logo

విద్యా సంస్థల బస్సులకు ఫిట్‌నెస్‌ తప్పనిసరి

నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న వాహనాలపై జిల్లా రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం అధికారులు కొరఢా ఝళిపించారు.

Updated : 13 Jun 2024 05:10 IST

కరీంనగర్‌ రవాణా విభాగం, న్యూస్‌టుడే: నిబంధనలకు విరుద్ధంగా రోడ్లపై తిరుగుతున్న వాహనాలపై జిల్లా రవాణా శాఖ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగం అధికారులు కొరఢా ఝళిపించారు. బుధవారం కరీంనగర్, రేకుర్తితోపాటు పలు ప్రాంతాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు కొనసాగించారు. తనిఖీలను ఉమ్మడి జిల్లా ఉప రవాణా కమిషనర్‌ పురుషోత్తం స్వయంగా పరిశీలించడంతోపాటు అధికారులకు పలు సూచనలు చేశారు. తనిఖీల్లో 24 వాహనాలు పట్టుబడ్డాయి. వీటిలో 7 వాహనాలు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయనివి, 4 పరిమితికి మించి తరలిస్తున్న వాహనాలు, 9 పన్నులు చెల్లించకుండా తిరుగుతున్న గూడ్స్‌ వాహనాలు, 2 ఫిట్‌నెస్, టాక్స్‌ చెల్లించకుండా తిరుగుతున్న వాహనాలు, 2 టాక్స్‌ చెల్లించని ట్రాలీలు ఉన్నాయి. విద్యాసంస్థలు తమ వాహనాలకు ఫిట్‌నెస్‌ పరీక్షలు చేయించి ధ్రువీకరణ పత్రాలు పొందాలని.. డ్రైవింగ్‌ లైసెన్స్, బీమా, ఇతర పత్రాలు తప్పనిసరిగా బస్సులో అందుబాటులో ఉంచాలని..  వాహనదారులు త్రైమాసిక పన్నులు చెల్లించాలని.. లేనిచో తనిఖీల్లో పట్టుబడితే సీజ్‌ చేయడంతోపాటు అధిక జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు. పట్టుబడిన వాహనాలకు సంబంధించి చెక్‌ రిపోర్ట్‌ను ఇన్‌స్పెక్టర్లు తయారు చేసి సిస్టంలో అప్‌లోడ్‌ చేస్తారని చెప్పారు. తనిఖీలను ముమ్మరం చేయడంతో పాటు నిరంతరం కొనసాగిస్తామన్నారు. తనిఖీల్లో ఎంవీఐ రవికుమార్, ఏఎంవీ స్రవంతి, అభిలాష్, సిబ్బంది పాల్గొన్నారు. రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మంగళవారం హైదరాబాద్‌లో రవాణా శాఖ అధికారులతో సమావేశమై రాష్ట్రవ్యాప్తంగా తనిఖీలను ముమ్మరం చేయాలని, నిబంధనల ఉల్లంఘనల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించినట్లు సమాచారం.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని