logo

చెక్‌డ్యాంల రక్షణ గోడలకు మరమ్మతులు

భూగర్భ జలాలను పెంపొందించేందుకు, వ్యవసాయ, బోరుబావుల్లో నీరు సమృద్ధిగా ఉండేలా ప్రభుత్వం మూలవాగులో చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టింది. అయితే గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు రక్షణ గోడలు కోతకు గురయ్యాయి.

Published : 17 Jun 2024 02:55 IST

రైతుల పొలాలను చదును చేయించిన అధికారులు
న్యూస్‌టుడే, కోనరావుపేట

భూగర్భ జలాలను పెంపొందించేందుకు, వ్యవసాయ, బోరుబావుల్లో నీరు సమృద్ధిగా ఉండేలా ప్రభుత్వం మూలవాగులో చెక్‌డ్యాంల నిర్మాణం చేపట్టింది. అయితే గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు రక్షణ గోడలు కోతకు గురయ్యాయి. వ్యవసాయ క్షేత్రాల్లోకి వరద చేరి పొలాల్లో ఇసుక మేటలు వేయడంతో సాగు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం నీటిపారుదలశాఖ అధికారులు మరమ్మతులు చేయించడం, పొలాలను చదును చేయించడంతో సాగుకు అనుకూలంగా మారాయి. 

కోనరావుపేట మండలం మరిమడ్ల శివారులోని మూలవాగులో రూ. 2.46 కోట్లు, వట్టిమల్ల-నిమ్మపల్లి గ్రామాల మధ్య రూ.3.72 కోట్లు, కొండాపూర్‌ శివారులో రూ.3.43 కోట్లు, వెంకట్రావుపేట-బావుసాయిపేట గ్రామాల మధ్య రూ.5.44 కోట్లు, నిజామాబాద్‌-మామిడిపల్లి మధ్య రూ.3.39 కోట్లు, కనగర్తి-మామిడిపల్లి మధ్య రూ.7.75 కోట్లతో మూలవాగులో చెక్‌డ్యాంలను నిర్మించారు. కొన్ని చోట్ల పూర్తి స్థాయిలో చెక్‌డ్యాంలకు ఇరువైపులా రక్షణ గోడలు పూర్తి చేయకుండానే వదిలేశారు. గత ఏడాది కురిసిన భారీ వర్షాలకు వచ్చిన వరదలకు చెక్‌డ్యాంల రక్షణ గోడలు కోతకు గురయ్యాయి. మరిమడ్ల, కొండాపూర్, నిజామాబాద్‌-మామిడిపల్లి చెక్‌డ్యాంల వద్ద సుమారు 50 ఎకరాల్లో ఇసుక మేటలు వేశాయి. వీటిలో సుమారు 10 ఎకరాల్లో పంట పొలాలు కోతకు గురై సాగుకు వీలు లేకుండా మారాయి. దీంతో రైతులు పలుమార్లు ఉన్నతాధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్లారు. నీటిపారుదలశాఖ అధికారులు గుత్తేదారులతో మాట్లాడి మరమ్మతులు చేయించారు. మరిమడ్లలో కోతకు గురైన చోట మట్టితో కట్ట పోసి యంత్రాలతో చదును చేయించారు. కొండాపూర్‌ శివారులోని చెక్‌డ్యాం వద్ద మూలమలుపు ఉండటంతో వరద పంట పొలాల్లోకి వెళ్లకుండా రక్షణ గోడ నిర్మాణంతో పాటు రాయి అమర్చి పటిష్ఠం చేశారు. మామిడిపల్లి చెక్‌డ్యాం రక్షణ గోడకు మరమ్మతు చేయించారు.


రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు

- సత్యనారాయణ, డీఈ, నీటిపారుదల శాఖ

ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు మూలవాగులోని చెక్‌డ్యాం నిర్మాణాలతో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ఠ చర్యలు తీసుకుంటున్నాం. కోతకు గురైన చెక్‌డ్యాం రక్షణ గోడలకు మరమ్మతు చేయిస్తున్నాం. మూలవాగు మధ్యలో చెట్లు, ఇసుక దిమ్మెలు ఏర్పడి వరద ప్రవాహానికి అడ్డుగా మారడంతో పంట పొలాలు కోతకు గురయ్యే అవకాశం ఉంది. వాటిని తొలగించడానికి అవసరమైన ఏర్పాట్లు చేయించాలని విప్‌ దృష్టికి తీసుకెళ్లాం. 


సాగుకు అనుకూలంగా...

- మారుపాక లక్ష్మణ్, బాధిత రైతు, మామిడిపల్లి 

గత ఏడాది భారీ వర్షాలు కురవడంతో చెక్‌డ్యాం రక్షణ గోడ కోతకు గురై పక్కనే ఉన్న మూడెకరాల వ్యవసాయ క్షేత్రం పూర్తిగా కోతకు గురైంది. రెండు మీటర్ల మేర పొలంలోని మట్టి కొట్టుకుపోయి సాగుకు వీలు లేకుండా పోయింది. పలుమార్లు అధికారులు, పాలకుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదు. ఇటీవల ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన నీటిపారుదలశాఖ అధికారులతో మాట్లాడి రక్షణ గోడ పటిష్ఠం చేయించారు. కోతకు గురైన వ్యవసాయ క్షేత్రంలో అధికారులే మట్టి నింపి చదును చేయించడంతో సాగుకు అనుకూలంగా మారింది. చెక్‌డ్యాం వద్ద కొంత మేర నీటి నిల్వ సామర్థ్యం తగ్గించేలా ప్రణాళికలు తయారు చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని