్లు నిర్మించి ఇచ్చారు. 


దాతల ప్రోత్సాహంతోనే... 

- రేణికుంట రమేష్, సామాజిక సేవకుడు(ధర్మపురి)  

గత తొమ్మిదేళ్లుగా ఫేస్‌బుక్‌ వేదికగా నిరుపేదలకు దాతల సాయంతోనే పేదలకు చేయూతనిస్తున్నారు. ఎన్నారైలతో పాటు కర్ణాటకలోని బళ్లారి మిత్రులు, ఇతర దాతలు సాయం అందిస్తున్నారు. కొందరు నిరుపేద విద్యార్థులకు చేయూత నివ్వగా, ప్రస్తుతం వారు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పేదలకు పరోక్షంగా సాయం అందించడం ఎంతో సంతృప్తిని కలిగిస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని