logo

వనరుల పరిరక్షణకు కార్యాచరణ

చెరువులు, నీటి కుంటలు పెద్ద ఎత్తున ఆక్రమణకు గురవుతున్నాయి. మురుగు, రసాయనాలతో కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి.

Updated : 13 Jun 2024 05:10 IST

పట్టణాల్లో చెరువుల పరిస్థితిపై సమగ్ర సర్వే
మురుగును తటాకాల్లోకి వదలకుండా ఎస్టీపీల ఏర్పాటు
ఈనాడు, పెద్దపల్లి 

చెరువులు, నీటి కుంటలు పెద్ద ఎత్తున ఆక్రమణకు గురవుతున్నాయి. మురుగు, రసాయనాలతో కాలుష్య కాసారాలుగా మారుతున్నాయి. గతంలో నీటి వనరుగా ఉపయోగపడిన చెరువులు ప్రస్తుతం చాలా చోట్ల మురుగు నిల్వకు కేంద్రంగా మారాయి. ఈ క్రమంలో చెరువుల పునరుద్ధరణపై ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో భూగర్భ జలాలను కాపాడుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ మేరకు పురపాలక శాఖకు బాధ్యత అప్పగించింది. తటాకాల పరిరక్షణకు కృషి చేస్తున్న సంస్థలు, వివిధ రంగాల నిపుణులు, రాష్ట్రంలోని కమిషనర్లతో పురపాలక శాఖ సమీక్షలు నిర్వహించింది. పురపాలక, నీటిపారుదల, రెవెన్యూ శాఖలకు చెందిన ఇంజినీర్లు, అధికారులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది.

ఆక్రమణలో 30 శాతం వనరులు

కేంద్ర జలశక్తి శాఖ గతేడాది నిర్వహించిన ఓ అధ్యయనం ప్రకారం ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 30 శాతం చెరువులు, 40 శాతం కుంటలు ఆక్రమణలకు గురైనట్లు తేలింది. కరీంనగర్, రామగుండం, పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్ల, వేములవాడ వంటి పట్టణ ప్రాంతాల్లోనే ఎక్కువ శాతం కబ్జాలు జరిగినట్లు వెల్లడించింది. ఓవైపు ఆక్రమణలతో చెరువులు కుచించుకుపోగా మరోవైపు మురుగును నేరుగా తటాకాల్లోకే మళ్లిస్తున్నారని నివేదికల్లో తేలింది. సర్వేలో ఇలాంటి చెరువులను గుర్తించి అవసరమైన చోట్ల మురుగు శుద్ధి కేంద్రాలు(ఎస్టీపీలు) నిర్మించేలా చర్యలు తీసుకోవాలని పురపాలక అధికారులకు ఆదేశాలు అందాయి.


నెలాఖరులోగా పూర్తికి ఆదేశాలు

  • ఉమ్మడి జిల్లావ్యాప్తంగా మొత్తం 4,283 చెరువులున్నాయి. అంతటా కలిసి 2 లక్షల ఎకరాలకు పైగా ఆయకట్టున్నా 1.27 లక్షల ఎకరాలకు, అది కూడా ఒక పంటకు మాత్రమే నీరందేది. 
  • గత ప్రభుత్వం మిషన్‌ కాకతీయ కింద మొత్తం రూ.741.18 కోట్లతో 1,833 చెరువులను పునరుద్ధరించగా నీటి నిల్వ సామర్థ్యం 19.93 టీఎంసీలకు పెరిగింది. 
  • అయితే కొన్ని చెరువులు కళ తప్పాయి. మరికొన్ని చోట్ల ఆక్రమణకు గురయ్యాయి. పశువులు, కోళ్ల వ్యర్థాలు, మురుగుతో కాలుష్య కాసారాలుగా మారాయి. 
  • ఈ నేపథ్యంలో నాలుగు జిల్లాల పరిధిలో ముందు నగర, పట్టణ ప్రాంతాల్లోని చెరువులను ఎంపిక చేసి ఐఐటీ, స్వచ్ఛంద సంస్థల నిపుణుల సమష్టి భాగస్వామ్యంతో సమగ్ర సర్వే నిర్వహించనున్నారు. 
  • జూన్‌ నెలాఖరులోగా పూర్తి చేయాలని పురపాలిక కమిషనర్లకు బాధ్యత అప్పగించారు. 
  • ప్రతి పట్టణంలో ఎన్ని చెరువులున్నాయి? వాటి గరిష్ఠ సామర్థ్యం(ఎఫ్‌టీఎల్‌) ఎంత? బఫర్‌ జోన్‌ ఎంత? ఆక్రమణలున్నాయా? ప్రస్తుత పరిస్థితులు ఏమిటి? చెరువుల్లోకి వ్యర్థ జలాలు, కాలుష్య కారకాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? తటాకాలకు పూర్వ వైభవం తెచ్చేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? తదితర విషయాలపై సర్వే చేయాలని పురపాలక శాఖ ఆదేశాలు జారీ చేసింది. 
  • ఈ విషయమై పెద్దపల్లి పురపాలక కమిషనర్‌ ఆకుల వెంకటేశ్‌తో ‘ఈనాడు’ మాట్లాడగా ఈ నెలాఖరులోగా సర్వే పూర్తి చేయాలని ఆదేశాలు వచ్చాయన్నారు. మిగిలిన శాఖలతో సమన్వయం చేసుకొని కార్యాచరణ చేపట్టామన్నారు. 
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని