logo

అవస్థల్లో అంగన్‌వాడీలు

అంగన్‌వాడీల నిర్వహణ భారంగా మారింది. నెలల తరబడి నిధులు విడుదల కాకపోవడంతో సిబ్బంది వెతలు అంత ఇంత కాదు. చిన్నపాటి ఉద్యోగం చేసే వాళ్లకు చేతినుంచి డబ్బులు పెట్టడం ప్రహాసనంగా మారింది.

Published : 13 Jun 2024 04:53 IST

బిల్లులు రాక ఎదురుచూపులు
న్యూస్‌టుడే, కరీంనగర్‌ మంకమ్మతోట

అంగన్‌వాడీల నిర్వహణ భారంగా మారింది. నెలల తరబడి నిధులు విడుదల కాకపోవడంతో సిబ్బంది వెతలు అంత ఇంత కాదు. చిన్నపాటి ఉద్యోగం చేసే వాళ్లకు చేతినుంచి డబ్బులు పెట్టడం ప్రహాసనంగా మారింది. కేంద్రాలకు నెలల తరబడి అద్దెలు చెల్లించకపోవడంతో యజమానుల నుంచి తీవ్ర ఒత్తిడి పెరిగింది. వేతనాల నుంచి చెల్లిద్దామనుకున్న నెలల తరబడి వేతనాలు సైతం రాక అంగన్‌వాడీ టీచర్ల అవస్థలు అంత ఇంత కాదు. సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు మొర పెట్టుకున్నా ప్రయోజనం ఉండటం లేదు. రాష్ట్ర స్థాయిలో నిధులు విడుదల అయితేనే సమస్య పరిష్కారం అవుతుందని, అప్పటి వరకు మేం చేసేదేమీ లేదని జిల్లా స్థాయి అధికారులు సెలవిస్తున్నారు. నాలుగింట ఒక వంతు కేంద్రాల్లో అంగన్‌వాడీ సిబ్బంది ఖాళీలున్నాయి. సిబ్బంది భర్తీ ప్రక్రియ చేపడుతామని అంటున్నా.. ఇప్పటి వరకు కనీసం విధివిధానాలు సైతం విడుదల కాలేదు. భర్తీకి మరింత సమయం పట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. వేసవి సెలవుల అనంతరం కొంగొత్త ఉత్సాహంతో ప్రారంభం కావాల్సిన అంగన్‌వాడీ కేంద్రాలు.. సిబ్బంది ఖాళీలు, నిధుల లేమితో నిర్వహణ భారమై.. మంచి రోజుల కోసం ఎదురుచూస్తున్నాయి. తక్షణమే నిధులు విడుదల చేయాలని జిల్లా అంగన్‌వాడీ సిబ్బంది ముక్తకంఠంతో కోరుతున్నారు.


777 అంగన్‌వాడీలు.. 

జిల్లాలో కరీంనగర్‌ అర్బన్, కరీంనగర్‌ రూరల్, హుజూరాబాద్, గంగాధర నాలుగు ఐసీడీఎస్‌ ప్రాజెక్టులు ఉన్నాయి. వాటి పరిధిలో 777 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. ఏడు నెలల నుంచి మూడేళ్లలోపు చిన్నారులు 25 వేల మంది ఉన్నారు. కేంద్రాలకు వచ్చే మూడు నుంచి ఆరేళ్ల లోపు వారు ఏడు వేల మంది ఉన్నారు. గర్భిణులు, బాలింతలు కలిపి ఎనిమిది వేల మంది ఉంటారు. 


బాధ వినేవారు లేరు

- మమత, అంగన్‌వాడీ టీచరు

మా కష్టాలు తీర్చాలని ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా వినేవారు కరవయ్యారు. వేతనాలు సైతం నెలల తరబడి పెండింగ్‌ ఉంటున్నాయి. సమస్యల పరిష్కారానికి అధికారుల చుట్టూ ప్రదక్షిణలతోనే సరిపోతోంది. సకాలంలో వేతనాలతో పాటు కేంద్రాల సక్రమ నిర్వహణకు బకాయి పడ్డ నిధులు విడుదల చేయాలి. 


నిధులు విడుదల కావాల్సి ఉంది

- సరస్వతి, జిల్లా సంక్షేమ అధికారిణి

అంగన్‌వాడీ సిబ్బంది ఇబ్బంది పడుతున్న మాట వాస్తవం. ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కావాల్సి ఉంది. వేతనాలు, అద్దె, ఇతర అవసరాల కోసం నిధులు తప్పనిసరి. ఈ మేరకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. నిధులు విడుదల కాగానే సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని